ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా! కేంద్ర హోంశాఖ మంత్రికి లోకేష్ లేఖ..

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు  వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, హరియాణ, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా.., కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌, గోవా, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, అసోం రాష్ట్రాలు వాయిదా వేశాయి.  ఈ విషయాన్ని కూడా తమ నివేదికలో విద్యాశాఖ వివరించిందని తెలుస్తోంది. 

విద్యాశాఖ ఇచ్చిన నివేదికతో  టెన్త్ పరీక్షల వాయిదాపై రెండు, మూడు రోజుల్లో ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశముంది. కరోనా కట్టడి దృష్ట్యా ఈనెల 31 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండటం, కొన్ని స్కూళ్లను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. దీంతో పరీక్షలకు ఏర్పాటు చేయడం కష్టమని విద్యాశాఖ భావిస్తోంది. పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే.. భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని ఏపీ విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. మూడు, నాలుగు రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలని హెచ్ఎంలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.  

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా విసురుతుండటంతో  టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది. పరీక్షలను రద్దు చేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. విపక్షాలు కూడా పరీక్షలను రద్దు చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని కోరాయి.  విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పడం లేదని ప్రభుత్వం సమర్ధించుకుంటోంది. ఈ నెల మొదటివారంలో ప్రారంభం కావాల్సిన ఇంటర్ పరీక్షలు హైకోర్టు జోక్యంతో వాయిదా పడ్డాయి.  పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి

ఏపీలో పరీక్షలు రద్దు చేయాలని మొదటి నుంచి గట్టిగా పోరాడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. తాజాగా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో హోంమంత్రిని కోరారు నారా లోకేష్. కరోనా కల్లోల సమయంలోనూ విద్యార్థుల జీవితాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడే ప్రయత్నం చేస్తుందని లోకేష్ ఆరోపించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu