మీ ఇంట్లోనే సమ్మర్ క్యాంప్

సమ్మర్ హాలిడేస్‌లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది అమ్మలకి పెద్ద ఛాలెంజ్. ఎండలు మండిపోతుంటే బయటకి వెళ్ళి ఆడతాం అంటారు.  లేదా అస్తమానం టీవీ చూస్తామంటారు... అంటూ కంప్లయింట్ చేసే అమ్మకి మంచి ఆప్షన్స్ తెలిస్తే బావుంటుంది కదా. మా అపార్ట్‌మెంట్‌లో 10 ఫ్లాట్స్ వున్నాయి. సో, సమ్మర్ రాగానే అన్ని ఫ్లాట్స్‌లోని పిల్లల్ని ఓచోట చేర్చి, వాల్ళని ఎలా ఎంగేజ్ చేయాలి? ఏమేమి నేర్పించాలి అన్నది ముందే నిర్ణయించేస్తారు. సో ఇక హాలిడేస్ మొదలవగానే మా అపార్ట్‌మెంట్‌లో హడావిడి మొదలవుతుంది. మా పై ఫ్లోర్లో అరుణ దగ్గర పిల్లల బుక్స్ మంచి కలెక్షన్ వుంది. సో, తను వాళ్ళ పిల్లల రూమ్‌లో రెండు రాక్‌లు పెట్టి దానినిండా ఆ పుస్తకాలు సర్దిపెడుతుంది.

ఓ లైబ్రరీలా చేసి, పిల్లలు అక్కడకి వచ్చి రీడింగ్ టైమ్‌ని స్పెండ్ చేసేలా చూస్తారు అరుణ. అలాగే పిల్లలు కొన్ని బుక్స్ ఇళ్ళకి తీసుకెళ్ళవచ్చు. అలాగే అక్కడే స్టోరీ అవర్ అని పిల్లలు ఒక్కొక్కరు తాము చదివిన పుస్తకాల్లోని కథలని మిగతా పిల్లలకి చెప్పాలి. దాని వలన పిల్లలు తాము తెలుసుకున్న విషయాలని అంతే చక్కగా అందరితో చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు. అలాగే పిల్లలందరూ కలసి ఓచోట చేరి ఆ పుస్తకాలలోని విషయాలపై చర్చించుకుంటారు. అలాగే వాళ్ళని స్వంతగా కథలు రాసేలా ప్రోత్సహిస్తారు. ఇక పిల్లలకి కొత్తకొత్త ప్రాంతాలు, సంస్కృతి సంప్రదాయాలని పరిచయం చేయడం మా థర్డ్ ఫ్లోర్‌లో శారద డ్యూటీ. ఆమె ఈ నెలరోజుల్లో పిల్లలతో రకరకాల  సంప్రదాయాలని ప్రతిబింబించేలా డ్రస్సు చేయించడం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు ఇవన్నీ మా శారదగారు ఎంతో ఇష్టంగా చేస్తారు.

ఎవరికి వారు వాళ్ళవాళ్ళ పిల్లల్ని ఒక్కరినే హ్యాండిల్ చేయడానికి ఎంత సమయం, సహనం కావాలో మరికొంతమంది పిల్లల్ని కూడా కలిపి వాళ్ళందరినీ చూడటానికి అంతే  సమయం పడుతుంది. పైగా పిల్లలందరూ ఓచోట చేరితో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. మా ఫస్ట్ ఫ్లోర్లో వుండే అనిత పిల్లలందరికీ డ్రాయింగ్, కుట్లు, అల్లికలు నేర్పిస్తారు. వాళ్ళ అత్తగారు సాయంత్రం అవగానే పిల్లలందర్నీ ఓచోట చేర్చి వాళ్ళకి తెలుగు పద్యాలు, పాటలు, స్తోత్రాల వంటివి నేర్పిస్తారు. ఇక ఈ హాలిడేస్‌లో పిల్లలకి ప్రతిరోజూ ఓ పిక్నిక్కే. ఎందుకంటే ప్రతీరోజు మధ్యాహ్నం లంచ్ ఎవరో ఒకరింట్లో వుంటుంది. పిల్లలకి నచ్చిన ఐటమ్స్ చేసి అందరినీ కలిపి బఫే పెడితే కబుర్లు, ఆటపాటలతో హాయిగా బొజ్జనిండా తింటారు పిల్లలు.

ఇక పిల్లల్ని బయటకి తీసుకువెళ్ళడం గురించి చెప్పాలంటే సాయంత్రం అవగానే పిల్లల్ని వాళ్ళ ఫాదర్స్ ఆఫీసు నుంచి రాగానే దగ్గర్లోని పార్క్‌కి తీసుకువెళతారు.  అలాగే ఆదవారాలలలో దగ్గర్లోని ప్లేసెస్‌కి పిక్నిక్- ఇలా ఈ నెలరోజులు ప్రతి పిల్లాడూ అపార్ట్‌మెంట్‌లోని మిగతా పిల్లలతోపాటు పెద్దవాళ్ళతో కూడా కలవటం, మాట్లాడటం చేస్తాడు. సో, సోషలైజేషన్ అలవాటయిపోతుంది వీళ్ళకి. అందరూ కలసినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ముఖ్యంగా 24 గంటలూ పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్న భయం వుండదు. ఎందుకంటే ఒకోరోజు ఒకరు. అలాగే రోజు మొత్తంలో ఒకో సమయంలో ఒకోరు పిల్లల బాధ్యత తీసుకుంటారు కాబట్టి మిగతావాళ్ళకి రెస్ట్ దొరుకుతుంది.

పిల్లలకి ఈ హాలిడేస్ జాలీడేస్‌లా అనిపించాలన్నా, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలన్నా, ఎన్నో లైఫ్ స్కిల్స్‌ని నేర్చుకోవాలన్నా ఇలా ఓ గ్రూప్‌గా చేరడం ఎంతో ముఖ్యం. సో, మీ ఇంట్లో పిల్లలకి మీరే ఓ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. ఆలోచించండి..

-రమ