కాలేజీ ల్యాబ్‌లో డెడ్ బాడీ

 

ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లాబ్‌కు మంగళవారం ఉదయం వెళ్ళిన విద్యార్థులు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయారు. కాలేజీ ల్యాబ్‌లో ఒక మహిళ మృత దేహం వేలాడుతూ వుండటంతో భయపడిపోయి కేకలు వేశారు. ఆ తర్వాత పరిశీలించగా ఆ మృతదేహం కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అంజనీదేవిదని తెలిసింది. మహిళా లెక్చరర్ ఆత్మహత్య ఉదంతం అద్దంకిలో సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిన ప్రజలు భారీ సంఖ్యలో కళాశాల వద్దకు చేరుకున్నారు. లెక్చరర్ అంజనీదేవి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది, ఎప్పుడు పాల్పడింది, తన ఆత్మహత్యకు కళాశాల ల్యాబ్‌ని ఎందుకు ఎంచుకుందన్న సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. అంజనీదేవిది ఆత్మహత్యా లేక హత్యా అనే సందేహాలను కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.