ఏం మాట్లాడుతున్నారు జైట్లీ జీ....

 

ప్రస్తుతం ఏ ఏటీఎంకు వెళ్లినా అక్కడ నో సర్వీస్ బోర్ట్ తప్పా ఏం కనిపించడం లేదు. ఇక ఏటీఎంలలో డబ్బు కొరత వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలుసు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దీనపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం మూడురోజులు ఆగాల్సిందే అని తెల్చిచేప్పేశారు. నగదు కొరతపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్పీ శుక్లా స్పందిస్తూ, తమ వద్ద రూ. 1.25 లక్షల కోట్ల కరెన్సీ ఉందని, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కరెన్సీ, మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కరెన్సీ ఉన్న కారణంగా ఇబ్బందులు వచ్చాయని, తాను ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీలు, ఆర్బీఐ ఈ నగదును సమానంగా అన్ని రాష్ట్రాలకూ చేరుస్తుందని తెలిపారు. ఇది జరిగేందుకు కనీసం మూడు రోజులు పడుతుందని,ప్రజలు ఓపికతో ఉండాలని సూచించారు.

 

అయితే ఒకపక్క కేంద్రం అలా చెబుతుంటే.... మరోపక్క కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన నగదు సమస్య తాత్కాలికమేనని, దాన్ని వెంటనే పరిష్కరిస్తామని స్పందించారు. ఇక జైట్లీ చేసిన వ్యాఖ్యలపై పలు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా జైట్లీ వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల ఐటీ మంత్రులైన కేటీఆర్, నారా లోకేశ్ లు స్పందించి జైట్లీపై సెటైర్లు వేశారు. ‘సర్‌.. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత అకస్మాత్తుగా జరిగిందో లేదా తాత్కాలికంగా ఏర్పడిందో కాదు. హైదరాబాద్‌లో గత మూడు నెలలుగా నగదు సమస్యపై తరచూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. దయచేసి ఆర్‌బీఐ, ఆర్థికశాఖ అధికారులు దీనిపై లోతుగా చర్చించండి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసాన్ని పోగొట్టొద్దు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

 

మరోవైపు ఈ విషయంపై స్పందించిన నారా లోకేశ్‌.. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా అంతా బాగుందని అంటున్నారని, అరుణ్ జైట్లీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని అన్నారు. ఏపీలో నగదు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లోకేశ్‌ పేర్కొన్నారు.

 

అంతేకాదు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా దీనిపై స్పందించి... ప్రభుత్వం బ్యాంకింగ్‌ వ్యవస్థను నాశనం చేస్తోందంటూ ఆరోపించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనం చేయడం వల్లే నగదు కొరత ఏర్పడిందని..పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ మనల్ని క్యూలలో నిలబెట్టి మన జేబుల్లో నుంచి రూ.500, రూ.1000నోట్లను తీసుకుని.. ఆ డబ్బును వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ జేబులో పెట్టారని రాహుల్‌ విమర్శలు చేశారు. ప్రధాని మోదీకి దేశమంతా తిరిగే సమయం ఉంది కానీ లోక్‌సభలో 15నిమిషాలు ప్రసంగించడానికి సమయం లేదా అని మండిపడ్డారు.