అంగట్లో అన్నీ వున్నా న్యూస్ ఛానల్ ప్రేక్షకుడి నోట్లో....


అంగట్లో అన్నీ వున్నా... అల్లుడి నోట్లో శని అంటారు! పాపం తెలుగు న్యూస్ ఛానల్స్ చూసే వారి పరిస్థితి ఆ అల్లుడిలాగే తయారైంది! అసలు విషయం తెలుసా... మొత్తం దేశంలో తెలుగు వాళ్లకు వున్నన్ని న్యూస్ ఛానల్స్ మరే భాష వారికి లేవు! ఇది నిజంగా గర్వించదగ్గ విషయం. కాని, ఆనందించదగ్గ సంగతి మాత్రం కాదు!

 

తెలుగులో దాదాపు 20 వరకు వార్త ఛానల్స్ వున్నాయి. అందులో కొన్నిట్ని జనం చూస్తే ... కొన్ని ఛానల్స్ వున్నాయని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. కనీసం ఉద్యోగులకు నెలకోసారి జీతాలు కూడా ఇవ్వని న్యూసెన్స్ ఛానల్స్ బోలెడున్నాయి మన ఉభయ రాష్ట్రాల్లో. అయితే, ఇక్కడ విషయం వాట్ని తిట్టిపోయటం కాదు. అసలు ఇన్నేసి ఛానల్స్ జనానికి ఏం అందిస్తున్నాయి అని ఒకసారి విశ్లేషిస్తే ఒకింత ఆశ్చర్యమే కలుగుతుంది...

 

గత రెండు వారాలుగా అందర్నీ షేక్ చేసిన రెండే రెండు విషయాలు కృష్ణ పుష్కరాలు, సింధు పతకం గెలవటం. ఇవాళ్టితో కృష్ణమ్మ పుష్కర సంబరం ముగుస్తోంది. సింధు కూడా రెండు రాష్ట్రాల సన్మానాలు పొంది ఇల్లు చేరుకుంటోంది. కాబట్టి ఈ రెండు టాపిక్స్ కాస్త చల్లబడతాయి. కాని, ఇదే సందర్భరంలో మన మీడియా వ్యవహారం ఓ సారి చక్కగా చూడొచ్చు...

 

ఎన్ని ఛానల్స్ వున్నా అన్నీ గత రెండు వారాలుగా పుష్కరాలు, ఒలంపిక్స్ లో మెడల్ గెలవటం అనే టాపిక్స్ నే నెత్తికెత్తుకున్నాయి. మీరు రిమోట్ పట్టుకుని కూర్చుంటే వరుసగా రియో ముచ్చట్లే తప్ప మరొకటి కనిపించేది కాదు. కాదంటే మన రిపోర్టర్లు కెమెరా వేసుకుని వెళ్లి మైక్ పట్టుకుని జనాన్ని దగ్గరుండి పుష్కర స్నానాలు చేయించేవారు! పన్నెండు రోజులు అదే ప్రశ్న '' మీరెలా ఫీలవుతున్నారు?''... లేదంటే '' ఏర్పాట్లు ఎలా వున్నాయి?'' దానికి జనం కూడా రొటీన్ సమాధానాలే ఇచ్చి పిండ ప్రదానానికి వెళ్లిపోయే వారు! ఇదీ వరస...

 

రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్న విషయాల్ని రిపోర్ట్ చేయకుండా మరేం చేయమంటారు అని మీరు ప్రశ్నించవచ్చు! కాని, ఒకసారి మనం జాతీయ ఇంగ్లీష్ మీడియా ఛానల్స్ ని పరిశీలిస్తే ఏం చేయోచ్చొ తెలుస్తుంది. అక్కడ వారు ఒక ఛానల్ ఒక విషయాన్ని ప్రధానంగా పట్టుకుంటే మరో ఛానల్ మరో ఆసక్తికర అంశాన్ని ఫాలోఅప్ చేస్తుంది. కాని, తెలుగులో అలాంటిదేమీ వుండదు. ఈ విషయం మాకు బాగా తెలియాలంటే పార్లమెంట్ , అసెంబ్లీల సమావేశాలు జరుగుతున్నప్పుడు చూడండి. టీవీ 9 మొదలు చోటామోటా ఛానల్స్ వరకూ అందరూ సమావేశాల లైవ్ ఇచ్చి టీలు, టిఫిన్లు కానివ్వటానికి వెళ్లిపోతారు. ఒకే లైవ్ ని అన్ని ఛానల్స్ లో చూడాల్సిన అగత్యం జనానికి ఎందుకుంటుంది? అందుకే, మన దగ్గర ఎన్ని ఛానల్స్ వున్నా టీఆర్పీలు మాత్రం ఒకట్రెండు ఛానల్స్ కే వస్తుంటాయి!

 

పుష్కరాలు, ఒలంపిక్స్ లాంటివి వచ్చినప్పడు ఛానల్స్ సాధ్యమైనన్ని కొత్త విషయాలు, కొత్త కోణాలు ఆవిష్కరిస్తే బావుంటుంది. కాదంటే, అరడజను ఛానల్స్ ఆల్రెడీ ఒకే అంశం చుట్టూ ఈగల్లా ముసురుకుంటే నెక్ట్స్ ఛానల్ వారు సీరియస్ గా ప్రజా సమస్యల్ని రిపోర్ట్ చేయవచ్చు. ఆఫ్ట్రాల్ పుష్కరాలు వచ్చాయనో, పతకాలు గెలిచామనో, ఫలాన అగ్రహీరో సినిమా ఆడియో రిలీజ్ అవుతుందనో .... ప్రజా సమస్యలు మాయమైపోవు గదా? మన సమాజంలో బోలెడు కష్టాలు, కన్నీళ్లు వున్నాయి. వాట్ని జనం దృష్టికి , పాలకుల దృష్టికి తేకుండా అన్ని ఛానల్స్ పోలోమని ఒకే రొట్టే ముక్కపై పడి కొట్టుకోవటం ఎందుకు? దాని వల్ల ప్రేక్షకుల కంటే సదరు మీడియాకే ఎక్కువ నష్టం! కొన్ని రోజులు పోయాక టాప్ ఫోర్ ఆర్ ఫై ఛానల్స్ తప్ప మిగతావన్నీ చూడటం మానేస్తారు జనం. అప్పుడు చేసేది లేక దుకాణాలు మూసుకోవాల్సి వస్తుంది!