90,500 మందికి చేప ప్రసాదం

 

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా రోగులకు చేపమందు ప్రసాద పంపిణి ప్రశాంతంగా ముగిసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. గత ఏడాది 86,000 మందికి చేప ప్రసాదం పంపిణీచేయగా ఈసారి 90,500 మందికి  అందజేశారు.

బత్తిన సోదరులు 175 ఏళ్లుగా మృగశిర కార్తె రోజున ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేస్తున్నారు. శాకాహారులకు చేప లేకుండా మందును పంపిణీ చేస్తున్నారు. వీరిచ్చే ముందు పట్ల నమ్మకంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా ఆస్తమా రోగులు ఏటా హైదరాబాద్ వస్తారు.

పాతబస్తీ దూద్‌బౌలిలోని తమ నివాసంతోపాటు, తమ కుటుంబసభ్యులు నివసించే కవాడిగూడ (కల్పన థియేటర్ సమీపం), వనస్థలిపురం (వాటర్‌ట్యాంక్ సమీపం), కూకట్‌పల్లి (బాలాజీనగర్)లో సోమవారం ఒక్కరోజు చేప ప్రసాదం అందజేయనున్నట్టు బత్తిని హరినాథ్‌గౌడ్ తెలిపారు.