జంప్ సూట్స్ కి జంప్ అవుతారా?

పై నుండి కింద దాకా ఒకే రకమైన డిజైన్ తో ఒకే క్లాత్ తో తయారయ్యే వస్త్రాలను జంప్ సూట్స్ అని అంటారు. ఈ జంప్ సూట్స్ ప్రస్తుతం ఉన్న మహిళల ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన హవా సాగిస్తున్నాయి. పెద్ద పెద్ద సెలెబ్రిటీస్ జంప్ సూట్స్ తో దర్శనమిస్తూ జోష్ కనబరుస్తున్నారు. స్లీవ్ లెస్, ఫుల్ స్లీవ్, హాఫ్ స్లీవ్ తో అందుబాటులో ఉండే ఈ జుంపింగ్ సూట్ లు సాధారణ సమయాల్లో కంటే వింటర్ లో భలే బాగుంటాయి. 

ఏంటి వీటి ప్రత్యేకత అంటే..

సుధారణంగా మహిళలు ధరించే టాప్, ప్యాంట్ వేరు వేరుగా ఉంటాయి. అయితే ఈ జంప్ సూట్ లో ఇవి రెండూ కలిపి ఉంటాయి. దీనివల్ల ఈ దుస్తులు శరీరం మొత్తాన్ని కవర్ చేసినట్టు అనిపిస్తుంది.  సెలెబ్రిటీస్ అయితే ఈ జంప్ సూట్ లను విభిన్న రకాలు ధరించి హొయలు పోతుంటారు. అయితే ఈ జంప్ సూట్స్ మొదటి నుండి ఫ్యాషన్ లో భాగం కాదట. ఈ మాట వినగానే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. కానీ అంతకంటే ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే…. ఈ జంప్ సూట్స్ మొట్టమొదట పారచుట్ వినియోగించేవారు ధరించే దుస్తుల్లో భాగమట. ఆ తరువాత వీటిని మంచు ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కోసం, చలిని భరించడానికి తగినట్టుగా రూపొందించారట. 

స్పోర్ట్స్ లోనూ, సాహసకృత్యాలలోనూ వీటిని ధరించడం భాగంగా ఉండేది. ఆ తరువాత 2002 సంవత్సరం నుండి ఈ జంప్ సూట్స్ ను ఫ్యాషన్ లో భాగంగా తీసుకురావడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలకు ఇవి చాలా బాగా సెట్ అయిపోయాయి.

ప్రస్తుత కాలంలో అన్ని రకాలుగానూ అన్ని ఫాబ్రిక్ తోనూ ఈ జంప్ సూట్స్ కనువిందు చేస్తున్నాయి.  ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అప్పుడెప్పుడో పుట్టిన ఈ రకపు వస్త్రాధారణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోందనే చెప్పాలి. ఫ్యాషన్ నిపుణులు వీటిని మలుస్తున్న తీరు అమ్మాయిలకు వెర్రెక్కిస్తుంటాయి. అటు ఫ్యాషన్ గానూ, ఇటు చలికి శరీరాన్ని రక్షిస్తూనూ ఒకేసారి రెండు ప్రయోజనాలు చేకూర్చడం వీటిలో ఉన్న ప్రత్యేకత. ఫ్యాషన్ లో ఓలలాడే వనితలు ఈ జంప్ సూట్స్ ను తమ వార్డ్ రోబ్ లో కనీసం ఒక్కటైనా ఉంచుకోవాలి. లేకపోతే ఫ్యాషన్ కు కాస్త అర్థం తగ్గినట్టే… 

                                  ◆నిశ్శబ్ద.