ఆర్బీఐ 'చించేసే' నిర్ణయం తీసుకుంటుందట!
posted on Nov 18, 2016 3:34PM

పది రోజుల కిందటి దాకా ఫుల్ వాల్యూతో గర్వంగా చక్కర్లు కొట్టిన అయిదు వందలు, వెయ్యి నోట్లు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? కోళ్ల ఫారమ్ లోని కోళ్లలా... ఇరుకు డబ్బాల్లో ఇరుక్కుపోయాయి. విలువ లేక బిక్కు బిక్కుమంటూ కూర్చున్నాయి. డిసెంబర్ 30లోగా జనం వీట్ని బ్యాంకుల్లో పడేస్తారు. అక్కడ్నుంచీ రిజర్వ్ బ్యాంకుకి వెళతాయి. మరి తరువాత ఈ పాత 5వందలు, వెయ్యి నోట్ల గతేంటి?
డిమానిటైజేషన్ దెబ్బకి గ్లామర్ పోయిన పాత నోట్లు త్వరలోనే ముక్కలు కానున్నాయి. దేశం నలుమూలల్లోంచి రిజర్వ్ బ్యాంకు శాఖలకు చేరుకున్న ఈ నోట్లను సాధారణంగా అయితే తగలేయాలి. కాని, దేశంలోని 85శాతం డబ్బు ప్రస్తుతం విలువ లేకుండా పోయిన 500, 1000 నోట్ల రూపంలోనే వుంది. అందుకే, లక్షల కొద్దిగా వచ్చే పాత నోట్లను కాల్చటం కాకుండా చించేయాలని డిసైడ్ అయిందట ఆర్జీఐ. అదే జరిగితే ... స్వతంత్ర భారత చరిత్రలో ఒక శకం ముక్కలైపోయినట్టే లెక్కా!