LATEST NEWS
తెలంగాణ ఉద్యోగులకు ప్రభుత్వం డీఏను విడుదల చేసింది. జూలై 2019 నుంచి అమలు కావాల్సిన DAను 5.24 % పెంచుతూ జీవో జారి చేసింది. 2019 జూలై 1 నుంచి రావాల్సిన ఒక డిఏను వెంటనే ఉద్యోగులకు చెల్లించాలని ఆర్థిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ డీఏ కోసమే చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. ఉద్యోగులు కోరిక మేరకు దసరా పండుగ మరుసటి రోజున  సెలవు దినంగా ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ ఏడాది దసరా మరుసటి రోజును సెలవు దినంగా నిర్ణయిస్తూ షెడ్యూల్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.   దసరా ముందు డీఏ పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగులు ఊరట చెందారు. దసరా మరుసటి రోజు సెలవుగా ప్రకటించడాన్ని స్వాగతించారు. అయితే తెలంగాణ ఉద్యోగుల సంతోషం ఎంతో సేపు నిలవలేదు. వరద బాధితుల సహాయం కోసం విరాళంగా ఉద్యోగుల ఒకరోజు వేతనం కట్ చేస్తూ మరో నిర్ణయం వెలువడింది. సర్కార్ నిర్ణయంతో తమ  సంతోషం కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయిందని ఉద్యోగులు ఢీలా పడ్డారు. ప్రభుత్వం ఇలా ప్రకటించి.. అలా తీసుకున్నారని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలకు చేయూత అందించేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సహాయంగా అందించాలని నిర్ణయించారు. మొత్తం రూ.33 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సహాయంగా అందించే కాన్సెంట్ లెటర్ ను ఉద్యోగ సంఘాల నాయకులు ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ కు అందించారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్లు, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, డ్రైవర్లు తమ ఒక రోజు వేతనాన్ని అందించనున్నారు.       ప్రభుత్వానికి ఒక రోజు వేతనం ఇవ్వాలన్న జేఏసీ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తమ ఒక రోజు వేతనాన్ని ఎలా పణంగా పెట్టారంటూ కొన్ని ఉద్యోగ సంఘాలు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణా గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం ఓపెన్ లెటర్ కూడా విడుదల చేసింది. పీఆర్సీ, ఐఆర్ విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా ఉన్నా.. జేఏసీ ఎందుకు ప్రశ్నించడం లేదని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నేతలు ప్రశ్నించారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు పడిన.. ఎందుకు స్పందించలేదని నిలదీశారు.  గ్రామ రెవిన్యూ సంఘాల బాటలోనే మరికొన్ని సంఘాలు కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాయి.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటుతో రాయలసీమ స్టీల్స్ లిమిటెడ్‌ను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ పర్యవేక్షణలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపింది.    గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పోరేషన్‌ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ పేరిట కడపలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ కు మధుసూదన్‌ను తాత్కాలిక సీఎండీగా నియమించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, గత కొన్ని రోజులుగా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కార్పొరేషన్ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులు, ప్రజలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఐతే ఈ ఉద్యమాన్ని ఎలాగైనా భగ్నం చేసి తాము కోరుకున్న విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనీ వైసిపి సర్కార్ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఉద్యమం చేపట్టి.. 300 రోజులు పూర్తీ కావడంతో పాటు ప్రధాని మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్దండరాయనిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ సర్కార్ కు మళ్ళీ టెన్షన్ మొదలైంది.   ఇప్పటిదాకా తమపార్టీ నేతలతో విశాఖ కర్నూల్ ప్రాంతాల్లో మూడు రాజధానుల అనుకూల ప్రదర్శనలు చేయించిన సర్కార్ ఇపుడు ఏకంగా అమరావతి ప్రాంతంలోనే బలప్రదర్శన చేయాలనే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేసింది. గతంలో కూడా దళిత రైతుల పేరుతో వైసీపీ అనుకూల క్యాంపులు నిర్వహించి... చంద్రబాబునాయుడి పర్యటనలో.. చెప్పులు కూడా వేయించినా అవన్నీ బయటపడిపోయాయి. తాజాగా నిన్న తాము కూడా ప్రదర్శన నిర్వహిస్తామని.. మూడు రాజధానులకు అనుకూలమంటూ కొందరు పోలీసులను పర్మిషన్ అడిగినట్లు.. దానికి వారు ఒక టైమ్ ఫిక్స్ చేసినట్లు హైడ్రామా నడిచింది. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడి రైతులు భగ్గుమన్నారు. దీంతో ఏదేమైనా సరే అని.. మళ్లీ కొందరిని చివరి నిమిషంలో ఆటోల్లో తరలించి.. ఆ ప్రాంతంలో గొడవలు రేపటానికి కూడా ప్రయత్నించారు.   ఐతే ఈ మొత్తం ఉదంతం పై వైసిపి రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. కర్నూల్‌లో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని అసలు బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా? అమరావతి వాడు కర్నూల్‌లో ఒకటి.. వైజాగ్‌లో ఒకటి కావాలని అడుగుతాడా? అన్నం తింటున్నారా.. గడ్డితింటున్నారా... ఇది కేవలం పెయిడ్ ఆర్టిస్టుల పని అని అర్థమువుతోంది. వైసిపి వాళ్ళు చిన్నపిల్లల్లా, తెలివితక్కువతనంతో ప్రవర్తిస్తున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతోంది. నాలుగు గంటలకల్లా ... ఆటోలో కొంతమంది అక్కడికి చేరుకున్నారంటూ అయన తన దగ్గరున్న మొబైల్‌లోని ఓ ఫొటో చూపించారు. వైసీపీ లోకల్ ఎమ్మెల్యేనే పెయిడ్ ఆర్టిస్టుల సప్లయిర్ అని అయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు ప్రజాప్రతినిధే ఒక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తీసుకున్నారన్నారు. వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారట. ఐతే ఆటోలో వచ్చిన వారికి... ఎందుకు వెళుతున్నారో కూడ తెలియదని అయన అన్నారు.
ALSO ON TELUGUONE N E W S
'రాధే శ్యామ్' సినిమాకి సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్ పేరు ప్రకటించినప్పుడు కొంతమంది నుండి కామెంట్లు వినిపించాయి. ఎందుకంటే... తెలుగులో అతడు చేసింది ఒక్క సినిమాయే. పైగా, అది కూడా ప్లాప్. అదీ విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'. అయితే... ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'రాధే శ్యామ్' మోషన్ పోస్టర్ ద్వారా తానేంటో జస్టిన్ ప్రభాకరన్ నిరూపించుకున్నాడు.  రోమియో-జూలియట్... సలీం-అనార్కలి... దేవదాసు-పార్వతి... చరిత్రలో నిలిచిపోయిన, ఎప్పటికీ చరిత్ర గుర్తుపెట్టుకునే గొప్ప ప్రేమికులు. 'రాధా శ్యామ్' కూడా అటువంటి గొప్ప ప్రేమికుల కథే అన్నట్టు మోషన్ పోస్టర్ విడుదల చేశారు. అందులో ప్రభాస్-పూజా హెగ్డే జోడీ బాగుంది. దర్శకుడు రాధాకృష్ణకుమార్ టేకింగ్ కూడా బాగుంది. వీటన్నిటితో పాటు, ఇంకాస్త చెప్పాలంటే వీటన్నిటికంటే కొంచెం ఎక్కువే నేపథ్య సంగీతం ప్రేక్షకులని ఆకట్టుకుంది. "కృష్ణ కృష్ణ మదమోహన  చిత్రచోర రాధా జీవన  మేఘశ్యామ మధుసూదన  రాధే శ్యామ యెదు నందన" అంటూ సాగిన నేపథ్య గీతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ప్రభాకరన్ బీట్ బాగుందని శ్రోతలు అంటున్నారు. 
