భ్రమల్లో జీవిస్తూ...భ్రమల్లో పార్టీని నడిపిస్తున్న సోనియా

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధి తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేయాలనే ఏకైక లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై కర్రపెత్తనం చేస్తూ దేశంలో అన్ని వ్యవస్థలను, స్వంత పార్టీని కూడా భ్రష్టు పట్టించారు. కనీసం లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దుస్థితి కలిగినందుకు ఆమె బాధపడ్డారో లేదో తెలియదు. కానీ చింత చచ్చినా పులుపు చావదన్నట్లుగా వచ్చే ఎన్నికల తరువాత తమ పార్టీ తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు ఆమె భరోసా ఇవ్వడం నవ్వు తెప్పిస్తుంది. అధికారంలో చేతిలో ఉన్నపుడే పార్టీని తిరిగి గెలిపించుకోలేని ఆమె, కనీసం ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దుస్థితిలో ఐదేళ్ళ తరువాత వచ్చే ఎన్నికలలో పార్టీని ఏవిధంగా గెలిపించగలనని భావిస్తున్నారో ఆమెకే తెలియాలి.

 

మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఆయన ప్రజలకు మాయమాటలు చెప్పి ఎన్నికలలో గెలిచారని, గెలిచిన తరువాత ఏమి చేయాలో పాలుపోక దేశ ప్రజలను ఇంకా మభ్య పెడుతూనే ఉన్నారని ఆరోపించారు. ఆయన యూపీఏ పధకాలను, కార్యక్రమాలను అన్నిటినీ కాపీ కొడుతూ అవి తన స్వంత పధకాలుగా చెప్పుకొంటున్నారని ఆమె ఎద్దేవా చేసారు.

 

ఆమె చేసిన ఈ రెండు ఆరోపణలను నిశితంగా పరిశీలించినట్లయితే, ఆమెకు దేశ ప్రజల విజ్ఞతపట్ల వారెన్నుకొన్న ప్రభుత్వం పట్ల ఎంతటి చులకన భావం ఉందో అర్ధమవుతుంది. ప్రజలకు మంచి చెడ్డా ఆలోచించే జ్ఞానం, తెలివితేటలూ లేవని, ఎవరు మాయమాటలు చెపితే వారిని గుడ్డిగా నమ్మేసి ఓటేసేస్తారని ఆమె భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక మోడీ ప్రభుత్వం పనిచేయకుండా ప్రజలకు రంగుల కలలు చూపిస్తోందని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ అదే సమయంలో యూపీఏ పధకాలను, కార్యక్రమాలను ఎన్డీయే స్టాంపు వేసుకొని అమలు చేస్తోందని ఆమే స్వయంగా దృవీకరిస్తున్నారు. కాంగ్రెస్ పాలన నచ్చకనే ప్రజలు ప్రజలు ఆ పార్టీని ఇంటికి సాగనంపారు. అటువంటప్పుడు మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ చేసిన పొరపాట్లనే ఎందుకు అమలుచేస్తుంది? అని ఆలోచిస్తే ఆమె వాదనలో పసలేదని అర్ధమవుతుంది.

 

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నాటి నుండి అన్ని వ్యవస్థలలో సమూలంగా మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుండటం ప్రత్యక్షంగా కనబడుతూనే ఉంది. బ్రిటిష్ కాలంనాటి ప్రణాళికా సంఘాన్ని, ఆర్.టీ.ఓ. వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో వర్తమాన, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా అనుసరిస్తున్న విదేశాంగ విధానాలను కూడా మోడీ ప్రభుత్వం పక్కనబెట్టి, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ప్రతిష్ట మరింత పెరిగేలా సరికొత్త విధానాలను క్రమంగా అమలులోకి తెస్తోంది. ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టే సమయంలో పాకిస్తాన్ కు స్నేహ హస్తం అందించిన నరేంద్ర మోడీ, ఆ తరువాత పాకిస్తాన్ హద్దులు మీరడంతో ఆ దేశానికి ఘాటయిన హెచ్చరికలు జారీ చేయడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చును.

 

ఇంకా అనేక అంశాలలో మోడీ ప్రభుత్వం చాలా దృడమయిన, కటినమయిన నిర్ణయాలు తీసుకోవడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగయిదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నిద్రావస్తలో జోగుతున్న ప్రభుత్వ వ్యవస్థలు, మోడీ అధికారం చెప్పట్టాక పనిచేయడం మొదలుపెట్టాయి. కానీ సోనియాగాంధీ మాత్రం ఇవేమీ గమనించనట్లు వచ్చే ఎన్నికలలో తాము గెలుస్తామనే భ్రమలలోనే జీవిస్తూ, తమ పార్టీ నేతలని, కార్యకర్తలనీ కూడా అదే భ్రమలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిధంగా భ్రమల్లో జీవించడం వలన కాంగ్రెస్ పార్టీకి ఆనందం కలుగుతోందంటే ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది? ఈ ఐదేళ్ళ కాలంలో మోడీ దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించగలిగినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఈ భ్రమలలోనే జీవించడం అలవాటు చేసుకోవలసి ఉంటుందేమో?