త్వరలో తెలంగాణా మంత్రివర్గ ప్రక్షాళణ?

 

 

రసమయి బాలకృష్ణను త్వరలో మంత్రిగా చూడబోతున్నారని కొన్ని రోజుల క్రితం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మళ్ళీ మొన్నీ మధ్యనే చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ని కూడా క్యాబినెట్ లోకి తీసుకోబోతున్నట్లు తెలిపారు. అంటే త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళణ తధ్యమని స్పష్టమవుతోంది. మంత్రివర్గ విస్తరణకి బదులు ప్రక్షాళణ ఎందుకంటే పార్లమెంటరీ నియామలను అనుసరించి తెరాసకున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం ప్రకారం మంత్రివర్గంలో 18 మంది కంటే ఎక్కువ మంది మంత్రులను నియమించుకోవడానికి వీలులేదు. ప్రస్తుతం మంత్రివర్గంలో సరిగ్గా 18 మంది మంత్రులే ఉన్నారు. కనుక కొత్తవారిని తీసుకోవాలంటే మంత్రివర్గంలో కొందరికి ఉద్వాసన పలుకక తప్పదు. కేసీఆర్ చెప్పినట్లు కేవలం ఇద్దరినే మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎవరో ఇద్దరు మంత్రులకి ఉద్వాసన తప్పదు.

 

కానీ ఆ ఇద్దరిని నియమించడం కోసం ప్రయత్నిస్తే ఇంకా చాలా కూడికలు తీసివేతలు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడంతో విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక ఈసారి కనీసం ఒక్క మహిళకయినా మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉంటుంది. ఇక తెదేపా నుండి కొత్తగా పార్టీలోకి వచ్చి జేరిన కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావులకి మంత్రి పదవులు దక్కాయి. మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కి రాజ్య సభ సీటు లేదా ఎమ్మెయల్సీ సీటు కానీ ఇస్తారనే హామీతోనే ఆయన రేపు తెరాసలో చేరబోతున్నట్లు సమాచారం. ఇంకా మున్ముందు కాంగ్రెస్ పార్టీ నేతలను పార్టీలోకి ఆకర్షించడానికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశం ఉంది.

 

ఈ కారణంగా ఎంతో కాలంగా పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తెరాస నేతలకి అవకాశం దక్కకకపోవడంతో వారు చాలా అసంతృప్తిగా ఉన్నారు. కనుక ఒకవేళ మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే వారందరూ కూడా మంత్రిపదవుల కోసం ఒత్తిడి చేయవచ్చును. అంటే కొత్తగా ఎంతమందిని మంత్రివర్గంలోకి తీసుకోదలిస్తే అంతకు సమానంగా పాత మంత్రులను తొలగించక తప్పదన్నమాట. ఒకరిద్దరిని సంతృప్తి పరిచేందుకు మంత్రివర్గ ప్రక్షాళన చేసినట్లయితే ఆ కారణంగా పదవులు కోల్పోయిన వారు, పదవులు ఆశించి భంగపడినవారు అందరూ అసంతృప్తి చెందడం తధ్యం. కనుక మంత్రివర్గ ప్రక్షాళన చేయడం అంటే కత్తి మీద సాము వంటిదేనని చెప్పవచ్చును. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సాము ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే!