అనుబంధంతో అల్లుకోండి

పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ...

పిల్లలతో సమయం గడపటం :

ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి. 

ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే.

-రమ