మంత్రివర్గ ప్రక్షాళన చేయనున్న చంద్రబాబు!

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం మంత్రివర్గంపై అసంతృప్తితో ఉన్నారా అంటే ఉన్నారనే వార్తలే వినిపిస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారట. అసలు ఏపీ ప్రభుత్వంలో మంత్రులు ఎంత వరకూ పని చేస్తున్నారు అన్న నేపథ్యంలో చంద్రబాబు సర్వే చేయించారట. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు త్వరలో మంత్రివర్గం మార్చే దిశగా ఆలోచనలో ఉన్నారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో దసరా తరువాత మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని రాజకీయవర్గాలు చెవులుకొరుక్కుంటున్నాయి.

 

ఈ వార్తలు అలా వచ్చాయో లేదో అప్పుడే మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న వారు తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. కాగా ఇప్పటికే ఇద్దరు మంత్రుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది. ఇంకో విషయం ఏంటంటే ఏపీ మంత్రివర్గంలో ఇప్పటి వరకూ ముస్లింలకు ప్రాతినిధ్యం లేదు.. అయితే ఇప్పుడు ముస్లిం వర్గం నుండి ఎవరూ లేకపోవడంతో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎంఎ షరీఫ్‌కు మంత్రివర్గంలో చోటు ఖాయం కాబోతుందని సమాచారం. ఈ మేరకు చంద్రబాబు కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్టీల నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేదు. ఈ కోటాలో పోలవరం ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా ఎమ్మెల్సీగా గుమ్మడి సంధ్యారాణిని ఎంపిక చేశారు. వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇటీవలె ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డిలో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు కూడా వినిపిస్తోంది. వీరితో పాటుగా గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ విషయంలో పార్టీ కేడర్‌లో మొదటి నుంచి సానుకూలత ఉంది. అయితే మంత్రివర్గంలో ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? ఎవరికి ఛాన్స్ ఇస్తున్నారు? అనేది త్వరలో తెలుస్తోంది.