ప్రేక్షకులకు 'ఆర్ఆర్ఆర్' విడుదల చేసిన కొమురం భీమ్ ఇంట్రో టీజర్ విపరీతంగా నచ్చింది. రాజమౌళి కాపీ చేసాడంటూ కొంతమంది ఆరోపణలు కూడా చేశారు. ప్రతి సినిమాకు సహజంగా ఇటువంటివి వస్తాయి. అయితే... చరిత్రకారులు 'రామరాజు ఫర్ భీమ్' టీచర్ మీద విమర్శలు చేస్తున్నారు. రాజమౌళి పెద్ద తప్పు చేస్తున్నాడని, చరిత్రను వక్రీకరించిన ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. అసలు ఏమైంది? ఏంటి? అనే వివరాల్లోకి వెళితే... భీమ్ ఇంట్లో టీజర్ చివర్లో ముస్లిమ్ యువకుడి ఆహార్యంలో ఎన్టీఆర్ కనిపించారు. దానిపై చరిత్రకారులు మండిపడ్డారు. ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటం చేసిన కొమురం భీమ్ అప్పట్లో నిజాం పాలనకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని‌ గుర్తు చేశారు. అటువంటి ఉద్యమ నాయకుడిని ముస్లిం గా చూపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇది చరిత్రకి విరుద్ధమని, పెద్ద తప్పు చేస్తున్నారని సున్నితంగా రాజమౌళిని హెచ్చరిస్తున్నారు. త్వరలో కొమురం భీమ్ అభిమానులు రాజమౌళి కి వ్యతిరేకంగా విలేకరుల సమావేశం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బహుశా ఇటువంటి విమర్శలు వస్తాయని రాజమౌళి ముందే ఊహించారా ఏమో? అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుండి వచ్చిన కల్పిత గాథ అని ముందునుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంత కల్పితమైనప్పటికీ... ప్రజలు, ముఖ్యంగా భీమ్ వారసులు హర్షిస్తారా అనేది పెద్ద ప్రశ్న? ఓవైపు విమర్శలు వస్తుంటే... మరోవైపు ఎన్టీఆర్ ముస్లిం గెటప్ వెనుక పెద్ద ట్విస్ట్ ఉందనేది వినపడుతోంది. రజాకార్ల అడ్డాలోకి ముస్లిం యువకుడిగా వెళ్లి తాను అనుకున్నది కొమరం భీమ్ సాధించినట్టు రాజమౌళి చూపించాడనే ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజం అనేది సినిమా విడుదలైతే గానీ తెలియదు. ఈ విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ రాజమౌళి ముందుకు వెళుతున్నాడు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై అంధేరి మేజిస్ట్రేట్‌లో క్రిమినల్ కేసు నమోదు అయింది. మతపరమైన అంశాల్లో సమాజంలో అసమ్మతిని సృష్టించినందుకు అక్కాచెల్లెళ్లు ఇద్దరిపై కేసు పెట్టారు. ఇటీవల ముంబైలోని బంద్రా పోలీసులు 'ముంబైను పాక్ అఆక్రమిత కాశ్మీరుతో పోల్చిన' కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కంగనాకి, ఆమె సోదరికి సమన్లు జారీ చేశారు. ఇది మరో కేసు అన్నమాట. దీనిపై కంగనా రనౌత్ స్పందించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు ట్వీట్ చేశారు.  "నేను ఝాన్సీ రాణి, సావర్కర్, నేతా బోస్ వంటి వారిని ఆరాధిస్తాను. ఈ రోజు ప్రభుత్వం నన్ను జైలులో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. నేను ఎంపిక చేసుకున్న మార్గాలపై అది నాకు నమ్మకం కలిగిస్తుంది. జైలులో ఉండటానికి వెయిట్ చేస్తున్నా. త్వరలోనే నా విగ్రహాలు పెడతారేమో. అది నా జీవితానికి అర్ధం ఇస్తుంది. జై హింద్" కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఫాసిస్ట్ ప్రభుత్వంతో కంగనా పోల్చారు. దాంతో పోరాడుతున్నాని ఆమె అన్నారు.
  అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'. ఇది మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతోన్న 6వ చిత్రం. అహిషోర్ సాల్మ‌న్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని మ‌నాలీలో ఉన్న సుంద‌ర ప్ర‌దేశాల్లో ఇటీవ‌లే మొద‌లైంది. నాగార్జున షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. అక్క‌డి ప్ర‌కృతి సౌంద‌ర్యానికి ఆయ‌న ప‌ర‌వ‌శించిపోయారు. ప్రేక్ష‌కుల‌తో ఆ ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. "హాయ్‌.. ఇది రోహ్‌తంగ్ పాస్ (రోహ్‌తంగ్ క‌నుమ‌)లోని అంద‌మైన ఉద‌యం. స‌ముద్ర మ‌ట్టానికి మూడు వేల తొమ్మిది వంద‌ల ఎన‌భై మీట‌ర్ల ఎత్తులో ఉన్న ప్రాంతం. అంటే ప‌ద‌మూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన క‌నుమ‌. న‌వంబ‌ర్ నుంచి మే నెల వ‌ర‌కు దీన్ని మూసేస్తారు. 'వైల్డ్ డాగ్' షూటింగ్ కోసం ఇక్క‌డ‌కు వ‌చ్చాం. ఈ సినిమా షూటింగ్ చాలా బాగా జ‌రుగుతోంది. అంద‌మైన ప‌ర్వ‌తాలు, నీలాకాశం, జ‌ల‌పాతాలు.. ఇక్క‌డ ఉండ‌టం ఎంతో బాగుంది. ఏడు నెలల‌ త‌ర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్త‌యిపోతుంది. ఆ త‌ర్వాత (హైద‌రాబాద్‌) వ‌చ్చేస్తాను. ల‌వ్ యు ఆల్‌. సీ యు." అంటూ ఉత్సాహంగా చెప్పారు నాగార్జున‌. బ్లాక్ డ్ర‌స్‌, బ్లాక్ గాగుల్స్‌, బ్లాక్ గ్లౌజెస్ ధ‌రించిన నాగ్.. మ‌న్మ‌థుడు అని ప్రేక్ష‌కులు ఇచ్చిన బిరుదుకు త‌గ్గ‌ట్లుగా హ్యాండ్స‌మ్‌గా, ఎంతో ఫిట్‌గా, మరెంతో ఎన‌ర్జిటిక్‌గా క‌నిపిస్తున్నారు. సుదీర్ఘంగా కొన‌సాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో స‌హా ప్ర‌ధాన పాత్ర‌ధారుల‌పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని విభిన్న త‌ర‌హా పాత్ర‌ను చేస్తున్నారు. క్రిమిన‌ల్స్‌ను నిర్దాక్షిణంగా డీల్ చేసే విధానం వ‌ల్ల సినిమాలో ఆయ‌న‌ను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిర‌ణ్ కుమార్ సంభాష‌ణ‌లు రాస్తుండ‌గా, షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.
'శ్యామ్ సింగ రాయ్' సినిమా కథపై నాచురల్ స్టార్ నానికి ఎంత బలమైన నమ్మకం లేకపోతే ఓ నిర్మాత చేయలేనని చెప్పినా... మరో నిర్మాతను వెతుకుతారు చెప్పండి? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమాను చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారట. అసలు వివరాల్లోకి వెళితే... నాని హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'జెర్సీ' నిర్మించింది. లాభాలు ఎంతోవచ్చాయనేది పక్కన పెడితే... ఆ సినిమాకు మంచి పేరు వచ్చింది. 'జెర్సీ' విడుదల తర్వాత నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా ప్రకటించింది సితార ఎంటర్టైన్మెంట్స్. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్ పెట్టి ఆ సినిమా చేయలేనని తప్పుకుంది. అయితే... చిత్ర కథపై విపరీతమైన నమ్మకం ఉందని మరో నిర్మాత వెతికారని తెలిసింది. 'టక్ జగదీష్' చిత్రీకరణ పూర్తయిన తర్వాత కలకత్తా నేపథ్యంలో సాగనున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చిత్రీకరణ మొదలు పెట్టాలని నాని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో ఓ కథానాయికగా సాయి పల్లవి, మరో కథానాయికగా నిత్యమీనన్ ఖరారు అయినట్లు సమాచారం.
