కావాలనే తప్పుడు నామినేషన్లు

 

 

 

ఎన్నికల సీజన్‌లో క్షణక్షణానికి సీన్ మారిపోతుంటుంది. బస్తీమే సవాల్ ఈ సీటు నాదేనని బీరాలు పలికినవారు నామినేషన్ ఘట్టానికి వచ్చేసరికి చతికిలపడతారు. నామినేషన్లకు ముందే కొందరు తప్పుకుంటుంటే మరికొందరు నామినేషన్ల అనంతరం. పోటీలో నిలబడి తీరతామని మీసం మెలేసి చెప్పిన వారు సైతం రహస్య బేరాలకు తలొగ్గి నామినేషన్ పత్రాల దాఖలులో కావాలని కొన్ని పొరపాట్లు చేసి అవి తిరస్కరణకు గురయ్యేలా చేసుకుంటున్నారు.

 

తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మూడో వార్డులో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థికి పరోక్షంగా సహకరిస్తూ మరో ప్రధాన పార్టీ అభ్యర్థి లోపాయికారీ ఒప్పందాలతో సహకరించారు. అతనికి ఖర్చు చేసే సత్తా లేక పోవడంతో నామినేషన్ వేసినట్టే వేశారు. కానీ వాటిని కావాలని  సరిగ్గా పూర్తి చేయలేదు. అతని నామినేషన్‌ను అనుకున్నట్టుగానే తిరస్కరించారు. దాంతో ఆ వార్డులో ఆయన స్నేహితుడి విజయం నల్లేరుపై నడకైంది. ఇలాగే చాలాచోట్ల అంతర్గత ఒప్పందాలతో నామినేషన్లను తిరస్కరింపజేసుకుని, హాయిగా ఇంట్లో పడుకుంటున్నారు. అదీ సంగతి.