ఫైర్‌బ్రాండ్‌ల నెలవుగా మారిన కృష్ణాజిల్లా ?
posted on Jul 30, 2012 12:15PM
రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవటం పరిపాటే. ఈ విమర్శల్లో రాటుదేలిన కృష్ణాజిల్లా నేతలు వార్తల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అటువంటి వారి కోవలో ఎక్కువకాలం రాజ్యమేలినది ఎంపి లగడపాటి రాజగోపాల్. ఈయన మాట్లాడటమే ఎదుటివారిని కదిలించేసి వారి నుంచి ఊహించని రియాక్షన్ కూడా వచ్చేస్తుంటుంది. ఆఖరికి ఈయన తీసుకునే నిర్ణయాలు కూడా ఎదుటివారిని తక్కువ చేయాలనే కసిగా ఉంటాయని ప్రచారం. ఈయన్ని దూషించని తెలంగాణా నేత లేరంటే అతిశయోక్తి కాదు.
ఫైర్‌బ్రాండ్‌గా ఈయన తరువాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యే దేవినేని ఉమ కూడా జాబితాలో చేరారు. ఉమ ఇటీవలే గుడివాడ ఎమ్మెల్యే ఆళ్ల నానిని టిడిపి సస్పెండ్ చేసినప్పుడు ఉమ భయంకరంగా ఫైర్ అయ్యారు. అయితే గురవింద గింజ సామెతలా తన తమ్ముడు టిడిపిని కాదని వై.కా.పా.లో చేరిన విషయాన్ని మరిచారు. అప్పుడు నాని ఆయనకు ఆ విషయాన్ని గుర్తిచేశారు. దీంతో తప్పనిసరిగా తగ్గాల్సివచ్చింది.
తరువాత తాజాగా ఉమ ఎంపి లగడపాటిని అసమర్థుడంటూ ఫైరయ్యారు. నీటివిడుదల విషయంలో కృష్ణా రైతాంగానికి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేస్తామంటూనే ఉమ తన మాటల తూటాలను లగడపాటికి ఎక్కుపెట్టారు. విజయవాడ నగరాభివృద్థి చేసానంటూ లగడపాటి వొట్టి కోతలు కోస్తున్నారని ఉమ అన్నారు. రైల్వేలో తీరని అన్యాయం జరిగిందని, దీనికి లగడపాటి వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ఇలా కృష్ణాజిల్లాలో ఇద్దరు ఫైర్‌బ్రాండ్‌లు తలపడుతున్నారు. ఎంపి లగడపాటి దీనిపై ఎలా రియాక్టు అవుతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.