చెన్నైలో భారీ వర్షపాతం.. తుఫానుగా మారే అవకాశం..

 

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తమిళనాడు రాష్ట్రం భారీ వర్షాలతో మునిగిపోతోంది. వాయుగుండం చైన్నైకి తూర్పు దిశగా 70 కిలోమీటర్ల దూరంలో ఉందని.. దీనివల్ల తమిళనాడుతో పాటు కేరళ, ఏపీ రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అంతేకాదు ఈ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండం ఏకంగా 25 సెంటీ మీటర్ల వర్షం కురుస్తుందని.. ఇదే కనుక తుఫానుగా మారితే దీనిని 'రావోను' గా పిలవాలని అధికారులు చెబుతున్నారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. గత డిసెంబర్లో వచ్చిన వరదల వల్ల ఎంతో నష్టం జరుగగా.. ఈసారి అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తీరప్రాంత అధికారులు చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో నిరంతరం పర్యవేక్షించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది.