పవన్ కళ్యాణ్ కి అమిత్ షా చేసిన ప్రతిపాదన ఏమిటో?

 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి వచ్చిన తరువాత అమిత్ షా తనకు ఒక ప్రతిపాదన చేసారని అని చెప్పారు. కానీ ఆ ప్రతిపాదన ఏమిటో ఇప్పుడే చెప్పనన్నారు. సహజంగానే ఆ ప్రతిపాదన ఏమిటనే ఆలోచన అందరికీ కలుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చినందున, ఇకపై కూడా రెండు పార్టీలు రెండు రాష్ట్రాలలో కలిసి పనిచేయాలని అనుకోవచ్చు. కానీ బీజేపీ వంటి జాతీయ పార్టీ, ఇంకా పార్టీ నిర్మాణం కూడా జరగని జనసేనతో కలిసిపనిచేయాలని తహతహలాడుతోందని ఎవరూ భావించరు. బీజేపీకి ఆంధ్రాలో బలం లేకపోవచ్చును కానీ తెలంగాణాలో మాత్రం ఎంతో కొంత బలం ఉంది. అందుకే అక్కడ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని అమిత్ షా కోరుకొంటున్నారు. తెరాస, తెదేపా, బీజేపీలు బలంగా ఉన్నతెలంగాణాలో జనసేన పార్టీ నిలద్రోక్కుకోవడం కష్టమే. అక్కడి ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం తక్కువే. అందువలన తెలంగాణాలో జనసేనతో చేతులు కలిపినంత మాత్రాన్న బీజేపీకి పెద్దగ ఒరిగేదీమే ఉండబోదని అర్ధమవుతోంది.

 

ఇక ఆంధ్రాలో బీజేపీ అంత బలంగా లేదు. పవన్ కళ్యాణ్ కి అక్కడ ప్రజలలో మంచి ఆదరణ ఉన్నప్పటికీ, ఆయన పార్టీని నిర్మాణం చేసుకొని వచ్చే ఎన్నికలలోగా తన శక్తిని నిరూపించుకోవలసి ఉంటుంది. ఇంత చేసినా, జనసేన పార్టీ పెట్టింది అధికారం కోసం కాదు కేవలం ప్రశ్నించడం కోసమేనని పవన్ కళ్యాణ్ పదేపదే చెపుతున్నపుడు, అధికారం, పదవులపై ఆశలున్న రాజకీయ నేతలు ఎవరూ కూడా ఆ పార్టీలో చేరే ఆలోచన చేయబోరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఒకవేళ జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలబెట్టినా వారు ఇప్పటిలాగే ఏదో ఒక పార్టీకి అనుబంధ పార్టీగా మద్దతు ఇచ్చేందుకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. చిరంజీవి తను ముఖ్యమంత్రి అవ్వాలనే ఏకైక ఆశయంతో ప్రజారాజ్యం పెట్టినా భంగపడక తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ తనకు అధికారమే వద్దంటూ పార్టీ పెడితే, ఇక దానిని ప్రజలు, రాజకీయ నేతలు ఆదరిస్తారని గ్యారంటీ లేదు.

 

ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అవి పూర్తయ్యేలోగా చాలా చేదు నిజాలు, అనుభవాలు చూసారు. ఇక అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చేతులు కాల్చుకొని మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేయడానికి సిద్దమవడం కూడా పవన్ చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమో, వేరే పార్టీని అధికారంలోకి తేవడం కోసమో అయితే పవన్ కళ్యాణ్ తన ఉజ్వలమయిన సినీ జీవితాన్ని పణంగా పెట్టి మరీ జనసేన పార్టీని స్థాపించి దానిని ప్రయాసపడి నిర్వహించడం కూడా అనవసరమే. అంతకంటే ఆయన బీజేపీలో చేరడమే ఉత్తమం. తద్వారా ఆయన తన సినీ జీవితాన్ని యధావిధిగా కొనసాగిస్తూనే బీజేపీ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చును. బహుశః అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ కు ఇదే ప్రతిపాదన చేసి ఉండవచ్చునేమో?