ప్రస్తుతానికి ఆ ఇంట్లో జరిగిన ఆఖరిపెళ్ళి వాళ్ళదే మన్మథరావుకూ సామ్రాజ్యానికి ఏడాది క్రితం జరిగింది.
    
    సామ్రాజ్యం మన్మథరావుకు మేనమామ కూతురు.
    
    వైకుంఠంగారి భార్య....సామ్రాజ్యం తర్వాత పిల్ల శ్రీలక్ష్మిని కన్నా కొన్నాళ్ళకే చనిపోయింది. అప్పట్నుంచి ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు. సొంత ఊళ్ళో భూమీ పుత్రా మేడ వగైరాలు ఆయన పని మొదట్నుంచీ బాగానే వుంది. కొడుకులు లేరు. ఆడదిక్కు లేకుండా వున్న ఇద్దరి కూతుళ్ళను ప్రాణప్రదంగా సాకుతూ వస్తోంటే సామ్రాజ్యం పన్నెండోఏట ఆమెకి మాయదారి జబ్బు దాపురించింది. ఉన్నట్లుండి కాళ్ళు పడిపోయాయి. నడుము దగ్గర్నుంచీ క్రింద భాగం అసలు కదపలేని పరిస్థితి ఏర్పడింది. ఆయన కంగారుపడిపోయి ఆ ఊళ్ళో వైద్య సౌకర్యం లేనందున బెజవాడ తీసుకొచ్చి అక్కడ డాక్టర్లందరికీ చూపించాడు. అక్కడ నయంగాక గుంటూరు తీసుకెళ్ళి జనరల్ హాస్పిటల్ లో అయిదారు నెలలుంచి చూశాడు. అసలు జబ్బేమిటో డయగ్నైజ్ చెయ్యటం కూడా కష్టమైంది. అక్కడ్నుంచే పుండరీకాక్షయ్యగార్ని తీసుకుని రాయవెల్లూరు వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయిని నాలుగయిదు నెలలుంచి అన్ని పరీక్షలు చేశారు. ఎందరో డాక్టర్లువచ్చి చూసి వాళ్ళలోవాళ్ళు సంప్రదించుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలవల్లనో, సహజంగా రావలసివచ్చో కాళ్ళయితే మళ్ళీ వచ్చాయి గాని రోగంమాత్రం పూర్తిగా నయంకాలేదు. నెలకు వారం పదిరోజులు బాగానే వుంటుంది. ఉన్నట్టుండి నడుము పడిపోయినట్లయిపోయి రోజుల తరబడి మంచంమీదనుంచి లేవలేదు. అంతేగాక నడుం బద్దలు కొట్టేసినంత బాధతో విలవిల్లాడిపోతుంది. ఆ బాధ భరించలేక నొప్పి తగ్గే మాత్రలూ, నిద్రమాత్రలూ అలవాటు చేసుకుంది. అది వేసుకుని రోజులకి రోజులు మంచానికంటుకు పోయి ఎప్పుడో ఒక సాయంత్రం కళ్ళువిప్పుతూ గాఢ సుషుప్తిలో మునిగి వుంటుంది. సహజంగా హాస్యప్రియుడూ, జీవితాన్ని సాధ్యమైనంత తేలిగ్గా తీసుకునే స్వభావంగల వైకుంఠంగారు ఈ సమస్యకు తట్టుకోలేక సతమతమైపోయాడు. ఏళ్ళుగడిచి పిల్లకు వయసుకూడా వచ్చింది. చిన్నప్పటినుంచి ఈ అమ్మాయిని మన్మథరావుకని అనుకుంటూ వుండేవారు. పిల్ల ఇప్పుడు రోగిష్టిదాయిపోయింది. పుండరీకాక్షయ్యగారు ఒప్పుకుంటారా? ఆయన్తో ఈ సంగతి ఎలా కదపడం? ఆయన క్రిందామీదా పడసాగారు. తండ్రి ఆంతర్యం గ్రహించి సామ్రాజ్యం "నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి. నాన్నా! నా జీవితం నిరర్ధకమైపోయింది. నాకు పెళ్ళి జరిగితే అది యింకోరి జీవితాన్ని నాశనం చేసినట్టవుతుంది. నేనిలానే వుండిపోతాను. నాకే దిగులూ లేదు. అసలు నాకిలాగే బాగుంటుంది. మంచంమీద నుంచి లేవలేనిదానికి నాకు పెళ్లెందుకు నాన్నా? మొగాడితో సేవలు చేయించుకోడానికా? వద్దు నాన్నా! వద్దు శ్రీలక్ష్మికూడా పెద్దదయింది. దానికి పదిహేనేళ్ళు వచ్చాయి. బావకి శ్రీలక్ష్మినిచ్చి చెయ్యండి. నాకు సపర్యలు చెయ్యటానికా? మనకి డబ్బుందిగా? ఎవరో ఒకరు దొరుకుతారులే నాన్నా" అంది. కాని కూతురి వాదంతో వైకుంఠంగారు రాజీపడలేదు. శ్రీలక్ష్మి అందగత్తె ఆరోగ్యవంతమైన పిల్ల. దానికి చుట్టాల్లోనే వరసైనవారు బోలెడుమంది వున్నారు. పెద్దపిల్లను దాని కర్మాన వదిలేసి, చిన్నపిల్ల పెళ్ళి చేసేస్తే రేపొద్దున దానిగతేమిటి? తనుంటాడు, పోతాడు. ఒక బంధమంటూ లేకపోతే ఈ విశాల ప్రపంచంలో దానికి దిక్కెవరు? తనకు డబ్బుంది. పుండరీకాక్షయ్య బావ దీర్ఘంగా ఆలోచించ గలిగిన వ్యక్తి. వ్యవహారదక్షుడు గాని, దులిపేసుకునేరకం కాదు. అయినా తన ఆస్తంతా ఆడపిల్లలిద్దరిదేగా ఆ మాత్రం ఆలోచనాపరుడు కాదా బావ? ఇవన్నీ తనలో తానే బేరీజు వేసుకుని ఓ రోజు బెజవాడలోని పుండరీకాక్షయ్యగారింటి ముందుకు వచ్చి వ్రాలాడు. ఆయన మనసులోని సంగతి చెప్పీ చెప్పకముందే "నాకు తెలుసులేవయ్యా! కొత్తగా వర్ణించబోతావేమిటి? సామ్రాజ్యం ఈ భూమ్మీద పడినప్పుడే నా కోడలని నలుగురికీ చెప్పేశాను. మాట తప్పుతాననుకున్నావా? పిచ్చిబావ!" అని వెంటనే పురోహితుడ్ని పిలిపించి ముహూర్తం పెట్టించేశాడు. "అబ్బాయిని ఓమాటు కనుక్కుంటే...? అంటూ నసిగాడు వైకుంఠంగారు. ఈలోపలే అబ్బాయి నామాట దాటుతాడా? అయినా నీముందే తేల్చేస్తాగా. "అరేయ్ చిట్టీ చిట్టీ!" అని కేకేశాడు. ఆ యింట్లో అందరూ మన్మథరావుని "చిట్టీ!" అని పిలుస్తారు. అతనొచ్చి తల వంచుకుని నిలబడ్డాడు. సంగతి విన్నాక అతను చెప్పిన జవాబు వైకుంఠం గారికే కాక పుండరీకాక్షయ్యగారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. "సామ్రాజ్యం నా జన్మహక్కు దాన్ని నాకివ్వటం కోసం యింత ఆలోచనెందుకు? అసలు నాకుతప్ప మరొకరికిచ్చే ఆలోచన వస్తే సహించేదిలేదు" అన్నధోరణిలో మాట్లాడాడు. ఆ మాట అతను స్వార్ధబుద్దితో అనలేదు. అతిశయోక్తితో అనలేదు. చిత్తశుద్దితో అన్నాడు. అతనికి చిన్నప్పట్నుంచీ సామ్రాజ్యమంటే జాలి, ప్రేమ. ఆమె అంటే అతనికిష్టం. జీవితంలో ఒక రకం సాహసాలకి సిద్దపడేవారు ఆ సాహసప్రలోభంలో దాని ఫలితాలగురించి ముందుగా ఆలోచించటానికి తిరస్కరిస్తారు. పెళ్ళయిపోయింది. అల్లుడ్ని ఇల్లరికం తీసుకెళ్ళి వుంచుకునే ఆలోచన వైకుంఠంగారికి మనసులో మెదిలిందిగాని, శ్రీలక్ష్మి ఈవేళ గాకపోతే మరోనాడైనా యింకోయింటికి వెళ్ళవలసినపిల్ల. అప్పుడక్కడ ఈ రోగిష్టిదానికి సేవలు చెయ్యటాని కెవరుంటారు? ఇక్కడయితే పదిమంది మసులుతూ వుంటారు. ఎవరో ఒకరు ఆదుకుంటారు. తన ఆలోచన మార్చుకుని కూతుర్ని అక్కడే దిగవిడిచి వెళ్ళిపోయాడు.
    