‘అమరావతి అవమానం’ మోదీదా? బీజేపీదా?   బీజేపీ-టీడీపీ భాగస్వాములే   బాబు జాగే కొంప ముంచింది   కులం కోణంలో జగన్ నిర్ణయాలు   అనాధగా మారిన అమరావతి   కడకు దిక్కయిన కోర్టులు   విభజన నుంచి ఇప్పటివరకూ.. దేశంలో  రాజధాని నగరం లేని, ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో పురోగమిస్తుంటే, ఏపీ మాత్రం అనాధగా దిక్కులు చూస్తున్న విషాదం. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ,  అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి మూడొందల రోజులు దాటిపోయాయి. నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో.. అమరావతిలో భూమి పూజ చేసిన ప్రాంతం ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతిని కులం కోణంలో చూసి, ‘మూడు ముక్కలాట’కు తెరలేపడమే.. ఈ విషాదానికి అసలు కారణమన్నది బహిరంగ రహస్యం. ఒక్క జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. అటు బీజేపీ, ఇటు టీడీపీ.. అంతా కలసి, అమరావతిని అనాధను చేశారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణ.   విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. శివరామకృష్ణన్ కమిటీ, దాని పర్యటనలు, ప్రజాభిప్రాయసేకరణ, దొనకొండలో రాజధానిని పెట్టాలని కొందరు, నూజివీడు అయితే బాగుంటుందని మరికొందరి సూచనల తర్వాత.. నాటి సీఎం చంద్రబాబు నాయుడు ‘నారాయణ కమిటీ’ని తెరపైకి తీసుకువచ్చారు. కసరత్తులన్నీ పూర్తయ్యాక, అమరావతిని రాజధానిగా తేల్చారు. దానికోసం 32 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. వారిచ్చిన భూమునే పెట్టుబడిగా పెట్టి, మరికొంత కేంద్రసాయంతో రాజధాని నగరాన్ని నిర్మిస్తామని బాబు ప్రకటించారు. ఆ మేరకు రైతులకు కౌలుతోపాటు, కమర్షియల్ ప్లాట్లను కూడా ఇచ్చారు. కేంద్రం కూడా 7 వేల కోట్ల నిధులిచ్చిందని, ఆ డబ్బెక్కడికి పోయిందని సోము వీర్రాజు కొంతకాలం నుంచీ ప్రశ్నిస్తున్నారు. కానీ, అప్పటి సర్కారులో బీజేపీ కూడా భాగస్వామి అన్న వాస్తవాన్ని వీర్రాజు విస్మరించడం ఆశ్చర్యం.   జగన్మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత, మూడు రాజధానులకు తెరలేపడంతో,  అమరావతి కథ అర్ధంతరంగా ఆగిపోయింది. అక్కడ కమ్మ వర్గానికి చెందిన వారి భూములే.. ఎక్కువగా ఉన్నాయన్న అనుమానంతోనే, జగన్మోహన్‌రెడ్డి చూపు.. అమరావతి నుంచి విశాఖకు మళ్లింది. నాడు అక్కడ శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ, ఇప్పుడు మౌనమునిగా మారారు. అమరావతిపై మీడియాలో మాట్లాడవద్దని బీజేపీ నాయకత్వం, నేతలకు లక్ష్మణరేఖ గీసింది. అధికారంలో ఉన్నప్పుడు మీనమేషాలు, తాత్కాలిక కట్టడాలతో పేరుతో పబ్లిసీటీ చేసుకున్న చంద్రబాబు..  చేతులుకాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు అమరావతి జపం చేస్తున్నారు. ఆ రకంగా అంతా కలసి, అమరావతిని అనాధను చేశారు. అందుకే ఈ పాపం అందరిన్నది ఆంధ్రుల ఆరోపణ.   పాపం అమరావతి! నిలువెత్తు బుద్దవిగ్రహం సాక్షిగా, ఇప్పుడు అమరావతికి భూములిచ్చిన రైతులు.. మంత్రులతో అమ్మనాబూతులు తిట్టించుకుంటున్నారు. ధర్మాన కృష్ణదాస్‌అనే మంత్రి, రైతులను లం.. కొడుకులంటారు. మరికొందరు మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటారు. ఇంకొందరు మంత్రులు, టీ షర్టులేసుకుని ఉద్యమాలు చేస్తున్నారంటారు.  మరికొందరు అది ‘కమ్మ’రావతి అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తారు. స్పీకర్ లాంటి వ్యక్తి దానిని ఎడారి, శ్మశానంతో పోలుస్తారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు, వాటిని భరిస్తూ, సహిస్తూ, జైళ్లకు వెళ్లినా.. తమ ఉద్యమాన్ని 300 రోజులు దాటించారు. ప్రస్తుతం రాజకీయ పార్టీల పాపం పుణ్యాన, అనాధగా మారిన అమరావతి.. న్యాయం కోసం న్యాయస్థానం వైపు రోడ్డుకు మోకాళ్లు ఆనించి, దీనంగా చూస్తోంది.   మోదీ ప్రధాని హోదాలో వచ్చి శంకుస్థాపన చేశారు. ఢిల్లీని మించిన రాజధానిగా మారాలన్నారు. ఢిల్లీ కూడా చిన్నబోయేలా కొత్త నగరం ఉండాలన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరాలను, సందర్శించమని సలహా కూడా ఇచ్చారు. మేం మీ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు.  కాబట్టి బీజేపీ అమరావతి నగరాన్ని,  వాయువేగంతో నిర్మిస్తుందని భావించారు. ఆ తర్వాత అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కూడా కేటాయించారు. దానితో ఇంకేముంది? అమరావతి నగర నిర్మాణం, పంచకల్యాణి గుర్రంలా పరుగులు పెడుతుందనుకున్నారు.  కానీ చంద్రబాబుతో దొస్తీ చెడటంతో, బీజేపీ తీరు కూడా మారింది. దానికితోడు నిర్మాణాల తాలూకు డీపీఆర్ కూడా కేంద్రానికి ఇవ్వలేదు. అప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ హయాంలో అమరావతికి అనుకూలంగానే తీర్మానించారు. ఆయన కూడా రైతులతో కలసి ధర్నా నిర్వహించారు. మౌనదీక్ష నిర్వహించారు. ఇప్పుడు పరిస్థితి అందుకు రివర్సు. బీజేపీలో అమరావతి గురించి ఎవరు మాట్లాడితే, వారిపై వేటు వేస్తున్నారు.   ఈలోగా.. ఒక జీవీఎల్, ఇంకో సోము, ఇప్పుడు విష్ణువర్దన్‌రెడ్డి రూపంలో వెలువడిన అపశకునాల బట్టి, అమరావతికి కమలం పార్టీ కూడా శల్యసారథ్యం వహిస్తోందని స్పష్టమయింది. పైగా రాజధాని వ్యవహారంలో కేంద్ర ప్రమేయం ఏమీ లేదని, అఫిడవిట్ ఇచ్చింది. దీన్నిబట్టి.. మెడ మీద తల ఉన్న ఎవరైనా, అమరావతి అంశంలో జగన్ దారిలోనే.. బీజేపీ వెళుతోందన్న విషయం అర్ధమయి తీరాలి. అందుకే అమరావతి రైతులు ఢిల్లీలో కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా, అక్కడే ఉన్న మోదీ నుంచి ఒక్కమాట కూడా రాలేదంటే.. ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది సుస్పష్టం.   ఇక అమరావతి పాపంలో, చంద్రబాబుదే సింహభాగమన్నది.. ఈ పరిస్థితి-దుస్థితి అనుభవిస్తున్న వారి మాట. అధికారంలో ఉన్నప్పుడు గెజిట్‌లో అమరావతిని చేర్చకుండా.. డిజైన్లు, అత్యుత్తమ రాజధానుల సందర్శనల పేరిట చేసిన,  ప్రచారంతో కూడిన కాలయాపనే ఈ పరిస్థితికి మూలం అన్నది,  మెజారిటీ వర్గాల అభిప్రాయం. తాత్కాలిక నిర్మాణాలతో కాంట్రాక్టర్లకు దోచిపెట్టే యోచన, పూర్తి స్థాయి నిర్మాణాలకు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు జగన్ దానిపై దృష్టి సారించే అవకాశం కూడా ఉండేది కాదన్నది వారి వాదన. నిజమే కదా మరి? తాత్కాలిక సచివాలయం పేరుతో బాబు, బడా కాంట్రాక్టరుకు సర్కారు భూమి ఇచ్చి మరీ, వందల కోట్లు సమర్పించుకున్నారు. సదరు కంపెనీ నిర్మించిన సచివాలయం ఖరీదు, హైదరాబాద్‌లో నిర్మించే భవనాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ ఖర్చు.   నెల్లూరు నారాయణ సారథ్యంలో జరిగిన ఈ వ్యవహారంలో.. కాంట్రాక్టర్లు, వారిచ్చే కమిషన్లతో  టీడీపీ లాభపడితే, పూర్తిగా నష్టపోయింది మాత్రం రైతులేనంటున్నారు. విభజన జరిగిన వెంటనే చంద్రబాబు మేల్కొని, బెజవాడకు వచ్చి పూర్తి స్థాయి నిర్మాణాలు చేయని పాపమే.. ఇప్పుడు రైతులకు శాపమైంది. అదే  జగన్ మూడురాజధానుల ఆలోచనకు, ఊపిరిపోసిందనేది మెజారిటీ వర్గాల నిశ్చితాభిప్రాయం. అటు.. అమరావతిని ‘కమ్మ’రావతిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు, ఇప్పటివరకూ దానిని నిరూపించలేకపోయారు. అటు టీడీపీ కూడా, దానిని అబద్ధమని నిరూపించే ప్రయత్నం చేయకుండా.. నారాయణ, పుల్లారావు వంటి భూములు కొన్న  నేతలను కాపాడేందుకే ప్రాధాన్యమిచ్చింది. అమరావతి నిర్మాణ సమయంలో, నానా హడావిడి చేసిన ‘నారాయణ మాస్టారు’ ఇప్పుడు,  ఏ కలుగులో దాగున్నారో ఎవరికీ తెలియదు.   