కేసీఆర్ ను చాలా జాగ్రత్తగా చూసుకున్న చంద్రబాబు
posted on Oct 23, 2015 3:00PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ ను స్వయంగా శంకుస్థాపన కార్యక్రమానికి పిలిచిన సంగతి అందరికి తెలిసిందే. కేసీఆర్ కూడా తాను వస్తానని చెప్పిన మాట ప్రకారం శంకుస్థాపనకు వెళ్లారు. అయితే ఏదో పిలిచాం కదా మన పని అయిపోయిందిలే అని వ్యవహరించకుండా.. కేసీఆర్ వచ్చిన దగ్గర నుండి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే మంత్రులకు ఆదేశించడం జరిగిందట. అంతేకాదు చంద్రబాబు చెప్పినట్టు మంత్రులు కూడా కేసీఆర్ ను అదే రీతిలో ఆహ్వానించడం.. ఆయనకు కావలసినవి చూసుకోవడం చేశారంట. దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన ప్రాంగణానికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడానికి చంద్రబాబుతో పాటు కేసీఆర్ కూడా వెళ్లారు. అయితే కేసీఆర్ కొంచెం వెనుక ఉండగా.. చంద్రబాబు కేసీఆర్ ను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదొక్కటే కాదు ఇంకా ఇతర అంశాల్లో కూడా చంద్రబాబు కేసీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఒక్క చంద్రబాబే కాదు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఎవరో ఒకరు కేసీఆర్ తో మాటలు కలుపుతూ కేసీఆర్ ఎక్కడా నొచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నాలు చేశారు. అంతేనా అమరావతి శిలాఫలకంపై కూడా కేసీఆర్ పేరు చేర్చి అత్యంత గౌరవం దక్కించారు చంద్రబాబు.