నిరుద్యోగులకి స్పీడ్ బ్రేకర్స్ కానున్న కొత్త జిల్లాలు?

 

విభజన తరువాత ఏర్పడ్డ నవ తెలంగాణ విషయంలో ఎన్నో విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన అలాంటి పనులు చేయాల్సిందే. గొల్కొండ కోటపై జెండా ఎగురవేయటం, సకల జనుల సర్వే లాంటి నిర్ణయాలు మొదలు తాజాగా అమలు చేస్తున్న జిల్లాల విభజన వరకూ ఆయన ఎన్నో దూకుడుగా చేస్తున్నారు. అయితే, ఇవాళే తుది రూపు దాల్చనున్న 27జిల్లాల తుది తెలంగాణ చిత్రపటం కొత్త సమస్యలు తెచ్చిపెట్టవచ్చంటున్నారు అధ్యయనకారులు. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ కొత్త  జిల్లాల హీట్ మరింత ఎక్కువంటున్నారు...

 

ఒక్కసారి తెలంగాణ ఉద్యమం మూలాల్లోకి వెళితే మనకు స్పష్టంగా కనిపించేది ఉద్యోగాల డిమాండ్. సమైక్యాంధ్రగా వున్నప్పుడు తమకు తగినన్ని ఉద్యోగాలు రాలేదన్నదే యువత ప్రధానమైన ఆరోపణ.అందుకే, ఉస్మానియా యూనివర్సిటీ మొదలు మారుమూల పల్లెల దాకా యూత్ ఉద్యమంలోకి దూకింది. కాని, తీరా స్వరాష్ట్రం వచ్చాక కూడా పెద్దగా కొలువు జాతర జరిగిందేం లేదు. టీఎస్పీఎస్సీ ఏర్పాటై నోటిఫికేషన్ల వంటివి వస్తున్నా ఈ రెండేళ్లలో భారీగా ఉద్యోగాల్లో చేరిన నిరుద్యోగులు లేరనే చెప్పాలి. అలాగే, రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా బోలెడు మంది వున్నారు.

 

స్వంత రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వున్న తెలంగాణ వాదులు,  కేసీఆర్ పై ఇప్పటికిప్పుడు నమ్మకాన్ని కోల్పోవటం లేదు. సహనంగా వాళ్లు జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, సీఎం తీసుకున్న తాజా జిల్లాల ఏర్పాటు నిర్ణయం వారిలో కొంత మందిని నిరాశపరిచే ఛాన్స్ వుంది. పది జిల్లాలు ఇరవై ఏడుగా మారితే కొత్తగా వచ్చిన 17 జిల్లాల వల్ల అనేక పెను మార్పులు తప్పనిసరి. అందులో నియామకాలు కూడా వుంటాయి. ఎందుకంటే, ఇప్పటి వరకూ ప్రబుత్వ ఉద్యోగాలు జోన్ల వారీగా భర్తి చేస్తున్నారు. కాని, ఇప్పుడు దసరా కల్లా కొత్త జిల్లాలు అమల్లోకి వస్తే జోన్లు కొనసాగే ఛాన్స్ లేదు. అంతే కాదు, జోనల్ వ్యవస్థ రద్ధు చేస్తూ స్వయంగా కేసీఆరే నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల ఇప్పటికే పెండింగ్ లో వున్న గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ మరింత డిలే కానుంది. రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు జిల్లాల ఏర్పాటు పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలి. ఆ తరువాత కూడా గ్రూప్ వన్, గ్రూప్ టూ ఉద్యోగాల్ని ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి పోస్టులుగా విభజించే దాకా ఎదురుచూడాలి. ఇలాంటి కసరత్తు అంతా పూర్తి కావాలంటే అటుఇటుగా ఆర్నెల్లు పట్టొచ్చు. ఆ తరువాతే రాత పరీక్ష. పోస్టుల భర్తి.

 

ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన గ్రూప్ 2 నే కాదు ఇంకా చాలా రకాల పోస్టులు ప్రస్తుతం జోనల్ పద్ధతిలో భర్తి చేస్తున్నారు. జూనియర్ లెక్చరర్, డైట్ లెక్చరర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్,  సబ్ ఇన్‌స్పెక్టర్ వంటి పోస్టులు కూడా ఇప్పుడప్పుడే భర్తీ అయ్యే సూచనలు కనిపించటం లేదు. జిల్లాల ఏర్పాటు మొత్తం ఓ కొలిక్కి వచ్చాకే జోనల్ పద్ధతిలో భర్తీ అవుతూ వచ్చిన ఈ పోస్టులు నోటిఫికేషన్ కి వస్తాయి.

 

ఇక తెలంగాణ నిరుద్యోగుల్ని వేధిస్తున్న మరో అంశం జోనల్ పద్ధతి పోయి ఓపెన్ సిస్టమ్ వస్తే ప్రతీ ఉద్యోగానికి అందరూ పోటీ పడే ఛాన్స్ వుంటుంది. ఇలా అయితే, లోకల్ వారికి ఉద్యోగాలు అంత ఈజీగా దక్కే అవకాశం వుండదు. హైద్రాబాద్ లాంటి జిల్లాల నుంచి అభ్యర్థులు భారీగా ఇతర జిల్లాల ఖాళీలకు పోటీ పడతారు. అప్పుడు స్థానిక నిరుద్యోగులకు విజయం సాధించటం కత్తి మీద సామైపోతుంది. దీనికి విరుగుడుగా ఉద్యోగాల్లో కొన్ని స్థానికులకి, కొన్ని ఓపెన్ క్యాటగిరిలో పెడతారని వార్తలు వస్తున్నా అవ్వి ఏ నిష్పత్తిలో , ఎప్పుడు విభజిస్తారనే దానిపై క్లారిటీ లేదు. మొత్తం మీద తెలంగాణ నిరుద్యోగ యువతకి కొత్త జిల్లాల ఏర్పాటు పెద్ద స్పీడ్ బ్రేకర్ లా తయారైందని చెప్పుకోవచ్చు. మరి రాష్ట్ర ఏర్పాటుకే అసలు కారణమైన ఉద్యోగాల భర్తి సమస్యని వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై ప్రభావం చూపకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఎలా హ్యాండిల్ చేస్తారో మరి కొంత కాలం వేచి చూడాలి...