మొదటి హామీని అమలుచేసిన చంద్రబాబు ప్రభుత్వం

 

ఎన్నికలలో తెదేపా గెలిచిన మరుక్షణం నుండి అది ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ముఖ్యంగా తెదేపా ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారిన వ్యవసాయ రుణాలను వెంటనే మాఫీ చేయాలని వైకాపా పట్టుబడుతోంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారి కవ్వింపులకి లొంగిపోకుండా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తోంది. ఆ ప్రయత్నంలోనే ముందుగా ఆచరణ సాధ్యమయ్యే హామీలను అమలుచేయడం మొదలుపెట్టింది. ఈరోజు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల హామీలలో రెండవదయిన వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువులకు పెన్షన్ల పెంపుని ఆమోదిస్తూ జీ.ఓ. పై చంద్రబాబు సంతకం చేసారు. పెంచిన ఈ పెన్షన్లు వచ్చే నెల నుండి అమలులోకి వస్తాయి. వృద్ధులు మరియు వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 పెన్షన్ మంజూరు చేసారు. ఇక వ్యవసాయ రుణాల మాఫీ గురించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రిజర్వ్ బ్యాంక్ గవర్నరు రఘురాం రాజన్ తో ఫోన్లో మాట్లాడారు. ఆయన చంద్రబాబు అభ్యర్ధనకు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కానీ రాష్ట్రాలన్నీ ఆర్ధిక క్రమశిక్షణ పాటించవలసిన అవసరం గురించి పదేపదే నొక్కి చెపుతున్న రిజర్వ్ బ్యాంక్, చంద్రబాబు అభ్యర్ధనను మన్నించుతుందా అనే అనుమానాలున్నాయి. కానీ చంద్రబాబు సమర్ధత, కార్యదక్షత గురించి ఎరిగిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్, బహుశః ఆయనకు సహకరించేందుకు అంగీకరించి ఉండవచ్చును లేదా ప్రత్యామ్నాయ మార్గం సూచించి ఉండవచ్చును. అదే నిజమయితే చంద్రబాబు ప్రభుత్వం అతి పెద్ద సమస్యను అధిగమించినట్లే.