చిన్నపిల్లలు పాలు తాగుతూ నిద్రపోతారు ఎందుకో తెలుసా?

ఎప్పుడైనా చిన్న పిల్లలను జాగ్రత్తగా గమనించినట్లయితే వారు పాలు తాగుతూ నిద్రపోవడం గమనించే ఉంటారు. వారు తల్లి ఒడిలో లేదా బాటిల్ పట్టుకుని పాలు తాగుతూ ఉండగానే మెల్లిగా కళ్ళు రెప్పవేయడం చూడవచ్చు. కొన్ని నిమిషాల్లోనే చిన్నపిల్లలు నిద్రపోతారు. చాలామంది దీన్ని గమనించినా దీని వెనుక ఉన్న అసలు కారణాన్ని మాత్రం తెలుసుకుని ఉండరు. అసలు చిన్న పిల్లలు పాలు తాగుతూ ఎందుకు నిద్రపోతారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
పిల్లలకు పాలు కంటే మెరుగైనది మరొకటి లేదు. ఇది పోషకాలను అందించడమే కాకుండా వారికి ఆకలి తీరుస్తుంది. శిశువు కడుపు నిండిన వెంటనే శరీరం రిలాక్స్డ్ మోడ్‌లోకి వెళుతుంది. ముఖ్యంగా తల్లి పాలు తాగేటప్పుడు శిశువు సురక్షితంగా, సుఖంగా ఫీలవుతారు. ఇది అతన్ని నిద్రపోయేలా చేస్తుంది.
పాలలో నిద్రను ప్రేరేపించే మూలకం ఉంటుంది..
పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఈ హార్మోన్లు మనస్సును ప్రశాంతపరుస్తాయి. నిద్రను ప్రేరేపించడంలో సహాయపడతాయి. అందువల్ల పిల్లలు పాలు తాగినప్పుడు, ఈ ప్రక్రియ వారి శరీరంలో వేగంగా జరుగుతుంది. వారికి నిద్ర రావడం ప్రారంభమవుతుంది.
పీల్చే ప్రభావం
పిల్లలు తమ తల్లి రొమ్మును లేదా సీసాను పీల్చినప్పుడు అది వారికి ఆహారం కోసం మాత్రమే కాదు, విశ్రాంతినిచ్చే ప్రక్రియ కూడా అవుతుంది. చప్పరించడం వల్ల వారి నోరు, ముఖంలోని కండరాలు సడలించబడతాయి. ఇది క్రమంగా వారిని నిద్రపోయేలా చేస్తుంది.
శక్తి ఖర్చు, అలసట..
పాలు తాగడం తేలికగా అనిపించవచ్చు. కానీ చిన్న పిల్లలకు ఇది చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ. వారు పాలు పీలుస్తున్నప్పుడు అలసిపోయి వెంటనే నిద్రపోతారు.
పాలు తాగుతూ పిల్లలు నిద్రపోవడం వారి శరీరంలో సహజంగా జరిగే అందమైన ప్రక్రియ. ఇది తల్లి-బిడ్డ బంధాన్ని మరింతగా పెంచుతుంది. శిశువుకు భద్రతను, హాయిని ఇస్తుంది.
*రూపశ్రీ.


.webp)