నగర నిర్మాణం అవుతుందో లేదో తెలియని అయోమయం.. మూడు పంటలు పండే భూములిచ్చి.. ఇప్పుడు నెత్తిన చేయి పట్టుకున్న రైతులే, అమరావతిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సర్కారుకు.. ఎదురొడ్డి పోరాడుతున్న వేలాది మంది రైతులు, వారి పక్షాన పోరాడుతున్న ఒక సుంకర పద్మశ్రీ, మరో వెగలపూడి గోపాలకృష్ణ ప్రసాద్, పువ్వాడ సుధాకర్, ఇంకో మార్టిన్, కంభంపాటి శిరీష, దుర్గాభవానీ, అక్కినేని వనజ వంటి జేఏసీ నేతలే, ఇప్పుడు అమరావతి కథలో హీరోలు. మరి వారంతా హీరోలయితే.. మోదీ-చంద్రబాబు-జగన్‌తోపాటు, అమరావతి గ్రామాలలో వీరవిహారం చేసి.. ఆడబిడ్డ తెచ్చుకున్న టిఫిన్ బాక్సులో ఉప్మా తిని, చివరాఖరకు కమలంతో చేతులు కలిపి.. ఇప్పుడు ఉద్యమాన్ని కాడికిందపడేసిన,  జనసేన వీరుడు పవన్ సంగతేమిటన్న సందేహం రావచ్చు.  ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కు! అది మీ ఇష్టం!! -మార్తి సుబ్రహ్మణ్యం
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం.. సాంకేతిక టెక్నాలజీ వినియోగిస్తూ కేసులు చేధించడంలో తెలంగాణ పోలీసులే టాప్.. రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా గుర్తించే పరిజ్ఞానం మన పోలీసుల సొంతం.. ఇవి గత ఐదేండ్లుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు.  గొప్పగా చేసుకుంటున్న ప్రచారాలు. గత ఆరేండ్లలో పోలీస్ శాఖకు భారీగా నిధులిచ్చామని, హైటెక్ సౌకర్యాలు కల్పించామని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన చెబుతుంటారు. కాని ఒక్క ఘటన తెలంగాణ పోలీసుల సత్తాకు సవాల్ గా నిలిచింది. మహబూబా బాద్ కిడ్నాప్ కేసు తెలంగాణ పోలీసుల పనితీరును ప్రశ్నించేలా మారింది. తెలంగాణ కాప్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిహసించేలా చేస్తోంది.    మహబూబా బాద్ లో జరిగిన బాలుడి కిడ్నాప్ కేసులో పోలీసుల తీరుపై చాలా ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. హైటెక్ టెక్నాలజీ ఉన్న రోజుల్లోనూ కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం ఏంటనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా కిడ్నాపర్లు డబ్బుల కోసం బాలుడి పేరెంట్స్ తో మాట్లాడుతూనే ఉన్నారు. బాలుడి పేరెంట్స్ చుట్టే  పోలీసులు తిరిగారు. కిడ్నాపర్ల ఫోన్లను పోలీసులు కూడా విన్నారు. అయినా వారెవరో, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో , కిడ్నాపర్లు ఫోన్ మాట్లాడుతున్న లొకేషన్ ఏంటో వెంటనే కనిపెట్టలేకపోయారు. ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి లొకేషన్ ను మినిట్ టు మినిట్ ట్రేస్ చేసే టెక్నాలజీ ఉన్న ప్రస్తుత సమయంలో ... మహబూబా బాద్  పోలీసులకు కిడ్నాపర్లను గుర్తించడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రజల్లో కూడా ఇవే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం చెబుతున్న గొప్ప టెక్నాలజీ ఎక్కడ పోయిందని వారు ప్రశ్నిస్తున్నారు.    ఆదివారం సాయంత్రం దీక్షిత్ రెడ్డి కనిపించకుండా పోయారు. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. డబ్బుల కోసం కిడ్నాపర్ సోమవారం బాలుడి పేరెంట్స్ కు 11 సార్లు ఫోన్ చేశారని చెబుతున్నారు. మంగళవారం సైలెంట్ గా ఉన్న అగంతకులు బుధవారం మళ్లీ బాలుడి పేరెంట్స్ తో టచ్ లోకి వచ్చారు. డబ్బులు ఇవ్వాలని, ఇక్కడికి రావాలని, డబ్బును అక్కడ పెట్టి వెళ్లండని ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అయినా ఐదు రోజులుగా బాలుడి కోసం వెతుకుతున్న పోలీసులు మాత్రం కిడ్నాపర్ల జాడ కనిపెట్టలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా కిడ్నాపర్లు ఫోన్ లో మాట్లాడుతున్నా గుర్తించకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీక్షిత్ రెడ్డి కేసులో మహబూబా బాద్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి.   అయితే మహబూబా బాద్ ఎస్పీ కోటిరెడ్డి మాత్రం కేసులో తామెక్కడ నిర్లక్ష్యం వహించలేదని చెప్పారు. కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరించాడని, తనను ట్రేస్ చేయకుండా ఉండటానికి ఫోన్ వాడలేదని తెలిపారు. బాలుడి పేరెంట్స్ కు ఇంటర్ నెట్ కాల్స్ చేశారని ఎస్పీ వెల్లడించారు. యాప్ ద్వారా ఇంటర్ నెట్ కాల్స్ చేయడం వల్లే కిడ్నాపర్ ను గుర్తించడం వెంటనే సాధ్యం కాలేదన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ సాయంతో కిడ్నాపర్ వాడిన యాప్ ను గుర్తించి.. అతని మార్గంలోనే యాప్ సాయంతోనే గుర్తించామని చెప్పుకొచ్చారు. కిడ్నాపర్ యాప్ వాడటం వల్లే గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టిందని ఎస్పీ తెలిపారు. అయితే ఎస్పీ ప్రకటనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం సాధారణ జనాలే హైటెక్ టెక్నాలజీని  ఉపయోగిస్తూ డిజిటల్ వండర్స్ చేస్తున్నారు. పోలీసుల దగ్గర మరింత అత్యాధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది. అయినా యాప్ ద్వారా మాట్లాడుతున్న కిడ్నాపర్ ను వెంటనే గుర్తించే టెక్నాలజీ లేకపోవడం ఏంటనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయి. టెక్నాలజీ వినియోగంలో  పూర్ గా ఉన్న ఈ పోలీసులనే .. దేశానికే ఆదర్శమని సీఎం కేసీఆర్ చెబుతున్నారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    మహబూబా బాద్ జిల్లా కేంద్రంలోనే దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ జరిగింది. బాలుడిని బైక్ పై తీసుకుని దర్జాగా వెళ్లాడు కిడ్నాపర్. కాని ఎక్కడా సీసీ టీవీలో అవి రికార్డు కాలేదు. అంటే మహబూబా బాద్ జిల్లా కేంద్రంలో సీసీ కెెమెరాలు కొన్ని ప్రాంతాల్లోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్ధమవుతోంది. అందుకే కిడ్నాపర్ విజువల్స్ ఎక్కడా చిక్కలేదని, పట్టణ శివారులోని ఒక ప్రాంతంలోనే అతడి విజువల్ రికార్డైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయం చెప్పాడు. అయితే జిల్లా కేంద్రంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు సరిగ్గా లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కెమెరాలు ఎక్కడ అమర్చారనే ప్రశ్నలు వస్తున్నాయి. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రాామాలు, పల్లెల్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.    ఐదేండ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో మిస్సైన బాలుడిని ఇటీవలే అసోంలోని గోలపారాలో గుర్తించి త‌ల్లిదండ్రుల చెంత‌కు చేర్చారు. తెలంగాణ స్టేట్ పోలీసులు అభివృద్ధి చేసిన ఫేస్ రికగ్నిషన్ యాప్ ద‌ర్ప‌న్ ద్వారా ఇది సాకార‌మైందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. ద‌ర్ప‌న్ ద్వారా తెలంగాణ పోలీసులు బాలుడిని గుర్తించి ఆచూకీని క‌నుగొన్నారని ఆయన తెలిపారు. ఇంతటి టెక్నాలజీ ఉన్న తెలంగాణ పోలీసులు.. ఫోన్ లో మాట్లాడుతున్న కిడ్నాపర్లను గుర్తించడానికి ఐదు రోజులు తీసుకోవడం చర్చనీయాశంగా మారింది. మొత్తంగా మహబూబా బాద్ ఘటన తెలంగాణ పోలీసుల ప్రతిష్టకు మచ్చగా, సీఎం కేసీఆర్ గొప్పగా చేసుకుంటున్న ప్రచారానికి గండి కొట్టేదిగా మారిందనే చర్చే జనాల్లో ఎక్కువగా జరుగుతోంది.
