త్వరలో తెలంగాణా మంత్రివర్గ విస్తరణ?

 

ప్రస్తుతం తెలంగాణాలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి తోడు విపక్షాల ఆందోళనలు, ధర్నాలు, మరో వైపు రైతుల ఆత్మహత్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరిచేస్తున్నట్లు స్పష్టంగానే కనబడుతోంది. ఇవి సరిపోవనట్లు త్వరలో శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించక తప్పని పరిస్థితి. ఈ పరిస్థితుల నుండి కొంత ఉపశమనం, పార్టీ సీనియర్ నేతల మద్దతు పొందేందుకు కేసీఆర్ త్వరలో మంత్రివర్గ విస్తరణ చేప్పట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

 

కేసీఆర్ కీలకమయిన విద్యుత్, మున్సిపల్, సంక్షేమ శాఖలను తనవద్దే అట్టేపెట్టుకొన్నారు. కానీ ఆయన రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోతున్నారని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తీవ్ర విమర్శల కారణంగా తెలంగాణా ఉద్యమాన్ని ఎంతో సమర్ధంగా నడిపించిన ఆయన ప్రభుత్వాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అవుతున్నారనే భావన ప్రజలలో వ్యాపిస్తోంది. అందువల్ల తను నిర్వహిస్తున్న ఈ అదనపు బాధ్యతలను వేరొకరికి అప్పగించడం ద్వారా ఆ విమర్శల నుండి తప్పించుకొనే వీలు చిక్కడమే కాకుండా ఆయనపై పని ఒత్తిడి కూడా తగ్గుతుంది కనుక ప్రతిపక్షాలను కూడా ధీటుగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

 

ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం 12మంది మంత్రులున్నారు. కనుక ఇప్పుడు కొత్తగా మరో ఆరుగురు మంత్రులను తీసుకోవచ్చును. మహబూబ్ నగర్, ఖమ్మం వంటి ముఖ్యమైన జిల్లాలకు ఇంతవరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కనుక ఆ జిల్లాలకు చెందినవారికి మంత్రివర్గంలో అవకాశం దక్కవచ్చును. అదేవిధంగా ఈసారి ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా నుండి ఇటీవల తెలుగుదేశం పార్టీ నుండి తెరాసలో చేరిన తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రివర్గంలో అవకాశం కల్పించవచ్చును. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు ఆయనకే విద్యుత్ శాఖను అప్పగించి తెలుగుదేశం పార్టీకి కట్టడిచేసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.

 

కేసీఆర్ నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తున్నారనే విమర్శలు చాలానే మూట గట్టుకొన్నారు కనుకనే ఆయన మంత్రివర్గ విస్తరణ గురించి, మంత్రివర్గంలో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయం గురించి తన పార్టీ యం.యల్యేలు, యం.యల్సీల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కానీ అంతిమ నిర్ణయం ఆయనే తీసుకొంటారు కనుక అది కేవలం మొక్కుబడి తంతుగానే భావించవచ్చును. నవంబరు 5నుండి తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మొదలవబోతున్నాయి కనుక ఈలోగానే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.