ఒకే అపార్ట్ మెంట్‌లో ఏకంగా 103 మందికి కరోనా.. బెంగుళూరులో కలకలం
posted on Feb 17, 2021 9:38AM
మనదేశ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 103 మంది ఒకేసారి కరోనా బారినపడడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలోని బొమ్మనహళ్లి జోన్ లోని బిలేకహళ్లిలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో 435 ఫ్లాట్లు ఉన్నాయి. ఆ ఫ్లాట్లలో మొత్తం 1500 మంది నివసిస్తున్నారు. ఒక్కసారిగా ఇంతమందికి కరోనా వైరస్ సోకడానికి ఈ నెల 6న అపార్ట్‌మెంట్ వాసులు అందరు కలిసి ఏర్పాటు చేసుకున్న పెద్ద పార్టీ లో డ్రైవర్లు, పనిమనుషులు, వంటవాళ్ళతో సహా అందరు హాజరయ్యారు. అయితే ఈనెల 10 న మొదటి పాజిటివ్ కేసు బయటపడడంతో అందరికీ పరీక్షలు నిర్వహించగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 103 కు చేరుకుంది. ఇలా ఉండగా పాజిటివ్ వచ్చిన వారిలో 96 మంది 60 ఏళ్లకు పైబడిన వారిగా గుర్తించారు.
ఈ సమాచారం తెలుసుకున్న బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) అధికారులు అపార్ట్‌మెంట్‌కు వద్దకు చేరుకుని సెక్రటరీ, ఇతర సిబ్బందితో మాట్లాడి వారు పాటిస్తున్న కొవిడ్ నిబంధనలపై ఆరా తీశారు. అందరు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. బీబీఎంపీ సిబ్బంది అపార్ట్ మెంట్ మొత్తం శానిటైజ్ చేశారు. కరోనా బారినపడి వారందరు ప్రస్తుతం క్వారంటైన్‌కు వెళ్లారు..