అడవులను రక్షించేందుకు చంబల్ దొంగల సమావేశం
posted on Mar 21, 2016 2:59PM

చంబల్ పేరు వినగానే, ఒకప్పుడు ఈ దేశాన్ని గడగడ వణికించిన గజదొంగలు గుర్తుకువస్తారు. వారిలో చాలామంది ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయినప్పటికీ, వారు సాగించిన దారుణాలు మాత్రం ఇంకా ఉత్తరాది మదిలో ఉన్నాయి. వారంతా నిన్న జైపూర్‌లో సమావేశమయ్యారు. ఎందుకో తెలుసా! అడవులను రక్షించేందుకు. అవును. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా వారంతా నిన్న జైపూర్‌లో ఒక చోటకి చేరుకున్నారు. రోజురోజుకీ అడవులని నరికివేస్తున్నారనీ, తాము చంబల్ అడవుల్లో తిరిగేటప్పుడు ఒక్క ఆకు కూడా తమకి తెలియకుండా తెంపేవారు కాదనీ చెప్పుకొచ్చారు. అంతేకాదు! ప్రభుత్వం కనుక అనుమతిస్తే తామంతా కలిసి అడవులని భద్రంగా చూసుకుంటామనీ హామీ ఇచ్చారు.
ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఈ మాజీ బందిట్లు బాధని వ్యక్త చేశారు. జనంలో అవినీతి మరీ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఆరెస్సెస్ కార్యకర్త నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథిగా జైపూర్ పార్లమెంటు సభ్యులు రామచరణ్ బోహ్రా కూడా హాజరయ్యారు. మాజీ బందిపోట్ల భావోద్వేగాలను తాను గౌరవిస్తాననీ, వారు కోరుకున్నట్లుగానే అటవీ సంరక్షణలో వారి సాయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాననీ చెప్పుకొచ్చారు. దొంగోడి చేతికి తాళం అంటే ఇదేనేమో!