Next Page 
నిషా పేజి 1

                                                                       నిషా   
                                                                             --- పోల్కంపల్లి శాంతాదేవి
 
    వ్యాపారరీత్యా దాదాపు నెలరోజులపైగా గ్రామాంతరంలో గడిపిన రాజామోహన్ వంశీ ఆ రోజు ఊళ్ళో దిగాడు. దిగీ దిగడంతోటే వాచ్ మెన్ని పిలిపించి చెప్పాడు. "రేపు వేటకి సిద్దం చేయి. అమ్మగారు కూడా వస్తున్నారు. రెండుజీపులు మంచి కండిషన్ లో వుండేట్టు చూడు. కనీసం వారంరోజుల కాంప్ కి ఏర్పాట్లు చూడు."

    "మంచిది సాబ్" వినయంగా జవాబిచ్చాడు వాచ్ మెన్.

    రహమాన్ మోహనవంశి దగ్గర వాచ్ మెన్నేకాదు. షూటింగ్ లో మంచి నైపుణ్యం వున్నవాడు. షికారిలో రాజాసాబ్ మెప్పు పొందినవాడు. రాజాసాబ్ వేట ప్రోగ్రాం వేసుకున్నాడంటే రహమాన్ తప్పకుండా వెంట వుండాల్సిందే. మోహనవంశీకి వేట అంటే ప్రాణం. ఏది వదిలినా అది మాత్రం వదల్లేడాయన. నెలకీ, రెండునెలలకీ సమయం చిక్కించుకుని తన వేట దుగ్ధను తీర్చుకుంటుంటాడు.

    రెండు జీపులు, రెండు రైఫిల్స్, వారంరోజులకి సరిపడా ఆహార పదార్ధాలు, నలుగురు నౌకర్లు, ఇద్దరు డ్రైవర్లు రహమాన్.

    అట్టహాసంగా వీళ్ళిక్కడ ప్రయాణ సన్నాహామవుతుంటే అక్కడ కొన్ని కిలోమీటర్ల దూరంలో మరో ఊళ్లో తన భవంతిలో.

    ఉదయ కాంతారావు తన అనుచరులను సమావేశపరచి మోహనవంశీ చావుకు ముహూర్తం పెట్టాడు.

    "జంతువులను వేటాడ్డానికి మనవాళ్లు బయలుదేరుతున్నారు. వేట పేరుతో మత్యుదేవతకు స్వాగతం పలుకుతున్నాడు పాపం" వికటాట్టహాసం చేసాడు.

    ఉదయ కాంతరావు మోహనవంశీకి దాయాది. వరుసకు తమ్ముడు అవుతాడు. సప్తవ్యసనాలు అంటారే అవన్నీ అతడికి వుండడంవల్ల ఆస్తి హారతికర్పూరం కాగా శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు అతడి కన్ను మోహనవంశీ ఎస్టేట్ మీద పడింది.

    మాజీ సంస్థానాధిపతిగా మోహనవంశీకి స్థిర చరాస్థులకేమీ లోటులేదు. ప్రస్తుతం బిజినెస్ లో అతడి సంపాదన మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా వుంది.

    ఉదయకాంతారావు కళ్లు మోహనవంశీ ఎస్టేట్ మీద పడ్డానికి మరో కారణం కూడా వుంది.

    మోహనవంశీకి పెద్ద భార్యతో తెగతెంపులు అయిపోయి ఇరవై సంవత్సరాలైంది. ఆమకో కొడుకున్నా అతడితోనూ ఎటువంటి సంబంధం పెట్టుకోలేదు మోహనవంశీ. ఇక చిన్నామె సౌదామిని. ఇరవయ్యేళ్లుగా ఆమెతో కలసివున్నా వాళ్ళిద్దరికీ పెళ్లయిన . ధాకలాలులేవు, ఆమె రాజాసాబ్ వుంచుకున్న బాపతు అన్న అభిప్రాయమే ప్రజల్లో వుంది. సౌదామినికి ఒక కొడుకున్నా అతడక్కడ వుండడంలేదు. లండన్ లో స్థిరపడిన అతడి మేనమామ ప్రాపకంలో వుండి చదువుకుంటున్నాడు.

    "ముందు మోహనవంశీని, సౌదామినిని తప్పిస్తే సౌదామిని కొడుకును గడ్డిపరకలా తీసివేయవచ్చు. చంపడం అనవసరం అక్రమ సంతానం అన్న బురద చల్లితే చాలు. వాడే సిగ్గుతో పారిపోతాడు"

    అయితే మోహనవంశీని, సౌదామినిని పైకి పంపడానికి ముందు వాళ్లని బంధించి వాళ్లనుండి ఒక రహస్యం రాబట్టాలి.

    అది ఒక నిధికి సంబంధించిన రహస్యం. ఉదయకాంతారావు ముత్తాత రాజా వాసుదేవరావుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు సూర్యదేవరావు తండ్రి    దృష్టిలో దుర్మార్గుడిలా ముద్రపడడం వల్ల నిధి రహస్యం పెద్దకొడుక్కి చెప్పకుండా కన్నుమూసాడు. ఆ నిధి రహస్యం తమ్ముడు వరప్రసాదరావుకి చెప్పి వుంటాడని సూర్యదేవరావు అనుమానం. ప్రస్తుతం మోహనవంశీ పాడుపెట్టిన పాతకోట వాసుదేవరావు హయాంలో కట్టించబడింది. నిధి వుంటే ఆ పాతకోటలోనే ఎక్కడో వుంటుందని సూర్యదేవరావు నమ్మకం. ఆ కోటను తమ్ముడికిచ్చి తనకు మరో ఊళ్లో ఆస్తిని పంచి ఇచ్చి తండ్రి బ్రతికుండగానే తనని వెళ్లగొట్టాడని ఆయన మనవడు ఉదయకాంతారావుకి చెబుతుండేవాడు.

    ఉదయకాంతారావు తండ్రికి ఆయన కథలమీద నమ్మకముండేదికాదు. స్వయంకృషిమీద నమ్మకం వున్నవాడు కాబట్టి అటువంటి ఆశలుండేవికావు. ఉదయకాంతారావుకి మాత్రం అచ్చం తాతగారి పోలికలే వచ్చాయి రూపంలోను, గుణంలోను.

    "అతడి నుండి ఆ రహస్యం రాబట్టడం అన్న చిన్న మెలిక లేకపోతే అతడిని పైకి పంపడం చిటికెలో పని" మోహనవంశీని హతమార్చడంలో నాయకత్వం వహించబోతున్న రంజిత్ అన్న యువకుడు అన్నాడు.

    "అది చిన్న మెలిక కాదోయ్. మోహనవంశీ ప్రాణంకంటే వాడి ఎస్టేట్ కంటే విలువైనది నిధి. అపారమైన నిధి మా తాతగారు ఆ నిధి విషయం నా చిన్నప్పుడు తరచూ చెబుతూండేవాడు. జనంలోనూ ఆ నిధి విషయం బాగా ప్రచారంలో వుంది."

    "ఆ నిధి విషయం మోహనవంశీకి గాని, అతడి తండ్రికిగానీ తెలిసివుంటే ఇంతవరకు తీసుకురాకుండా ఎందుకు పెడతారు మీ పిచ్చిగానీ" 


Next Page 

  • WRITERS
    PUBLICATIONS