బొత్సకు చీపురుపల్లి చిక్కులు?

బొత్సకు చీపురుపల్లి చిక్కులు?

 

బొత్స సత్యనారాయణ .. తాజా మాజీ పీసీసీ చీఫ్. కాంగ్రెస్ నుంచి ఎవరు వెళ్ళిపోయినా నష్టం లేదంటూ పీసీసీ పీఠంపై ఉంటూ బీరాలు పలికిన పెద్ద మనిషి.. కుర్చీ దిగేసరికి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది. సొంత నియోజకవర్గంలో, తన ఆంతరంగికులే పార్టీని వీడుతున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన  సత్తిబాబుకు.. పెదబాబు అనబడే బెల్లాన చంద్రశేఖర్ కుడి భుజంగా వ్యవహరించేవాడు. బెల్లానను కాంగ్రెస్ కార్యకర్త నుంచి జెడ్పీ చైర్మన్ వరకూ తీసుకెళ్ళింది బొత్సే. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడం, బీరకాయ పీచు చుట్టరికం కూడా కలవడంతో బొత్స వ్యవహారాలన్నీ చక్కపెట్టేవాడు బెల్లాన.


  ఏ వ్యవహారం బెడిసి కొట్టిందో తెలియదు గానీ బెల్లాన జగన్ కు జై కొట్టారు. రాష్ట్ర విభజన చేసి సీమాంధ్ర లో దోషిగా నిలబడిన పార్టీ తరపున పనిచేస్తే రాజకీయ భవిష్యత్ ఉండదనే ఆలోచనతో బెల్లాన సత్తిబాబుకు హ్యాండిచ్చి జగన్ తో చేయి కలిపాడని అనుకుంటున్నారు కార్యకర్తలు. ఇటీవల చీపురుపల్లి మేజర్ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో బొత్స మద్దతుతో కాంగ్రెస్ సానుభూతిపరులుగా బరిలో తన భార్యను దింపిన బెల్లాన ఫలితం  చూసి తెల్లబోయారు. ఒక్క పంచాయతీలో 5000 కు పైగా ఓట్ల మెజారిటీతో ప్రత్యర్ధి గెలవడం బెల్లాన చంద్రశేఖర్ ను ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు సన్నిహితులు. బొత్సతో ఉంటే తానూ రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సి వస్తుందని భావించిన పెదబాబు చీపురుపల్లి వైసీపీ టికెట్ హామీతో జగన్ గూటికి చేరారని బెల్లాన భార్య శ్రీదేవి చెబుతోంది. తన అంతరంగికుడే .. వైసీపీ తరపున తన ప్రత్యర్ధిగా ఎన్నికల రంగలో దిగుతుండటంతో చీపురుపల్లిలో పోటీ చేయాలా వద్దా అని బొత్స పునరాలోచనలో పడినట్లు సమాచారం. కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం సిట్టింగ్ స్థానం నుంచే పోటీ చేయాలని బొత్సను కోరుతున్నారు.