అచ్చెన్నాయుడికే దక్కిన అధ్యక్ష పదవి   నారా-నందమూరి ఫ్యామిలీకి చెరో రెండు   బాబాయ్-అబ్బాయ్, తల్లీ కొడుకులకు చోటు   కళాకు ఒక న్యాయం, రమణకు మరో న్యాయం   కొత్త వారికి పదవులతో పార్టీ పరుగులు   టీడీపీ జాతీయ-రాష్ట్ర కమిటీల తీరిది   ఎట్టకేలకు చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ జాతీయ-రాష్ట్ర కమిటీలు ప్రకటించారు. ఇందులో నారా-నందమూరి కుటుంబాలకు చెరో రెండు పదవులు దక్కగా, బాబాయ్-అబ్ణాయ్, తల్లీ-కొడుకులకు రెండేసి పదవులు లభించాయి. అయితే ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును తొలగించిన నాయకత్వం, తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా మాత్రం ఎల్.రమణను కొనసాగించటం ఆశ్చర్యం. పైగా ఇతర కమిటీల్లో ఉన్న వారికి మరో కమిటీలో కూడా స్థానం కల్పించటం పార్టీ శ్రేణులకు విస్మయం కలిగించింది.   చంద్రబాబు ప్రకటించిన పార్టీ జాతీయ-రాష్ట్రాల కమిటీలలో కొత్త వారికి స్థానం కల్పించడం, ముఖ్యంగా యువతకు, బడుగు వర్గాలకు చోటివ్వడం ద్వారా, పార్టీని పరుగులు పెట్టించే వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కమిటీలో అగ్ర కులానికి సంబంధించి వైశ్య కులానికి ఒకరికి చోటివ్వగా, బ్రాహ్మణ వర్గానికి ప్రాతినిధ్యం కనిపించలేదు. తెలంగాణ నుంచి ఒక మహిళా నేతకు బ్రాహ్మణ కోటా నుంచి ఇచ్చారని చెబుతున్నప్పటికీ, ఆమె ఆ సామాజికవర్గానికి చెందిన వారు కాదని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. గతంలో శిద్దా రాఘవరావుకు కోశాధికారి ఇవ్వగా, ఇప్పుడు అదే వైశ్య వర్గానికి చెందిన శ్రీరాం తాతయ్యకు ఆ పదవి ఇచ్చారు. రాష్ట్రంలో వైశ్య జనాభా ఎక్కువగానే ఉన్నా, ఒక్కటే ఇచ్చారు. నిజానికి అధ్యక్ష పదవి దక్కించుకున్న అచ్చెన్నాయుడు పోలినాటి వెలమ కంటే, వైశ్య వర్గం నాలుగింతల సంఖ్య ఎక్కువగా ఉండటం ప్రస్తావనార్హం. అయితే, రాష్ట్రంలో ప్రాబల్యం ఉన్న రెడ్డి వర్గానికి కేవలం మూడు పదవులే దక్కడం ప్రస్తావనార్హం. సోమిరెడ్డి, కోట్ల, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి మాత్రమే స్థానం లభించింది. కడప-కర్నూలు-నెల్లూరు-అనంతపురం-చిత్తూరులో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గం నుంచి ఈసారి పెద్దగా చోటు లభించలేదు. బహుశా రెడ్లు వైసీపీ వైపు ఉంటారన్న భావనతో, సంఖ్య తగ్గించి ఉండవచ్చంటున్నారు. జెసి కుటుంబానికి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ, దివాకర్‌రెడ్డి వద్దని తిరస్కరించినట్లు చెబుతున్నారు. మొత్తంగా కమిటీలో, కమ్మ వర్గానికి 9 పదవులు లభించాయి. కేంద్ర కమిటీలోని 27 మందిలో ఓసీలకు 51, మిగిలిన వర్గాలకు 49 శాతం పదవులు దక్కాయి.   ఇక అంతా అనుకున్నట్లే, అచ్చెన్నాయుడుకు ఏపీ అధ్యక్ష పదవి దక్కింది. ఈఎస్‌ఐ అక్రమాల కేసులో ఆయన ఇటీవలే జైలుకు వెళ్లి వచ్చారు. బహుశా ఆ అర్హతతోనే ఆయనకు ఆ పదవి లభించి ఉండవచ్చు. అంటే పార్టీ కోసం జైలుకెళ్లిన వారికి, పార్టీ అండగా ఉంటుందన్న సంకేతాలిచ్చేందుకే, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉండవచ్చు. జైలుకు వెళ్లి వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకూ పొలిట్‌బ్యూరో దక్కినందున, ఆవిధంగానే భావించాల్సి ఉంది. ఇక చంద్రబాబు ఎలాగూ జాతీయ అధ్యక్షుడు. లోకేష్‌కు మళ్లీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించింది. అయితే, బాబు వియ్యంకుడయిన నందమూరి బాలకృష్ణకు పొలిట్‌బ్యూరో, నందమూరి హరికృష్ణ కమార్తె సుహాసినీకి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు దక్కడం ద్వారా, నారా-నందమూరి కోటాలు భర్తీ చేసినట్టయింది.   అయితే, జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో నరా లోకేష్, వర్ల రామయ్య, రామ్మోహన్‌నాయుడు, నిమ్మల రామానాయుడు, బీద రవిచంద్ర, కొత్తకోట దయాకర్‌రెడ్డిలలో.. ఒక్క నారా లోకేష్‌కు మాత్రమే, సెంట్రల్ కమిటీ నుంచి పొలిట్‌బ్యూరో ఎక్స్‌అఫిషియో సభ్యుడి అయ్యే అవకాశం లభించింది. జాతీయ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన రామయ్యకు పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించి, మళ్లీ అదే పోలిట్‌బ్యూరోలో లోకేష్‌కు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. గల్లా అరుణకు జాతీయ ఉపాధ్యక్ష పదవి, ఆమె కుమారుడు గల్లా జయదేవ్‌కు పొలిట్‌బ్యూరో పదవి లభించింది.   ఇక ఈసారి కొత్తగా రాజకీయ కార్యదర్శి పదవి సృష్టించి, దానిని టిడి జనార్దన్‌కు ఇవ్వగా, కార్యాలయ కార్యదర్శి పదవి అశోక్‌బాబుకు లభించింది. దానిని గతంలో ఏవి రమణ నిర్వహించేవారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి జాతీయ ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత బుచ్చయ్యచౌదరికి పొలిట్‌బ్యూరో, ఇటీవలి కాలంలో దూకుడుగా వెళతూ సర్కారుకు చెమటలు పట్టిస్తున్న పట్టాభికి జాతీయ అధికార ప్రతినిధి పదవులు దక్కడం విశేషం. కొత్త కమిటీలో ప్రధానంగా పట్టాభికి కీలక స్థానం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న జోత్స్నకు మళ్లీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనితకు పొలిట్‌బ్యూరోలో, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వర్ల రామయ్యకు మళ్లీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా అవకాశం లభించడం ప్రస్తావనార్హం. ఇది జాబితా కూర్పులో పొరపాటు జరిగిందా లేక, జాబితానే ఆవిధంగా రూపొందించారో తెలియదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.     ఇక తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఎల్.రమణను మళ్లీ  కొనసాగించడం చర్చనీయాంశమయింది. విఫల నాయకుడిగా పార్టీలో ఇబ్బంది పడుతున్న ఆయనను కొనసాగించడంపై పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రమణ స్థాయిలో చెప్పింది వినే నాయకుడు లేకపోవడమే బహుశా ఆయన కొనసాగింపునకు కారణం కావచ్చంటున్నారు. మరి ఏపీలో కళా వెంకట్రావును ఏ ప్రాతిపదిక తొలగించి, తెలంగాణలో ఏ ప్రాతిపదికన రమణను కొనసాగించారో అర్ధం కావడం లేదంటున్నారు. ఇంకా కనీసం వెంకట్రావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. టీడీపీకి 23 స్థానాలయినా వచ్చాయని, కానీ రమణ సారథ్యంలో పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని గుర్తు చేస్తున్నారు. పైగా రమణపై తెలంగాణ పార్టీ  నేతలంతా తిరుగుబాటు చేసినా, బాబు ఆయననే కొనసాగించడంపై విస్మయం వ్యక్తమవుతోంది.   అయితే, తెలంగాణ నుంచి సీనియర్ నేత అరవిందకుమార్ గౌడ్‌కు పొలిట్‌బ్యూరో, జాతీయ అధికార ప్రతినిధిగా నర్శిరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి- బక్కని నర్శింహులుకు జాతీయ ప్రధాన కార్యదర్శి, మెచ్చా నాగేశ్వరరావుకు జాతీయ ఉపాధ్యక్ష పదవులివ్వడం ద్వారా, తెలంగాణకు పెద్దపీట వేసినట్టయింది. ఎలాగూ రావుల పోలిట్‌బ్యూరోలోనే కొనసాగుతున్నారు. కానీ, రమణను అధ్యక్ష పదవి తొలగించకుండా, కొసాగించడం ద్వారా.. తెలంగాణలో పార్టీకి ఆయన తప్ప మరో దిక్కు, సమర్ధులు లేరన్న సంకేతం పంపినట్టయింది.   అయితే ఏపీలో అచ్చెన్నాయుడు, తెలంగాణలో రమణ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ.. వారికెవరికీ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యమే. కాబట్టి అధ్యక్షులుగా ఎవరున్నా పెద్దగా ఒరిగేదేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు-లోకేష్ దిశానిర్దేశంలోనే పనిచేయాలి కాబట్టి.. ఎవరికి ఏ పదవి ఇచ్చినా ఒకటేనని స్పష్టం చేస్తున్నారు. ఈసారి పితాని, కొల్లు రవీంద్ర, బీద రవిచంద్ర, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, నక్కా ఆనందబాబు వంటి వారికి స్ధానం కల్పించడం అభినందనీయమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, దూకుడుగా వెళ్లే ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్‌కు ఎక్కడా చోటు లభించకపోవడం చర్చనీయాంశమయింది. ఒకవేళ పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్ ఇచ్చినందున ఆయనకు పదవి ఇవ్వలేదనుకున్నా.. మరి టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న అచ్చెన్నాయుడికి, అధ్యక్ష పదవి ఎలా ఇచ్చారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.  -మార్తి సుబ్రహ్మణ్యం
