ఏపీకి నో స్పెషల్ స్టేటస్! నోరెత్తని ఏపీ ఎంపీలు



ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్ర ఒక్కసారిగా నీళ్లు చల్లినంత పనిచేసింది. ప్రత్యేక హోదాపై చర్చలు జరుగుతున్నాయి.. 60 శాతం చర్చలు పూర్తయయ్యాయి.. ఆలోచిస్తున్నాం అని ఎన్నో మాటలు చెప్పిన కేంద్రం ఇప్పుడు ఉన్నట్టుండి బాంబు పేల్చినంత పనిచేసింది. కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని.. గతంలో బీహార్ కు కూడా స్పేషల్ స్టేటస్ ఇవ్వలేదని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపిన సంగతి తెలిసిందే. అంటే దీనిని బట్టి ఏపీకి కూడా ప్రత్యేక హోదా రానట్టే అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంటే ఇంద్రజిత్ ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా మాత్రం చెప్పినట్టే భావిస్తున్నారు. లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు బీబీ పాటిల్‌, బీజేపీ సభ్యుడు విష్ణుదయాళ్‌ రామ్‌ ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నలపై ఇంద్రజిత్‌ సమాధానం చెపుతూ గతంలో ప్రత్యేక హోదా వివిధ రాష్ట్రాలకు అమలయ్యేదని, కాని ఇప్పుడు దానికి బదులు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచాలన్న 14వ ఆర్థిక సంఘం ప్రతిపాదనల్ని కేంద్రం యథాతథంగా ఆమోదించి అమలు చేస్తోందని చెప్పారు. దీనివల్ల ఏరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదని తెలిపారు.


ఇప్పటికే ఈ వార్తతో షాక్ లో ఉన్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏలాగూ ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేదు కాబట్టి ఇక కాలయాపన చేయకుండా కనీసం స్పెషస్ ప్యాకేజీ అయినా దక్కించుకుందామని అనుకుంటున్నారట. లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో జరిగినట్టే ప్రత్యేక ప్యాకేజీలో కూడా జరిగి దానిని కూడా కోల్పోయే పరిస్థితి వస్తుందని అనుకుంటున్నారట. అసలు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ ప్రభుత్వానికి  ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది.. ఈ విషయంలో అప్పటి  విపక్ష నేత వెంకయ్యనాయుడే పట్టుబట్టారు. దీంతో నవ్యాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మన్మోహన్‌సింగ్‌ ప్రకటించారు.. కేబినెట్‌లో తీర్మానమూ చేశారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏపీ ప్రత్యేక హోదాపై ఇలా మాట్లాడటం గమనార్హం. 

 
మరోవైపు కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పుతున్న మన ఏపీ ఎంపీలు మాత్రం నోరుకదపకపోవడం విచిత్రం. వాస్తవానికి ప్రశ్నోత్తరాల సమయంలో ఎవరైనా దాని అనుబంధం ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంటుంది. కానీ మన ఏపీ ఎంపీలు మాత్రం నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుండిపోయారు. ప్రత్యేక హోదా ప్రశ్నపై చర్చ జరుగుతుండగా టీడీపీ లోక్‌సభాపక్ష నాయకుడు తోట నరసింహం, బీజేపీ ఎంపీలు కంభంపాటి హరిబాబు, గోకరాజు గంగరాజు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్‌రెడ్డి సభలోనే ఉన్నారు కానీ ఒక్కరు కూడా కేంద్రాన్ని ప్రశ్నించలేదు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేసిన ఎంపీలు ఇప్పుడు వారి నోటికి తాళం ఎందుకు పడిందో.. మరో వైపు ఈ ప్రత్యేక హోదాపై జగన్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెపుతున్నారు. పార్లమెంట్ లోనే అడగటం చేతకాని నాయకులు ఇప్పుడు ధర్నా చేసి మాత్రం ఏ చేస్తారో చూద్దాం.