పూల హరివిల్లు

తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలు..సంప్రదాయ వస్త్రాలు ధరించిన వేలాది ఆడపడుచుల ఆటా పాటా..19 రాష్ట్రాల కళాకారుల నృత్యరీతులతో..పూలవాన కురిసినట్లుగా..వసంతం శోభిల్లినట్లుగా..31 జిల్లాల నుంచి తరలివచ్చిన తెలంగాణ అక్కాచెళ్లెల సంతోషతరంగాలతో ఎల్బీ స్టేడియం మార్మోగింది. దేశంలోనే మరెక్కడా లేని విశిష్ట పండుగను ప్రపంచానికి చాటి చెప్పేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

 

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా లాల్‌ బహదూర్ స్టేడియంలో నిర్వహించిన మహా బతుకమ్మ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 25 అడుగుల ఎత్తయిన మహా బతుకమ్మ చుట్టూ భారతీయ కాలమానంలోని 60 సంవత్సరాలకు ప్రతిరూపంగా 60 బతుకమ్మలను పేర్చారు. సరిగ్గా సాయంత్రం 4.40 గంటలకు నిజామాబాద్ ఎంపీ కవిత శాస్త్రోక్తంగా గౌరవమ్మకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 

ఆ వెంటనే రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన 28 వేల మంది మహిళలతో కలిసి కవిత బతుకమ్మ ఆడారు.  స్టేడియం మధ్యలో ఏర్పాటు చేసిన అతిపెద్ద బతుకమ్మ చుట్టూ చేరిన మహిళలు పలు వరుసల్లో వలయాకారంలో తిరుగుతూ "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..శ్రీలక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ..చిత్రమై తోచునమ్మ గౌరమ్మ..చిత్తు చిత్తుల బొమ్మ..శివుడీ ముద్దుల గుమ్మ" అంటూ పాటకు తగ్గట్టు చేతులు ఆడిస్తూ పులకించిపోయారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ..మహా బతుకమ్మ ద్వారా తెలంగాణ సంస్కృతి గొప్పదనం ప్రపంచానికి తెలిసిందన్నారు..

 

ఆటా..పాట..ఉత్సాహం..కలగలిపిన వేడుకే బతుకమ్మ అని.. గతంలో బతుకమ్మ ఆడుకునేందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేదన్నారు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఇంత సంతోషంగా, సంబరంగా పండుగ చేసుకోగలుగుతున్నామని..తెలంగాణ ఘనవారసత్వ సాంస్కృతిక సంపదకు చిరునామాగా నిలిచిన బతుకమ్మను పరిరక్షించుకుందామన్నారు. అన్ని జాతులు కలిస్తేనే మానవజాతి..అన్ని పూలు కలిస్తేనే బతుకమ్మ అని అన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన కథాకళి, కథక్, ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి కళారీతులు అందరినీ ఆకట్టుకొన్నాయి. 

 

 

రవీంద్ర భారతి వేడుకలు: తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలు ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రవీంద్ర భారతి ప్రధాన వేదికలో బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో బతుకమ్మ జాతీయ సాంస్కృతికోత్సవం జరుగనుంది. అలాగే బతుకమ్మ ఫిల్మోత్సవాన్ని పురస్కరించుకొని రవీంధ్రభారతి ప్రివ్యూ ధియేటర్‌లో 207 బతుకమ్మ వీడియో పాటల ప్రదర్శన జరుగుతుంది.