హైద‌రాబాద్ వరద ముంపు బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం ప్రకటించారు. నగరంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. పేద‌ల‌కు సాయం అందించ‌డం కోసం మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు.    భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల హైద‌రాబాద్ న‌గ‌రంలోని లోత‌ట్టు ప్రాంతాల్లోని ప్ర‌జలు ఎన్నో క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌య్యార‌ని, వారిని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. వ‌ర‌ద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్ల‌ల్లో నివ‌సిస్తున్న వారు ఎంతో న‌ష్ట‌పోయార‌ని, ఇళ్ల‌లోకి నీళ్లు రావ‌డం వ‌ల్ల బియ్యం స‌హా ఇత‌ర ఆహార ప‌దార్థాలు త‌డిసిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దెబ్బ‌తిన్న ర‌హ‌దారులు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి, మ‌ళ్లీ మ‌మూలు జీవ‌న ప‌రిస్థితులు నెల‌కొనేలా చూడాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.    గ‌డిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు కేసీఆర్. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు.. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు.వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని చెప్పారు. కష్టాల్లో ఉన్న పేదలకు సాయం అందించడం కన్నా ముఖ్యమైన భాద్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. అందుకే ప్రభావిత ప్రాంతాల్లోని పేదలకు ఇంటికి 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.    నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం అతి ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ అంతా భాగస్వాములు కావాలని సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంతమంది ఉన్నా సరే, లక్షల మందికైనా సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.    హైదరాబాద్ లో మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
అంతన్నారు.. ఇంతన్నారు.. రాష్ట్ర సర్కార్ అంతు తేలుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యమన్నారు. కాని ఇప్పుడు మాత్రం తుస్సుమంటున్నారు. 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ ఉనికే..  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. పార్టీ కొత్త బాస్ సోము వీర్రాజు పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ఆయన ఎక్కడున్నారో పార్టీ నేతలకే తెలియడం లేదట. సోము తీరుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ కేడర్ లో ఆందోళన నెలకొంది. పార్టీ భవిష్యత్ పై కమలం నేతల్లో కలకరం కనిపిస్తోంది.     ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం చాలా సమస్యలున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనాలు అల్లాడిపోతున్నారు. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునగడంతో అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తడంతో వేలాది మంది రోడ్డున పడ్డారు. జగన్ సర్కార్ తమను పట్టించుకోవడం లేదని, కనీసా సాయం కూడా చేయడం లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే  ప్రతిపక్ష పార్టీగా ప్రజలు సమస్యలపై పోరాడాల్సిన బీజేపీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. బీజేపీ ముఖ్య నేతలెవరు మాట్లాడటం లేదు. వరద బాధితులకు బాసటగా సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడం లేదు. కొన్ని రోజులుగా సోము వీర్రాజు ముఖమే కనిపించడం లేదు. బీజేపీ ముఖ్య నేతల తీరుపై జనాలు ఫైరవుతున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా పోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.    సోము వీర్రాజు మొదటి నుంచి వైసీపీకి ఫేవర్ గానే ఉన్నారు. వరదల విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో వరదలపై మాట్లాడితే జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుందనే ఆయన సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వీర్రాజుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. రాష్ట్రమంతా సమస్యల్లో ఉంటే మాట్లాడకపోవడం ఏంటనీ కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారట. కన్నా లక్ష్మినారాయణ పార్టీ చీఫ్ గా ఉండగా... ఆయన అన్ని అంశాలపై వెంటనే స్పందించేవారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేవారు. ప్రజలకు అండగా ప్రభుత్వంపై ఘాటు ప్రకటనలు చేసేవారు. కాని కొన్ని రోజులుగా బీజేపీలో అలాంటి సీన్ కనిపించడం లేదు. దీనిపైనే ఏపీ బీజేపీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కన్నాతో పోలుస్తూ వీర్రాజు తీరుపై చాలా మంది నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు.    తిరుమల విషయంలోనూ జగన్ సర్కార్ వరుసగా వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోంది. టీటీడీ నిర్ణయాలపై భక్తులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాని హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ మాత్రం టీటీడీ నిర్ణయాలపై మాట్లాడటం లేదు. టీటీడీ డిక్లరేషన్ విషయంలోనూ సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రమంతా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేసిన పార్టీ చీఫ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. టీటీడీ వివాదాస్పద నిర్ణయాలపై బీజేపీ అధ్యక్షుడు మాట్లాడకపోవడంపై  హిందూ సంఘాలు విస్మయ వ్యక్తం చేస్తున్నాయి. సోము వీర్రాజు సహా కొత్త కార్యవర్గం తీరు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది.   ఇక బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్దన్ రెడ్డి బహిరంగంగానే వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా విష్ణువర్దన్ రెడ్డి చేస్తున్న ప్రసంగాలతో ఆయన బీజేపీ లీడరా.. వైసీపీ నాయకుడో అర్ధం కావడం లేదని కొందరు కమలం నేతలు అసహనం చేస్తున్నారు. అయినా తీరు మార్చుకోని విష్ణువర్దన్ రెడ్డి.. ప్రధాని మోడీని తీవ్రంగా వ్యతిరేకించే సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ ను సమర్ధించడం కమలనాధుల్లోనే కలకలం రేపుతోంది. అది కూడా దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్ రాసిన లేఖకు మద్దతుగా ఆయన మాట్లాడటం బీజేపీకి ఇబ్బందిగా మారుతోంది. ప్రధాని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా నిత్యం వాదించే, కోర్టుల్లో పిటిషన్లు వేసే న్యాయవాదిని.. వైసీపీ కోసం సమర్ధించడంపై కొందరు బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.      సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల వైఖరితో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఉందా లేక అధికార పార్టీలో కలిసిపోయిందా అన్న అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ విపక్ష పార్టీగా పని చేస్తోందో లేక వైసీపీకి బీ టీమ్ గా మారిందో తెలియడం లేదని కొందరు కమలం నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి నేతలతో పార్టీ బలోపేతం కావడం కలేనని.. రోజు రోజుకు బలహీన పడి ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుందని మరికొందరు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలో అధికారం ఉండటంతో.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం ఈజీ. కాని ఏపీ బీజేపీ ముఖ్యనేతలు మాత్రం అధికార పార్టీ మోజుతో పార్టీని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు కార్యకర్తల నుంచి వస్తున్నాయి. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిల తీరుతో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ హోం క్వారంటైన్ లో ఉందనే చర్చ ఏపీ జనాల్లోనూ జోరుగా సాగుతోంది. మరీ హోం క్వారంటైన్ నుంచి త్వరగా బయటికి వస్తారో లేక వైసీపీ సేవలో తరిస్తూ బీజేపీని బొంద పెడతారో చూడాలని కొందకు బీజేపీ నేతలు కామంట్ చేస్తున్నారు.
