వైకాపా మళ్ళీ సభకు వచ్చింది అందుకేనా?

 

శాసనసభ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పక్షపాత వైఖరిని నిరసిస్తూ ఆయనపై అవిశ్వాస తీర్మానానికి వైకాపా నోటీసు ఇచ్చింది. ఆ తీర్మానంపై చర్చ చేపడుతామని ప్రభుత్వం ప్రకటించేవరకు శాసనసభలో అడుగుపెట్టబోమని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నాలుగు రోజుల క్రితమే హడావుడిగా ప్రకటించేశారు. బడ్జెట్ సమావేశాలపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరేవారు మీడియాలో చూసుకోమని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చేరు. కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రకు సిద్దమయ్యారు కూడా. దానికి మార్చి26 ముహూర్తం ఖరారు చేసుకొన్నారు కూడా.

 

అయితే బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలానే తన నిర్ణయం తొందరపాటు నిర్ణయమని గ్రహించారో లేక దాని వలన అధికార పార్టీకి చేజేతులా తనను విమర్శించేందుకు అవకాశం దొరుకుతుందని భయపడ్డారో తెలియదు గానీ అంత భీషణ శపథం చేసిన జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ్యులతో సహా శాసనసభ సమావేశాలకు యధావిధిగా మళ్ళీ ఈరోజు హాజరయ్యారు. తమంతట తాము బడ్జెట్ సమావేశాలను బహిష్కరించడం వలన ప్రజలలో తమకే చెడ్డపేరు వస్తుందని గ్రహించిన వైకాపా అదేదో అధికారపార్టీ చేత బహిష్కరింపబడి బయటకు వచ్చేస్తే ప్రజల సానుభూతి దక్కుతుందనే ఆలోచనతోనే మళ్ళీ సభకు హాజరయ్యినట్లుంది సభలో వారి తీరు చూస్తుంటే. కరెంట్ చార్జీల పెంపుదల మీద ప్రస్తుతం సభలో వారు రభస చేస్తున్నారు. తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే స్పీకర్ మైక్ కట్ చేస్తున్నారని వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంని చుట్టుముట్టి సభను స్తంభింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

శంఖంలో పోస్తే గానీ నీళ్ళు తీర్ధం కావన్నట్లుగా స్పీకర్ చేత బహిష్కరింపబడితే కానీ తమకు ప్రజల సానుభూతి దొరకదనే ఉద్దేశ్యంతోనే తమ బస్సు యాత్రకి 26వ తేదీని ముహూర్తం ఖరారు చేసుకొన్నట్లున్నారు. కనుక ఇక స్పీకర్ దే ఆలశ్యమనుకోవాలేమో? వైకాపా సభ్యులు తాము ప్రజా సమస్యల మీద చర్చించాలనుకొంటున్నట్లు చెపుతూనే ఈవిధంగా రాజకీయాలు చేయడం శోచనీయం. వారిప్పుడు బయటకు వెళ్ళిపోయే తొందరలో ఉన్నట్లున్నారు. ఒకవేళ వారు స్పీకర్ చేత బహిష్కరింపబడి బయటపడినట్లయితే ఇక అప్పుడు ప్రభుత్వాన్ని శాస్త్రసమ్మతంగా విమర్శించుకోవచ్చును.