రెండు లక్షల కోళ్ళకు బర్డ్ ఫ్లూ

 

హైదరాబాద్ శివార్లలో వున్న హయత్‌నగర్ ప్రాంతంలో వున్న కోళ్ళ ఫారాలలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకింది. ఈ లక్షణాలను గమనించిన అధికారులు పరీక్షలకు పంపగా కోళ్ళకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఎవరూ చికెన్, కోడిగుడ్లు తినరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మొదట 18 వేల కోళ్ళకు బర్డ్ ప్లూ వచ్చిందని గుర్తించారు. ఆ తర్వాత పరీక్షించగా రెండు లక్షల కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందని నిర్ధారించారు. దాంతో ఈ రెండు లక్షల కోళ్ళనూ పెద్ద గుంట తీసి పూడ్చేయాలని అధికారులు నిర్ణయించారు. హయత్ నగర్ ప్రాంతలో కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందన్న విషయం తెలుసుకుని హైదరాబాద్ చుట్టుపక్కల వున్న కోళ్ళ ఫారాల యజమానులు అప్రమత్తమై తమ కోళ్ళ ఫారాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. చాలా వేగంగా వ్యాపించే బర్డ్ ఫ్లూ తమ కోళ్ళకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. హయత్ నగర్‌కి పది కిలోమీటర్ల దూరంలో వున్న కోళ్ళఫారాలన్నిటిలోనూ ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. బర్డ్ ఫ్లూ ప్రమాదం వుందని తెలిసి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కోళ్ళఫారాల యజమానులు అప్రమత్తం అయ్యారు.