స్కూలు పిల్లలకు మతం-కులం లేదు   పాఠశాలలో కుల-మత నమోదుకు పాతర   139 కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటు   వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మొండితనానికి, గుండెధైర్యానికి నిలువెత్తు చిరునామా. ఆయనొక సంచలనం. విజయమయినా, వివాదమయినా ఆయన దారే వేరు. ఏదయినా అనుకున్నారంటే చేసేయడమే. జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు.. జనరంజకమన్న ప్రశంసలు, మెజారిటీ వర్గాల నుంచి వినిపిస్తుంటే.. ప్రజావ్యతిరేకమని ఇంకొన్ని వర్గాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటాయి. న్యాయవ్యవస్థతో పోరాటానికి తెరలేపిన జగన్.. ఆయనను అభిమానించే వారి దృష్టిలో మాత్రమే కాకుండా, న్యాయవ్యవస్థ లోపాలపై అసంతృప్తితో ఉన్న అనేకమంది దృష్టిలో.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకుంటున్నారు. మరికొన్ని వర్గాలు మాత్రం సహజంగానే జగన్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. ఇన్ని వైరుధ్యాలు ఉన్నందుకే, దేశం ఇప్పుడు  జగన్మోహన్‌రెడ్డిని ఆసక్తిగా చూస్తోంది. అది సానుకూల కోణమా? వ్యతిరేక కోణమా అన్నది వేరే విషయం!   ఇన్ని సంచలనాలకు కేంద్ర బిందువయిన జగన్మోహన్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న రెండు విప్లవాత్మక నిర్ణయాలు, జనం దృష్టిలో ఆయనను హీరోను చేశాయి. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు, రిజిస్టర్‌లో కులం-మతం ప్రస్తావన ఉండకూడదన్న నిర్ణయం... మెజారిటీ ప్రజలనే కాదు, విద్యావంతులు, సమాజహితం కోరుకునే వారిని సైతం మెప్పిస్తోంది. ఇప్పటివరకూ స్కూలు దశ నుంచే కుల-మత భావనలు మొదలయ్యేవి. విద్యార్ధి కులం-మతాన్ని విధిగా ప్రస్తావించాల్సి వచ్చేది. జగన్ సర్కారు తాజాగా ఈ నిబంధనకు పాతరేసింది. రిజిస్టరులో విద్యార్ధి కులం-మతాన్ని పేర్కొనకూడదని ఆదేశించింది.     ఈ నిర్ణయం వల్ల.. పాఠశాల స్థాయి నుంచే మొదలవుతున్న, కుల-మత భావనకు పాతర వేయవచ్చన్న అభిప్రాయం మేధావి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆంధ్రాలో ఇప్పటికే కులభావన తీవ్రస్థాయి నుంచి, ఉన్మాద దశకు చేరుకుంది. విజయవాడ న గరం పరిసర ప్రాంతాల్లో, ఏడాది పాటు ఉండి వచ్చిన ఎవరికయినా.. కుల వ్యవస్థపైనే అసహ్యం పుట్టడం ఖాయం. ఇప్పటికీ అక్కడ కులాల వారీగా ఫంక్షన్లు, స్నేహాలతోపాటు.. కుల ఘర్షణలూ జరుగుతున్న అరాచక సంప్రదాయం కనిపిస్తోంది. వాహనాలపై తమ కులాలను సగర్వంగా ప్రకటించుకునే సంస్కృతి దేశంలో ఒక్క బెజవాడలోనే కనిపిస్తుంటుంది. ఫలానా కులం వారికే ఇల్లు అద్దెకు ఇస్తామన్న దిక్కుమాలిన కులతత్వం దర్శనమిస్తుంటుంది.   నిజానికి ఇలాంటి కుల భావన ప్రారంభం కావడానికి.. పాఠ శాల స్థాయి నుంచి ప్రభుత్వమే, కుల ప్రస్తావన తీసురావడమే కారణం. అందుకే ఆ విధానాన్ని తొలగించాలని గతంలో వామపక్ష ప్రముఖులు, సంఘాలు డిమాండ్ చేసేవి. అయినా ఏ ప్రభుత్వమూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు జగన్ ఆ మార్పు తీసుకురావడాన్ని సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు.   ఇక 139 కులాలకు 56 కార్పొరేషన్లు  ఏర్పాటు చేయడం కూడా, సాహసోపేత నిర్ణయంగానే భావిస్తున్నారు. గత ఎన్నికల ముందు అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా, 28 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని ఎన్నికల నోటిఫికేషన్ నెల-రెండు నెలల ముందు ఏర్పాటు చేయడంతో, అవి కార్యాచరణకు నోచుకోలేకపోయాయి. ఎన్నికల కోడ్ కారణంగా,  చివరకు చాలామంది పదవీ బాధ్యతలు కూడా తీసుకోలేకపోయారు. మరికొందరు మాకొద్దని రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్ ఏకంగా... 139 కులాలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేసి, బడుగుల పెదవులపై చిరునవ్వులు పూయించారు. చంద్రబాబులా ఎన్నికల ముందు కాకుండా.. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు ఏర్పాటుచేయడంతో, అది జగన్ చిత్తశుద్ధిని చాటినట్టయింది.   సహజంగా అరడజను కార్పోరేషన్లు.. అవి కూడా విడతల వారీగా ఏర్పాటుచేసే సంప్రదాయం ఉంది. ఆ సందర్భంగా ఆయా కులాల వారీతో సన్మానాలు చేయించుకోవడం, మళ్లీ కొంత గడువు తర్వాత మరికొన్ని కార్పొరేషన్లు ఏర్పాటుచేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా.. 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేయడమంటే, అది అసాధారణ అంశమే కాదు. సాహసోపేతం కూడా! ఎందుకంటే వీటి పాలకవర్గాల్లో సగం మంది మహిళలకు కేటాయించడం అభినందనీయమే. ఇందులో ఉప కులాలకూ స్థానం కల్పిస్తామని జగన్ సర్కారు ప్రకటించింది. ఇప్పటివరకూ దాదాపు అన్ని ప్రభుత్వాలూ యాదవ, శెట్టిబలిజ, తూర్పు కాపు వంటి ప్రధాన బీసీ కులాలకే అన్నింటా ప్రాధాన్యం ఇచ్చేవి. అసలు ఉప కులాల గురించి పట్టించుకున్న పాలకులెవరూ ఇప్పటిదాకా కనిపించలేదు. ఇప్పుడు ఆ లోటును కూడా జగన్మోహన్‌రెడ్డి సర్కారు భర్తీ చేసినట్టయింది. గత 16 నెలల కాలంలో.. 2,71,37,253 మంది బీసీలకు, 33,500 కోట్ల లబ్థి చేకూర్చినట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.   కాగా జగన్మోహన్‌రెడ్డి...  బడుగులకు సంబంధించి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకుపై ‘పిడుగుపాటు’గానే కనిపిస్తోంది. బీసీల పార్టీగా పేరున్న టీడీపీ.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న కాలంలో,  తన బీసీ మూల సిద్ధాంతాన్ని విస్మరించింది. కాపుల ఓట్ల కోసం, పార్టీకి సంప్రదాయ మద్దతుదారైన బడుగులను పక్కకుపెట్టింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు-బీసీలకు శత్రుత్వం ఉందని తెలిసినా.. కాపులు ముద్రగడ వైపే ఉన్నారని తెలిసినా, పార్టీలోని కొందరు కాపు నేతల ఒత్తిళ్లకు లొంగి, కాపులను బీసీ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానితో ఆగ్రహించిన బీసీలు టీడీపీకి వ్యతిరేకంగా మారారు. పోనీ అలాగని రిజర్వేషన్ ప్రకటన సాధించిన కాపులేమైనా, టీడీపీకి ఓటు వేశారా అంటే అదీలేదు. కాపులు కూడా వైసీపీకే జైకొట్టడంతో టీడీపీ పరాజయం పాలవ్వాల్సి వచ్చింది.   దీనితో దిద్దుబాటుకు దిగిన బాబు.. ఈసారి బలమైన బీసీ వర్గానికి పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేపనిలో ఉన్నారు. పోయిన బీసీ ఓటు బ్యాంకును, తిరిగి సాధించే ప్రణాళిక రూపొందిస్తున్న దశలో... జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం, టీడీపీ బీసీ ఓటు బ్యాంకును, వైసీపీ కొల్లగొట్టేదిగానే కనిపిస్తోంది. ఎందుకంటే, 10 లక్షల జనాభా ఉన్న కులాలకు ఏ కేటగిరి, లక్ష నుంచి పది లక్షల వరకూ బి, లక్షలోపు జనాభా ఉన్న కులాలను సి కేటగిరిలో చేర్చారు. అంటే ప్రస్తుతం ప్రతీ బీసీకి ఒక కార్పోరేషన్ ఏర్పాటుచేసినట్టయింది.   ఇప్పటివరకూ ఇవన్నీ బీసీ కార్పొరేషన్ కిందనే ఉండేవి. జగన్ తాజా నిర్ణయంతో, అన్ని బీసీ కులాలకు సొంత కార్పొరేషన్ సమకూరినందున, సహజంగా ఆయా కులాలలో ఇది, జగన్‌పై సానుకూలత పెంచే అంశంగానే భావించక తప్పదు. అయితే... వీటికి బడ్జెట్, లబ్ధిదారులకు ఇచ్చే రుణాలు, పాలకమండలికి కార్యాలయాలు, వాహనాల ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇంతే దూకుడు ప్రదర్శించకపోతే, కొత్త కార్పోరేషన్ల ఏర్పాటు కంటితుడుపుగానే మిగిలిపోక తప్పదు.  -మార్తి సుబ్రహ్మణ్యం
అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.   పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.   ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.   ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.
