ఏపీలో బీజేపీ... పాతాళంలోకి!

నవ్యాంధ్ర కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించి రెండేళ్లవుతుంది. అయినా ఎక్కడ హామీలు అక్కడే..మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది  కేంద్రం. అయినా అరకొరా నిధులే విదిల్చింది. లోటు పూడ్చింది లేదు..పోలవరానికి నిధులు లేవు. నిధులు కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ చుట్టూ తిరగడం, విజ్ఞప్తులు చేయడం సాధారణమైపోయింది. ఇప్పటికే హానీమూన్ పిరియడ్ అయిపోయింది. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారు. దీంతో సహాజంగానే ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

 

ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మోడీ తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా తల్లిని చంపి..బిడ్డకు జన్మినిచ్చారు అంటూ వ్యాఖ్యానించారు. తాము అధికారంలో ఉండగా మూడు రాష్ట్రాలు ఇచ్చామని అప్పుడు ఎలాంటి విద్వేషాలు కలగలేదని కాని కాంగ్రెస్ తెలుగు జాతిని రెండుగా విడదీసిందని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏపీని సంతృప్తి పరిచే ఒక్క హామీని నెరవేర్చలేదు. ప్రత్యేకహోదా, స్పెషల్ ప్యాకేజీ, పోలవరానికి జాతీయ హోదా, విశాఖ రైల్వేజోన్ అన్ని ఒకదాని వెనుక ఒకటి అటక ఎక్కిస్తూ వచ్చారు.

 

కాని జనాలు అంతకన్నా తెలివైన వారు,  ప్రధానిని..బీజేపీని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అమరావతి శంకుస్ధాపన కార్యక్రమంలోనూ మోడీ ఏదైనా దయ చూపుతారేమోనని చూశారు. కాని పార్లమెంట్ నుంచి మట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టారు. భావోద్వేగాలు పండించడంలో మోడీది అందవేసిన చేయ్యి. మాటల్లో మాడ్యులేషన్ మారుస్తూ..హృదయాన్ని తాకే పదాలు పలికిస్తూ ప్రేమ ఒలికిస్తూ మోడీ ప్రసంగం చెవులు రిక్కించి వినేలా ఉంటుంది. అయితే అది అన్ని వేళలా పనిచేయదు. ఆరవై ఏళ్లుగా రాష్ట్రంలోనూ..కేంద్రంలోనూ అధికారాన్ని అందించి ఆపద్భాంధవుడిలా  వ్యవహరించినా కాంగ్రెస్‌ తమకు తీరని అన్యాయం చేసిందని భావించిన సగటు ఆంధ్రుడు కాంగ్రెస్‌కు
కోలుకోలేని దెబ్బ ఇచ్చాడు.  

 

ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోలేదు సరికాదా. కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. కాకలు తీరిన కాంగ్రెస్ యోధులు సైతం బొక్కబొర్లాపడ్డారు. మళ్లీ ఒక తరం వరకు లేవకుండా కాంగ్రెస్ భూస్థాపితమైపోయింది. ఏపీలో పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ ఇందుకు కాపుల రిజర్వేషన్లు తదితర అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అదంతా చేసే బదులు చేతిలో ఉన్న హామీల సంగతి మాత్రం గుర్తించడం లేదు. ఎందుకంటే కమలానికి ఏపీ కావాలి? తెలంగాణ కావాలి? ఒక ప్రాంతానికి ఇచ్చి మరో ప్రాంతానికి ఇవ్వకపోతే బాగోదని మొత్తానికే పంగనామం పెడుతోంది. తెలంగాణతో పోలీస్తే ఆంధ్రా పరిస్థితి దయనీయం. చేతిలో చిల్లిగవ్వ లేదు..కొండంత రెవెన్యూ లోటు. అందుకే ప్రతిసారి కేంద్రం వైపు చూస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ అంటే ఏపీలో కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నాన్చుతూ పోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే ఏపీకి పడుతుంది. అది కూడా ఎంతో దూరంలో లేదు.