అమితాబ్ జాతీయగీతం పాడినందుకు అయిన ఖర్చెంత
posted on Mar 21, 2016 3:05PM
.jpg)
మొన్న భారత్, పాకిస్తాన్‌ల మధ్య టి-20 మ్యాచ్ ఆరంభానికి ముందు అమితాబ్ బచ్చన్ జాతీయగీతం పాడిన విషయం తెలిసిందే! తనదైన శైలిలో అమితాబ్ పాడిన ఈ గీతానికి దేశవ్యాప్తంగా గొప్ప స్పందన లభించింది. అమితాబ్ నోటి చలవో ఏమోగానీ, భారత్ ఆ ఆటలో గెలిచింది కూడా! కానీ మ్యాచ్‌కి వచ్చేందుకు అమితాబ్ 4 కోట్ల రూపాయలను వసూలు చేశాడన్న విషయం మరికొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. జాతీయ గీతం పాడేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తాడా అంటూ ఫేస్‌బుక్ సమాజం తెగ బాధపడిపోయింది.
ఈ విషయమై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దిమ్మ తిరిగిపోయే వివరణ ఇచ్చారు. అమితాబ్ కోల్‌కతాకు వచ్చినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అమితాబ్ కోల్‌కతాకు ప్రత్యేక విమానంలో వచ్చి, హోటల్‌లో బస చేసి, టికెట్లను ఖరీదు చేసి.... ఇలా ఈ టి-20 మ్యాచ్ కోసం అమితాబ్ అక్షరాలా 30 లక్షల రూపాయలు ఖర్చుచేశాడట. కానీ సౌరవ్ ఎంతగా బతిమాలినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రస్తుతానికి ఫేస్‌బుక్‌లో నాలుగు కోట్ల రూపాయల పుకారు పోయి ఈ 30 లక్షల రూపాయల వార్త రాజ్యమేలుతోంది. ఎంతైనా బిగ్‌బీ బిగ్‌బీనే అంటూ ఫేస్‌బుక్ సమాజం తెగ మెచ్చుకుంటోంది.