లవ్ లెటర్లు కాదు.. జాబ్ లెటర్లు కావాలి! 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్ పై పాలనపై కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు. తమ హయాంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామంటూ మంత్రి కేటీఆర్ విడుదల చేసిన ప్రకటనకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ కౌంటరిచ్చారు. తండ్రి మాదిరిగానే కొడుకు కేటీఆర్ సిగ్గు లేను మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు అపాయింట్ మెంట్ లెటర్లు కావాలి.. లవ్ లెటర్ లు కాదని శ్రవణ్ ఎద్దేవా చేశారు.  

2014 లో లక్ష 7 వేల ఖాళీలు వున్నాయని కేసీఆరే చెప్పారన్నారు శ్రవణ్ కుమార్. బిశ్వాల్ కమిటీ కూడా లక్ష 91 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పిందన్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులే వుండరు అన్న కేసీఆర్.. మళ్లీ కాంటాక్ట్ ఉద్యోగులను ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో.. కేసీఆర్ ఫ్యామిలీకే కొలువులు దొరికాయన్నారు. తమ కుటుంబానికి తప్ప తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వరా అని  శ్రవణ్ నిలదీశారు. రాష్ట్రంలో 47 శాతం ఉద్యోగాలు భర్తీ లేకుండా ఉన్నాయన్నారు. 

ఉద్యోగులు పూర్తి స్థాయిలో ఉంటేనే పాలన సరిగా జరుగుతుందన్నారు శ్రవణ్ కుమార్. ప్రగతి భవన్ లో ఉద్యోగులు ఉంటే సరిపోదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 10వేల ఉద్యోగాలు వేశారని కేటీఆర్ చెప్పడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ వ్యతిరేకి కిరణ్ కుమార్ రెడ్డి లక్ష 10వేల ఉద్యోగాలు  వేశారని చెప్పారు. టిడిపి, కాంగ్రెస్ హయాంలో వరుసగా టీచర్ ఉద్యోగాల కోసం డీఎస్సీ నోటిఫికేషన్ లు వచ్చాయన్నారు. గ్రూప్ -1, గ్రూప్ -2, 3 నోటిఫికేషన్ లు రానే రాలేదన్నారు శ్రవణ్ కుమార్.