తమిళనాడులో బయటపడుతున్న ఉల్కాశకలాలు


గత వారం తమిళనాడులోని వెల్లూరులోని ఒక కళాశాల మీద ఉల్క పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక బస్సు డ్రైవరు కూడా మరణించడం సంచలనం సృష్టించింది. ఉల్కాపాతం వల్ల మనుషుల చనిపోయిన సంఘటనలు ఆధునిక చరిత్రలో చాలా అరుదు. అందుకని తమిళనాట ఉన్న శాస్త్రవేత్తలంతా ఇప్పడు వెల్లూరుకి చేరుకుంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకుల తరువాత ఇప్పడు భూగర్భ శాస్త్రవేత్తలు కూడా వెల్లూరు కళాశాలని సందర్శించారు. ఈ సందర్భంగా నిన్న కళాశాలకి చేరుకున్న జియొలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు, కళాశాల ఆవరణలో ఉన్న మరో రాయిని కూడా ఉల్కా శకలంగా గుర్తించారు. 60 గ్రాముల బరువున్న ఈ రాయి ఆయస్కాంత శక్తిని కలిగి ఉందనీ, ఇదేమీ సాధారణ రాయి కాదనీ ఆయన తేల్చారు. ఫిబ్రవరి 6న ఇక్కడ జరిగిన ఉల్కాపాతం వల్ల ఇలాంటి శకలాలు చుట్టుపక్కల చాలానే కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే వీటిని వట్టి చేతులతో ముట్టుకోవడం అంత సురక్షితం కాదు కాబట్టి, ఏది రాయో ఏది అంతరిక్ష శకలమో తెలియక విద్యార్థులంతా తలలు పట్టుకుంటున్నారు.