  ఇంట్లోకి అడుగుపెట్టినవారు ఒక్క నిమిషం మీ డ్రాయింగ్‌ రూంని చూస్తూ ఉండిపోవాలనీ, వారి కళ్లో మీ అభిరుచి పట్ల అభినందన కనిపించాలనీ ఎవరికి మాత్రం అనిపించదు. అతిథుల సంగతి పక్కన పెడితే మనది అనుకునే ఇల్లు అందంగా కనిపించాలన్న ఆశ ఎవరికి మాత్రం ఉండదు. కాకపోతే ఇందుకు చాలానే అవాంతరాలు కనిపిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టడం ఇష్టం లేకపోవడం, ఇరుకైన గదులు, అద్దె ఇల్లులాంటి సమస్యలతో అనుకున్నా ఇంటిని అలంకరించుకోలేకపోతుంటారు. అందుకోసమే ఈ చిన్న చిట్కాలు...     మామూలు వస్తువులతోనే అలంకరణకు ఎక్కువ అవకాశం లేనప్పుడు నిత్యం వాడుకునే వస్తువులనే మరింత కళాత్మకంగా కనిపించేవి ఎన్నుకొంటే సరి. బట్టలు తగించే కొక్కేలు, కర్టెన్ రాడ్స్, పెన్‌స్టాండులు, గడియారాలు, నైట్‌ ల్యాంప్స్ వంటివి కొంచెం విభిన్నమైనవి ఎంచుకొని చూడండి.     వాల్‌ స్టికర్స్‌ ఆన్‌లైన్‌ షాపింగ్ పుణ్యమా అని ఇప్పుడు వాల్‌స్టికర్స్‌ అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నాయి. వీటి ధరలు కూడా మరీ అంత ఎక్కువగా ఉండవు. కాకపోతే ఎలాంటి బొమ్మని ఎంచుకోవాలి? అది ఎంత పరిమాణంలో ఉండాలి? అన్న విషయాలను ఒకటికి రెండుసార్లు తరచి చూసుకోవాలి. గోడ రంగుని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం ఆర్డర్‌ చేసిన వాల్ స్టికర్‌ ఒకే షీట్‌ మీద వస్తోందా లేకపోతే వేర్వేరు స్టికర్స్‌ని అసెంబుల్‌ చేసుకోవాలా అన్న విషయాన్ని కూడా గమనించుకోవాలి.     చిన్న చిన్న బొమ్మలతో ఇంట్లో చిన్న బొమ్మలు చాలానే పేరుకుంటాయి. చాక్లెట్లతో పాటుగా వచ్చినవో, చైనా బజార్లలో కొనుక్కున్నవో, కీచెయిన్లు ఊడిపోయినవో మిగిలిపోయిన బొమ్మలను అక్కడక్కడా అతికించవచ్చు. ఫ్రిజ్‌ తలుపులకీ, కిటికీ చెక్కలకీ, స్విచ్‌ బోర్డులకీ డబల్ స్టికర్‌తో అంటించి ఎప్పుడు కావాలంటే అప్పుడు తొలగించవచ్చు.     పోస్టర్స్‌ గృహాలంకరణకు సంబంధించి అతి చవకగా లభించేవి వాల్‌ పోస్టర్లే. కాకపోతే చవగ్గా దొరుకుతోంది కదా అని ఇల్లంతా నింపితే మాత్రం వీటితో అసలుకే మోసం వస్తుంది. మరీ భారీ పరిమాణంలో ఉండే పోస్టర్లు ఒకోసారి ఇల్లు ఇరుకుగా ఉన్న భావన కలిగిస్తాయి. కాబట్టి కంటికి నదురుగా, మరీ ఆడంబరంగా తోచని పోస్టర్లని ఎన్నుకోవాలి. వీటిని సెలోఫిన్‌ టేప్‌తో అతికిస్తే త్వరగా ఊడిపోవడమే కాకుండా, గోడ మీద కూడా మరకని మిగులుస్తాయి. ఇలాంటి సందర్భాలలో మెడికల్‌ షాపుల్లో దొరికే తెల్లటి సర్జికల్‌ టేపుని ఉపయోగిస్తే, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇటు గోడకీ, అటు పోస్టరుకీ నష్టం కలగకుండా తీసివేయవచ్చు.     ఉపాయం ఉంటే ఇల్లు మనది కాకపోవచ్చు, మేకులు కొట్టడం ఇష్టం లేకపోవచ్చు, గోడకి ఏదన్నా అంటించడానికీ మనస్కరించకపోవచ్చు... అయినా కూడా కాస్త శ్రద్ధ పెడితే గదిని అలంకరించేందుకు చాలా ఉపాయాలు తడతాయి. ఫ్రిజ్‌ మీద ఒక బొమ్మల కొలువు తీరుతుంది, బెడ్‌ల్యాంప్‌ నుంచి ఒక అందమైన బొమ్మ వేళ్లాడుతుంది, టీవీ కింద ఉన్న కేబుల్ బాక్స్‌ మీద ఒక టెడ్డీ బేర్‌ కూర్చుంటుంది... కాస్తంత ఉపాయం ఉంటే గది మొత్తం అందంగా మారిపోతుంది. కావాలంటే ఒక్కసారి మీ డ్రాయింగ్ రూమ్‌ని పరిశీలించి చూడండి. - నిర్జర.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ నానారకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను వేరొకరికి చెప్పుకుంటే చాలు, సగం తీరిపోతాయని వారి నమ్మకం. ఆఖరికి వైద్యుడి దగ్గరకు వెళ్లిన రోగి కూడా, తన మనసులో ఉన్న బాధని వైద్యునితో చెప్పుకునే అవకాశం వస్తే... సగం రోగం నుంచి ఉపశమనం పొందినంతగా తృప్తి చెందుతాడు. కానీ ఇతరుల బాధని పట్టించుకునే నాథుడు ఎవడు! అంత తీరికా, ఓపికా ఈ ప్రపంచంలో ఎవరికి ఉన్నాయి. అందుకనే అందరూ మాట్లాడటానికి ఇచ్చిన ప్రాముఖ్యతని, వినడానికి ఇవ్వడం లేదు. ఇతరుల మనసుని గెలవాలన్నా, సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నా... వినడం అనే కళలో ఆరితేరాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అందుకోసం వారు కొన్ని చిట్కాలను కూడా అందిస్తున్నారు. అవేమిటంటే...     తగిన వాతావరణాన్ని కల్పించండి చాలామంది ఇళ్లలోకి వెళ్లినప్పుడు... వాళ్లు ఒకపక్క మనతో మాట్లాడుతూనే ఉంటారు, మరో పక్క టీవీనో దినపత్రికో చూస్తూనే ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా చికాకుని కలిగిస్తాయి. ఒక వ్యక్తి చెప్పే మాటలని వినాలీ అంటే దానికి తగిన వాతావరణాన్ని సృష్టించాలి. రణగొణధ్వనుల మధ్యా, టీవీ శబ్దాల మధ్యా, నలుగురూ మెసిలే చోటా సంభాషణ సీదాసాదాగా సాగిపోతుందే కానీ మనసులో ఉన్న మాటలు నిస్సంకోచంగా వెల్లడి కావు.     శరీర భాష వినడం అంటే శూన్యంలో చూస్తూ ఉండిపోవడం కాదు. మాట్లాడే వ్యక్తికి మీరు ఆసక్తిగా వింటున్నారన్న భావన కలగాలి. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ఉండటం. మధ్యమధ్యలో తలని ఆడిస్తూ ఉంటడం, మెడని కాస్త ముందుకి వంచడం... వంటి సంకేతాల ద్వారా మీరు అవతలి వ్యక్తిని ఆలకిస్తున్నారన్న భావనని కల్పించగలగాలి.     ప్రోత్సహించండి మీ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోతే అవతలివారు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడరు. కాబట్టి మధ్యమధ్యలో వారి నుంచి మరింత సమాచారాన్నీ, మరింత స్పష్టతనీ రాబట్టేందుకు ప్రయత్నించండి. అవునా, అలాగా, నిజమే వంటి పదాలను వాడటం ద్వారా ‘నీ ఉద్దేశం ఏమిటి?’, ‘నువ్వేం చేద్దామని అనుకుంటున్నావు?’ వంటి ప్రశ్నల ద్వారా అవతలి వ్యక్తి తన మనసులో ఉన్న భావాలను పూర్తిగా వెల్లడించేందుకు అవకాశాన్ని ఇవ్వండి.   అడ్డుకోవద్దు ఇతరులు చెబుతున్న విషయం మీద మనకు విరుద్ధమైన అభిప్రాయాలు ఉండవచ్చు. అవతలి మనిషి చెప్పే విషయం మీద మనకే ఎక్కువ అవగాహన, తెలివి ఉన్నాయి అనిపించడమూ సహజమే! కానీ ఎదుటివారికి తన మనసులోని మాటని పూర్తిగా చెప్పే అవకాశాన్ని కల్పించాలి. అలా కాకుండా చీటికీమాటికీ అడ్డుకోవడం వల్ల మీకు అతని అభిప్రాయాల పట్ల ఏమాత్రం గౌరవం లేదన్న విషయం తేలిపోతుంది. ‘వినడం’ అన్న స్థానంలో ‘వాదన’ చోటుచేసుకుంటుంది.   కేవలం వినండి ఎదుటి వ్యక్తి మాటలను వింటూనే, మనం వాటి గురించి అప్పటికప్పుడు ఏదో ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉంటాము. అంటే వినడమూ, విశ్లేషణా ఏకకాలంలో జరిగిపోతూ ఉంటాయి. కొంతసేపటి తరువాత మనం ఏర్పరుచుకున్న అభిప్రాయానికి అనుగుణంగానే అతని పట్ల మన దృక్పథమూ మారిపోతుంది. ఇది నిజంగా తొందరపాటే అవుతుంది. అందుకే ముందు కాస్త స్థిమితంగా అవతలి వ్యక్తి చెప్పే మాటలన్నీ వినాలి, ఆ తరువాత వాటిని విశ్లేషించుకుకోవాలి, చివరికి ఒకటికి రెండుసార్లు ఆలోచించి అతను చెప్పిన విషయం మీద ఒక అవగాహనకు రావాలి.   అన్నింటికీ మించి ఎదుటి వ్యక్తికి కూడా మనలాగే భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన అభిప్రాయాలు ఉండే అర్హత ఉందని భావించిననాడు... ఒక సాటి మనిషిగా అతని విలువని గుర్తించినప్పుడు, అతని మాటలను కూడా శ్రద్ధగా ఆలకించాలని అనిపిస్తుంది. మన ఆలోచనే గొప్ప, మన వ్యక్తిత్వమే ఉన్నతం అనుకునే అహంకారంలో ఎవ్వరి మాటలూ వినిపించవు. వినిపించినా మనసులోకి చేరవు.   - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.