లడాయిలు తప్పనిసరి!
posted on Sep 12, 2012 9:50AM
ఏ పార్టీ అయినా అప్పుడప్పుడు ఆ పార్టీలోని కొందరివల్ల ఇబ్బందులు పడకతప్పదు. అది తప్పనిసరి. కాని కాంగ్రెస్‌పార్టీలో మాత్రం ప్రతి విషయంలోను నాయకుల మధ్య లడాయిలు తప్పవు. అసలు లడాయిలు లేందే ఆ పార్టీలోని నాయకులకు అస్సలు తోచనే తోచదు! పబ్లిసిటీ కోసం కూడా లడాయిలు సృష్టించుకుంటారనడం సత్యదూరమేంకాదు! ఇటీవల లేక్‌వ్యూ అతిథి గృహంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ అజాద్‌ను పెద్దపల్లి ఎం.పి. వివేక్, విజయవాడ ఎం. లగడపాటి కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమని కనుక ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలని వివేక్ కోరగా, లగడపాటి తెలంగాణా ఇస్తేనే కాంగ్రెస్ నష్టమని అనడంతో వివేక్, లగడపాటి మధ్య లడాయి ప్రారంభమై తెలంగాణా విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారని, విజయవాడ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేసుకుంటే మీకొచ్చే ఇబ్బంది ఏంటని వివేక్ అంటే, పెద్దపల్లిని రాజధానిగా చేసి తెలంగాణా రాష్ట్రం ఇస్తే తమకేమి అభ్యంతరం లేదని లగడపాటి ఎద్దేవా చేసినట్లు తెలిసింది. దీని బట్టి ఏం అర్ధమయిందయ్యా అంటే ఏ విషయంలోనైనా ఆ పార్టీలో లడాయిలు లేందే పొద్దుపోదు. లడాయిలు లేంది పార్టీ లేదు, లడాయిలంటే ఇష్టపడని నాయకులు ఈ పార్టీలో మమేకం కాలేరని అర్ధమవుతోంది.