తెలంగాణలో బీజేపీ బోణి కష్టమేనా?

 

అసెంబ్లీ రద్దు సమయంలో వందకి పైగా సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ ధీమాగా చెప్పినప్పుడు సాధ్యమేనా అనుకున్నారంతా. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వంద కాకపోయినా 90 సీట్లైనా టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ 90 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రజకూటమి 20 స్థానాలకు అటుఇటుగా కొట్టుమిట్టాడుతోంది. ఇక బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత ఎన్నికల్లో 5 సీట్లు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం ఫలితాలు వెలువడుతున్న తీరు చూస్తుంటే కనీసం ఒక్క సీటైనా గెలుస్తుందా అనిపిస్తోంది. బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. జాతీయ స్థాయి నాయకులు కూడా ప్రచారం చేశారు. దీంతో గతంలో కంటే ఈసారి బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తాయని నాయకులు భావించారు. కానీ ఆ అంచనాలు తారుమారయ్యాయి. సిట్టింగ్ స్థానాలను కూడా బీజేపీ నిలుపుకునే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం బీజేపీ ఒక్క స్థానంలోనే ఆధిక్యంలో ఉంది. కొన్ని రౌండ్స్ లో ఆ ఒక్క స్థానంలో కూడా వెనుకంజలో ఉంటుంది. మరి చివరికి బీజేపీ తెలంగాణలో ఒక్క స్థానాన్ని అయినా ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి.