సీనులోకి చిన్నశీను?

 

మజ్జి శ్రీనివాసరావు .. ఈ పేరు బహుశా చాలా మందికి తెలియదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన యువనేత విజయనగం జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కూడా. ఇలా ఎన్ని చెప్పినా ఎవరూ గుర్తు పట్టలేరు. చిన్న శీను అని చెబితే 3 జిల్లాల అధికార యంత్రాంగం నుంచి.. 3వ తరగతి పిల్లాడి వరకూ ఠక్కున చెప్పేస్తారు. తాజా మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శీను.. అంటే ఉత్తరాంధ్రకు చిన్న సైజు ప్రభుత్వమే. మేనమామ బొత్సకు జిల్లాలో అందరూ ఝలక్ ఇచ్చి వెళ్లిపోతుంటే చూడలేక బొత్సకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కార్యరంగంలోకి దూకాడు.

 

ముందుగా బొత్స ఇంటి సెంటిమెంట్ పై చిన్న శీను దృష్టి సారించారు. చీపురుపల్లి -గరివిడి మద్యలో ఉన్నసొంత ఇంటి నుంచే బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆస్తులు అంతస్తులు పెరిగిపోవడంతో విజయనగరంలో రాజప్రాసాదాల్లోకి మారిపోయారు. బొత్స గతంలో ఉన్నఆ పాత ఇంటినే అనధికార కార్యాలయంగా చేసుకొని చిన్న శీను రాజకీయ కార్యక్రమాలు త్వరలోనే మొదలుపెడుతున్నారు. చిన్నశీను అంటే బొత్సకు ప్రతిరూపం. పాత ఇంట్లో ఉండేది చిన్నశీను అయినా సెంటిమెంట్ వర్కవుట్ అవ్వాల్సింది మాత్రం బొత్సకే కనుక, ఆయన కూడా అప్పుడప్పుడు మేనల్లుడిని చూసినట్టూ ఉంటుంది.. పదేళ్లుగా పలుకరించని నియోజకవర్గం ప్రజలని పలకరించినట్లూ ఉంటుందని వీలున్నపుడల్లా ఆ ఇంటి వైపు ఓరౌండు వేసి వస్తున్నారుట! అంటే బొత్స మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి ఎదిగి డిల్లీ వరకూ చేరతారేమో చూడాలి.

 

ఇక బొత్సకు అత్యంత సన్నిహితుడు, తన సిట్టింగ్ స్థానం చీపురుపల్లి పక్క నియోజకవర్గమైన ఎచ్చెర్ల కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మీసాల నీలకంఠ నాయుడు ఈమధ్యనే వైసీపీలో చేరారు. బొత్సకు కుడిభుజం వంటి బెల్లాన చంద్రశేఖర్ కూడా ఈమధ్యనే జగన్ వైపు జంప్ చేసారు. ఇటువంటి కష్టకాలంలో ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తికి టికెట్ ఇప్పించి బరిలోకి దింపడం కంటే తన మేనల్లుడు చిన్న శీనునే ఎచ్చెర్ల నుండి బరిలోకి దింపినట్లయితే తనకూ అండగా ఉంటాడనే ఉద్దేశ్యంతో అతనికి టికెట్ ఇప్పించేందుకు బొత్స ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం. ఇంతవరకు తెర వెనుకుండి మామకోసం మంత్రాంగం నడిపిన చిన్న శీను ఈసారి ప్రత్యక్ష రాజకీయాలలోకి దిగి, ఎచ్చెర్ల నుండి పోటీ చేసి గెలిచి తన సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నట్లు తెలుస్తోంది.