ఏ ఎమ్మెల్యే అయినా ఇలా చేస్తాడా..?

ప్రజల కోసం..ప్రజల చేత..ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు తప ఐదేళ్ల పదవికాలంలో ప్రజల కోసం పనిచేసిన క్షణాలు చాలా తక్కువ..అయితే అందరూ ఇలా ఉంటారని మా ఉద్దేశ్యం కాదు..రాజకీయం వ్యాపారత్మకంగా మారిన ప్రస్తుత కాలంలో మెజారిటీ రాజకీయ నాయకులు తమ స్వలాభాలు చూసుకుంటున్నారు తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదన్నది ఎన్నో సర్వేలు రుజువు చేసిన అంశం. అయితే ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కొందరుంటారు..వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ దత్‌ ద్వివేది..ఇప్పుడు ఆయన దేశంలో హాట్ టాపిక్. ఫరూఖాబాద్-ఫతేగఢ్ రహదారిపై భీంసేన్ మార్కెట్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి..

 

ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో ఉన్నారు..రోడ్డు మీద జనం అలా చోద్యం చూస్తూ ఉండిపోయారు తప్ప ఎవ్వరూ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఫరూఖాబాద్ ఎమ్మెల్యే సునీల్ దత్ వారిని చూసి వెంటనే కారు ఆపి..తన కారులోనే ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 

తీరా అక్కడికి వెళ్లాకా..బాధితులను ఆస్పత్రికి లోపలికి తీసుకెళ్లేందుకు సరిపడా స్ట్రెచర్లు లేవు. అందుబాటులో ఉన్న వాటి ద్వారా ఇద్దరు క్షతగాత్రులను లోపలికి తీసుకెళ్లగా..మరొకరికి స్ట్రెచర్ లేదు. దీంతో ఆలస్యం చేయకుండా ఎమ్మెల్యే ద్వివేది సదరు బాధితుడిని తన భుజాలపైకి ఎక్కించుకొని ఎమెర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. తన భుజాలపై క్షతగాత్రుడిని మోసుకొచ్చిన ఎమ్మెల్యేను చూసిన ఆసుపత్రి సిబ్బంది, రోగులు, ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ తతంగాన్నంతా కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో అది వైరల్‌గా మారింది. అందరూ సునీల్‌దత్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.