వార్ ఆవిర్భావ వారోత్సవాలతో వణుకుతున్న తెలంగాణా ?
posted on Sep 24, 2012 10:12AM
.png)
ఇప్పటిదాకా బలహీనపడిరదని పోలీసుశాఖ చెప్పుకొస్తున్న పీపుల్స్‌వార్(నక్సల్స్) పార్టీ ఆవిర్భావ వారోత్సవాలతో తెలంగాణాజిల్లాల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ వారోత్సవాలను పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని వార్ కసరత్తులు చేస్తోంది. అందుకని ప్రత్యేకంగా కేడర్ ఎంపికకు ఆహ్వానాన్ని కూడా గ్రామీణులకు, గిరిజనులకు తెలియజేసింది. పార్టీ కేంద్రకమిటీ ఇచ్చిన సూచనల మేరకు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లా నేతలు ఈ ఎంపిక పకడ్బందీగా చేయాలని భావిస్తున్నారు. అందుకే దీన్ని అడ్డుకోవటానికి ఎవరైనా ప్రయత్నిస్తే సీరియస్‌గా యుద్ధవాతావరణం సృష్టించటానికి కూడా వెనుకాడటం లేదు. పూర్తిస్థాయి తెగింపుతో చావో, రేవో అన్నట్లు వార్ కేడర్ రిక్రూట్‌మెంట్ చేస్తోందన్న సమాచారం పోలీసులు ముందస్తుగానే తెలుసుకున్నారు. ఆవిర్భావ వారోత్సవాల్లో వార్ మునిగి ఉండగానే దెబ్బతీయాలని పోలీసులూ వ్యూహాలు పన్నుతున్నారు. అప్పుడైతే సానుభూతిపరులు కూడా వణుకుతారని పోలీసుఅధికారులు భావిస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో వార్ కార్యకలాపాలు పూర్తిగా దెబ్బతీయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. ఇలా రెండు పక్షాలు సీరియస్‌గా ఈ వారోత్సవాలపై దృష్టి పెట్టడంతో ఈ మూడు జిల్లాల్లోని వార్‌ప్రభావిత ప్రాంతవాసులు వణుకుతున్నారు. వార్ కమిటీబాధ్యులు హరిభూషణ్, బడేదామోదర్ అయితే ఈ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రత్యేకించి సాంస్కృతిక కార్యక్రమాలు కళాబృందాలతో నిర్వహిస్తూనే కేడర్‌ను ఎంపిక చేయాలని వార్ నిశ్చయించుకుంది. ఈ ఏడాది మే 9న మహదేవపూర్ మండలం ముకునూరు గ్రామంలో మావోయిస్టు నక్సల్స్ ప్రజాకోర్టు పెట్టి దమ్మూరు మాజీ సర్పంచ్ భర్త వెంకటస్వామిపై కాల్పులు జరపటం, అతని తమ్ముడు మాజీ ఎంపిపి చిన్నన్నను చితకబాదటం వల్ల వార్ ఓ రకంగా గ్రామీణప్రాంతాల్లో భయాన్ని కలిగించిందని భావిస్తున్నారు. ఇదే సంఘటనపై వార్ కూడా నివేదికలు తెప్పించుకుందని తెలుస్తోంది. గోదావరి ఖని డీఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి మహదేవ్‌పూర్ చేరుకుని పోలీసులు తీసుకోవాల్సిన భద్రతాచర్యలు సమీక్షించారు. అంతేకాకుండా నక్సల్స్ కార్యక్రమాలను అణిచివేసేందుకు ముందుగానే బలగాలను కూడా రప్పించారు. దీంతో ఇరుపక్షాలు పట్టుదలగా తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని గ్రామీణులు భయపడుతున్నారు.