ముఖ్యమంత్రి డిల్లీ యాత్ర నేడే

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నతనను కలిసిన గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి తదితర మంత్రులకు అప్పుడే రాజీనామాలు చేయవద్దని తాను మరో రెండు మూడు రోజుల్లో డిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలని కలిసిన వచ్చిన తరువాత అందరూ సమిష్టి నిర్ణయం తీసుకొందామని చెప్పారు. నిన్న మరో రెండు మూడు రోజులన్నముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రమే డిల్లీ వెళ్లి అంటోనీ కమిటీని కలవనున్నారు. నిన్నఆయన ఆ మాట చెప్పిన కొద్ది సేపటికే డిల్లీలో హోంమంత్రి షిండే మీడియాతో మాట్లాడుతూ మరో ఇరవై రోజుల్లో తన శాఖ తెలంగాణపై నోట్ సిద్దం చేసి మంత్రి మండలికి సమర్పిస్తుందని చెప్పారు. సమైక్యరాష్ట్రం కోసం గట్టిగా వాదిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి, షిండే ప్రకటన నేపద్యంలో మరింత ఆలస్యం చేయడం మంచిది కాదనే ఆలోచనతోనే, అంటోనీ కమిటీ ముందు ఆఖరిసారిగా తన వాదనలు వినిపించేందుకు ఈ రోజే డిల్లీకి బయలుదేరుతున్నారు. కానీ, అధిష్టానం రాష్ట్ర విభజనకు కృత నిశ్చయంతో ఉన్నసంగతి ఆయనకు తెలియకపోలేదు. గనుక బహుశః అదే విషయంపై తాడో పేడో తేల్చుకొనే ఉద్దేశ్యంతోనే డిల్లీ బయలుదేరుతున్నారేమో.

 

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అమెరికాకు వెళ్లి ఉన్నందున ఆయనకానీ, పార్టీ అధిష్టానం గానీ ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవచ్చును. కానీ తెలంగాణా కాంగ్రెస్ నేతలు అయన సమైక్యవాదంతో చాల అసహనం గురవుతూ వెంటనే పదవి నుండి వైదొలగమని కోరుతున్నందున ఆయన కూడా ఇంకా ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చును.

 

ఒకవేళ ఆయన అధిష్టానానికి విధేయత చూపుతూ తన రాజీనామాను పార్టీకే సమర్పిస్తే ఆయన స్థానంలో మరొకరిని నియమించి విభజన ప్రక్రియను కొనసాగించవచ్చును. అలా కాకుండా ఆయన నేరుగా గవర్నర్ కి రాజీనామా పత్రం సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం రద్దయిపోతుంది. సీమంధ్ర నేతలు పెట్టబోయే కొత్త రాజకీయ పార్టీకి ఆయన నాయకత్వం వహిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపద్యంలో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి చేయి దాటపోనీయకుండా కొంత వెనక్కు తగ్గి ఆయన సూచనలలో కొన్నిటికయినా తల ఒగ్గినా ఆశ్చర్యం లేదు.

 

సీమంధ్ర నేతలు హైదరాబాద్ ని కేంద్రపాలిత ప్రాంతం చేయమని కోరినప్పుడు ఇనతవరకు ససేమిరా అంటున్న దిగ్విజయ్ సింగ్, నిన్నకొద్దిగా మెత్తబడి ఆ విషయం అంటోనీ కమిటీ చూసుకొంటుందని చెప్పడం గమనిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి కూడా మరికొన్ని హామీలు రాబట్టుకొనే అవకాశం ఉందనుకోవచ్చును. ఒకవేళ ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేస్తే రాష్ట్ర రాజకీయాలలో మరో కొత్త అధ్యాయం మొదలవుతుంది.