‘బాబు’ పర్యటనకు ముందుగానే సమస్యల ఎంపికలో రాటుదేలుతున్న తమ్ముళ్లు
posted on Sep 24, 2012 10:07AM
.png)
అనంతపురం జిల్లా హిందుపురం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తపర్యటనలు ప్రారంభించక ముందే తెలుగుతమ్ముళ్లు స్థానిక సమస్యలను వెదుకుతున్నారు. ఈ సమస్యలపై ముందస్తుగా యుద్ధం ప్రకటించి ఆనక చంద్రబాబు చేత లాంఛనప్రాయంగా రాష్ట్రప్రభుత్వవైఖరిని ఎండగట్టాలని వారు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీలో జిల్లా కేడర్ ఉన్న నాయకులందరూ తమ ప్రాంతంలో కీలకమైన సమస్యలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రనేతలైతే అన్ని జిల్లాల్లో ఉన్న సమస్యలనూ అథ్యయనం చేస్తున్నారు. ఈ పర్యటనలో ప్రస్తావించే సమస్యలు స్థానికులను ఆకట్టుకోవాలనే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ పార్టీ నేతలు సమస్యలున్న ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడి సమస్య లోతులను కూడా అడిగి మరీ తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పిన వివరాలు, గణాంకాలు కూడా నమోదు చేసుకుంటున్నారు. తాజాగా ఆ పార్టీ లోక్‌సభ నేత, ఎంపి కింజరపు ఎర్రంనాయుడు తమ (శ్రీకాకుళం) జిల్లాలోని సారవకోట వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ప్రతీగ్రామంలోనూ పారిశుథ్యం క్షీణించటాన్ని ఆయన గమనించారు. డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలతో బాధపడుతున్న వారిని పలకరించి మరణాల గురించి వాకబు చేశారు. వైద్యాధికారులు గ్రామాల్లో అందుబాటులో లేరని తెలుసుకున్నారు. మొత్తం పరిస్థితి అర్థం చేసుకున్నాక మీడియా ముందుకు వచ్చి రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని ఆయన డిమాండు చేశారు. రాష్ట్రప్రభుత్వం ఆరోగ్య అవసరాలను గుర్తించటం లేదని ధ్వజమెత్తారు. ఇక ఇదే పార్టీకి చెందిన నేత కోడెల శివప్రసాద్ ఇటీవల నీటి విడుదల తీరుతెన్నులను పరిశీలించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నీరు నిండుగా ఉందన్న విషయాన్ని ధృవీకరించుకున్నారు. డెల్టా రైతుల గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని తాజాగా ఆయన చేసిన ప్రకటన చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల్లో నీరున్నా ఎందుకు విడుదల చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యేలు గ్రామాలకు వస్తే తిప్పికొట్టాలని కోడెల రైతులకు పిలుపు ఇచ్చారు. ఈ రెండు అంశాలూ కూడా తమ పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి వచ్చేలా ఇద్దరు నేతలూ కృషి చేశారు. బాధితులను కూడా బాబు పర్యటనకు వచ్చినప్పుడు కలవాలని కోరారు. ఈ రెండు అంశాలపై బాబు తీవ్రంగా స్పందిస్తే ఆందోళన చేయటానికి కూడా ఈ నేతలు సిద్ధంగా ఉన్నారు.