చంద్రబాబుకి సోనియాగాంధీ కృతజ్ఞతలు
posted on Oct 19, 2015 10:42AM

ఏపీ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపీ మంత్రులు అందరికి ఆహ్వాన పత్రికలు అందిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నేతలకు ఆహ్వానాలు అందజేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబునాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు సోనియాగాంధీని కూడా ఆహ్వానించారు. దీనికి సోనియాగాంధీ తనను శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించినందుకుగాను చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతు లేఖ రాశారు. అంతేకాదు ఏపీ నూతన రాజధాని అమరావతి పరిఢవిల్లాలని.. ఒక రాష్ట్రానికి రాజధాని నిర్మాణం లాంటి మంచి పని చేస్తున్నందుకు చంద్రబాబుకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఈ అమరావతికి రెండువేల సంవత్సరాలకు ముందు నుండే ఘన చరిత్ర ఉందని.. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి అభివృధ్ధి చెందాలని కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందించి రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరగా కేసీఆర్ తాను తప్పకుండా వస్తానని చెప్పారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ కు కూడా ఆహ్వానపత్రికను అందజేశారు.