స్ట్రాబెర్రీలతో ఎక్‌స్ట్రా అందం

 

 

స్ట్రాబెర్రీలు... ఎర్రని రంగుతో, నోరూరించే పులుపుతో వుండే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలిసిందే కదా. అయితే ఆరోగ్యంతోపాటు అందానికీ ఈ స్ట్రాబెర్రీలు మంచివే. ఎలా అంటే, వీటిలో  చర్మాన్ని సంరక్షించే ఆల్ఫా - హైడ్రాక్సీ ఆమ్లం వుంటుంది. ఇది మృత కణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక విటమిన్ - సి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చర్మ సౌందర్యాన్ని పెంచేవే. స్ట్రాబెర్రీలలో అవన్నీ వున్నాయి. చాలా సులువుగా ఇంట్లోనే స్ట్రాబెర్రీలతో ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు.

స్ట్రాబెర్రీ - హనీ ప్యాక్

రెండు స్ట్రాబెర్రీ పండ్లను రసంగా చేసుకుని దానికి చెంచా తేనె, పాలమీగడ కలుపుకోవాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ముఖం తాజాగా కనిపిస్తుంది.


స్ట్రాబెర్రీ - లైమ్ ప్యాక్

టానింగ్‌కి ఇది మంచి ప్యాక్. ముఖంపై పిగ్మెంటేషన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలకి ఒక చెమ్చా నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. అలాగే స్ట్రాబెర్రీలని ఒక చెమ్చా బియ్యపు పిండితో కలిపి కూడా ప్యాక్‌గా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.

స్ట్రాబెర్రీ  - బనానా ప్యాక్

బాగా పండిన అరటిపండు గుజ్జు, స్ట్రాబెర్రీలు, ఒక కప్పు పెరుగు, ఒక చెమ్చా తేనె మెత్తగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడగాలి. ఇలా అందమైన స్ట్రాబెర్రీలు అందాన్ని పెంచడానికీ ఉపయోగపడ్తాయ్.

 

 


-రమ