మహానాడులో బాబు జోస్యం

 

చంద్రబాబు పాదయాత్రలో ఉన్నప్పుడు ముందస్తు ఎన్నికలు ఏ క్షణానయినా రావచ్చునని అందుకు పార్టీలో అందరూ సంసిద్దంగా ఉండాలని చెపుతూ వచ్చారు. కానీ, పాదయాత్ర ముగించుకొని వచ్చిన తరువాత ఇప్పుడు ఆయన తన అభిప్రాయం మార్చుకొన్నారు. మొన్న మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ చరిత్ర గమనిస్తే ఆ పార్టీ ఏనాడు కూడా గడువుకి ఒక్కరోజు ముందు కూడా ఎన్నికలకి వెళ్ళినట్లు కనబడదు. అందువల్ల ఈ సారి కూడా ఏప్రిల్ 2014 వరకు ఎన్నికలకు వెళ్ళక పోవచ్చును. ఏమయినప్పటికీ, మేము ఎన్నికలు ఎప్పుడు పెట్టినా ఎదుర్కొనేందుకు తయారుగానే ఉంటాము,” అని అన్నారు.

 

వచ్చే ఎన్నికలలో తమ పార్టీ కేంద్రంలో లెఫ్ట్ పార్టీలు మరికొన్ని ఇతర పార్టీలతో కలిసి 3వ ఫ్రంట్ ఏర్పరచి ప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేస్తుందని ఆయన అన్నారు. రానున్న ఎన్నికలలో యుపీఏ ప్రభుత్వ అవినీతి, వెలుగు చూస్తున్న కుంభ కోణాలే ప్రధానాంశాలుగా ఉంటాయని ఆయన అన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికలలో ప్రజలు అవినీతిని ఎంత మాత్రం సహించరని రుజువు చేసిందని అన్నారు. అయితే, కర్ణాటకలో ప్రజలకు బీజేపీ, కాంగ్రెస్ లకు అక్కడ సరయిన ప్రత్యామ్నాయం లేకపోవడం వలననే కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 

వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ రెండూ విలీనమయి పోవచ్చును గనుక అప్పుడు రాష్ట్రంలో తాము కేవలం కాంగ్రెస్ పార్టీతోనే పోటీ పడవలసి ఉంటుందని ఆయన అన్నారు.

 

లోకేష్ వంటి విద్యావంతుడు రాజకీయాలలోకి రావడం ఆహ్వానించ దగ్గ పరిణామమే అని ఆయన అన్నారు. కేవలం అతను తన కుమారుడిగా కాక, వ్యాపార వ్యవహారాలను చక్కబెట్టి తన సమర్ధత నిరూపించుకొన్న వ్యక్తిగా, యువతకు ప్రతినిధిగా అతనిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని, అదే సమయంలో యువతరానికి తమ పార్టీ స్వగతం పలుకుతోందని ఆయన అన్నారు. ఒకవేళ అవసరమనుకొంటే తమ పార్టీ జూన్ 10నుండి మొదలయ్యే రెండవ విడత బడ్జెట్ సమావేశాలలో అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని ఆయన అన్నారు.