లాలూ ఒక్కడే దొరికినట్టున్నాడు...

 

పాపం లాలూకి ఒకదాని తరువాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాణా కుంభకోణంలో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. పశు దాణా స్కాం కేసులో రాంచిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు లాలు ప్రసాద్‌ యాదవ్‌తో సహా మరో ఏడుగురికి మూడున్నరేళ్ల జైలుశిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించింది. అంతేకాదు నాలుగో కేసులో కూడా లాలూని దోషిగా తేల్చి విధించింది కోర్టు. 1990ల్లో దుమ్‌కా ఖజానా నుంచి అక్రమంగా రూ.3.13 కోట్లు తీసుకున్న కేసులో రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటుగా రూ.60 లక్షల జరిమానా విధించింది. ఇక ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది. రైల్వే హోటళ్ల టెండర్ల కేసులో కూడా ఇప్పుడు లాలూపై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసింది. కేంద్ర రైల్వేమంత్రిగా లాలు ఉన్నప్పుడు రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. లాలుప్రసాద్‌ యాదవ్‌ సహా మొత్తం 14 మందిపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలు భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి కూడా ఉన్నారు. ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని.. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు పేర్కొన్న సీబీఐ లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది.

 

మొత్తానికి ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబానికి కష్టాలు తప్పడం లేదు. చూడబోతే సీబీఐకి లాలూ కుటుంబం మాత్రమే కనిపిస్తోందేమో అని అనుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో వేలకు వేల కోట్లు కాజేసి.. ఎంచక్కా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న వాళ్లపై చర్యలు తీసుకోవడం చేత కాదు కానీ...ఏదో కక్ష కట్టినట్టు లాలూపైనే కేసులు దాఖలు చేయడం.. ఈ విషయంలో మాత్రం సీబీఐ కూడా చాలా యాక్టివ్ గా పనిచేయడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది అంటున్నారు. ముందు వేలకు వేల కోట్లు మింగేసిన వారిని దేశానికి రప్పించండి... నల్లధనాన్ని పోగేసుకున్న వాళ్లపై చర్యలు తీసుకోండి...అంతేకానీ.. ఇంక దేశంలో ఎవరూ లేనట్టూ.. లాలూ పైనే కేసులు వేస్తున్నారని మండిపడుతున్నారు. మరి చూడబోతే నిజంగానే లాలూ కుంటంబం ఒక్కటే సీబీఐకి దొరికినట్టుంది..అదే పనిగా కేసులు పెట్టుకుంటూ పోతోంది. మరి బిగ్ షాట్స్ విషయంలో కూడా ఇలానే స్పీడ్ గా ఉంటే బావుంటుంది..