జడ్జికే కోపం తెప్పించారుగా...విసిగిపోయా..
posted on Nov 18, 2017 11:51AM
.jpeg.jpg)
అక్రమాస్తుల కేసులో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేస్తూ కూడా... ప్రతి శుక్రవారం బ్రేక్ తీసుకొని మరీ కోర్టుకు హాజరవుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే జగన్ నిన్న కోర్టుకు హాజరయ్యాడు. ఈసందర్బంగా జగన్ తరపు లాయర్ పై జడ్జి ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జగన్ తరపు న్యాయవాది నాలుగు ఛార్జ్ షీట్లపై డిశ్చార్జ్ పిటిషన్లను కలిపి విచారించాలంటూ జడ్జిని కోరారు. అంతే జడ్డి గారు లాయర్ కు చీవాట్లు పెట్టారు.ఇంతకీ ఏ విషయంలో జడ్డిగారికి అంత కోపం వచ్చిందో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే.
అక్రమాస్తుల కేసులో భాగంగా... సీబీఐ జగన్ పై పలు ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ దాఖలు చేసిన సీసీ 9 కేసు ఛార్జ్ షీట్ ను పక్కన పెట్టాలంటూ గతంలో జగన్, జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారణకు రాగా నిన్న సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అయితే అదే సమయంలో 8, 10, 14 ఛార్జ్ షీట్లను కూడా కలిపి విచారించాలని జగన్ తరపు లాయర్ అశోక్ రెడ్డి కోరారు. అంతే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన జడ్జి.... గత రెండేళ్లుగా విచారణలో జాప్యం చేస్తున్నారని... ఇంకెంత కాలం కోర్టు సమయాన్ని వృథా చేస్తారంటూ మండిపడ్డారు. మీరు వ్యవహరిస్తున్న తీరుతో విసిగిపోయానంటూ అసహనం వ్యక్తం చేశారు. తన 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని... 'ఇప్పటి వరకు కోర్టు సమయాన్ని వృథా చేసింది చాలు... ఇకపై ఇలాంటివి కుదరవు' అంటూ చీవాట్లు పెట్టారు. మొత్తానికి జగన్ కు మాత్రం ఎక్కడికి వెళ్లినా చీవాట్లు మాత్రం తప్పట్లేదుగా..