    గుమ్మం దగ్గర నిలబడిపోయి వున్న సామ్రాజ్యానికి లోపల్నుంచి పెద్దాడబడుచు ధూంధాంలు, పిల్లల అల్లరి, మొగవాళ్ళు భోజనాలు చేస్తోన్న వాతావరణం తెలుస్తూనే వున్నాయి. తన పెనిమిటికి ఆఫీసుకు టైమయిందన్న సంగతి చప్పున గుర్తువచ్చింది. నెమ్మదిగా తమ గదిలోకెళ్ళింది. అతనికన్నీ అమర్చిపెట్టే ఆరోగ్యం, అవకాశం ఎప్పుడోగాని తనకి రావు. ఇలా తిరగగలిగినప్పుడైనా అవి తీర్చుకుని ఆనందం బావుకోనీ.
    
    సామ్రాజ్యం బీరువా తెరిచి కాఫీకలర్ ప్యాంటు, దానిమీదకు చెక్స్ తో మిలమిలలాడుతున్న టెరికాట్ స్లాక్ తీసింది. మన్మథరావు ఈ బట్టలు పెళ్ళప్పుడు కుట్టించుకున్నవి. పెళ్ళయ్యాక జరిగిన పార్టీలో ఈ బట్టలు వేసుకున్నాడు. అతనా డ్రెస్ లో వుంటే చూడటం ఆమెకెంతో ఇష్టం. ఈ ఏడాదికాలంలో మూడు నాలుగుసార్లన్నా ఎక్కువ వేసుకుని వుండడు. బహుశా ఆ మూడు నాలుగుసార్లు ఆమె మంచంమీదనే మగతలోనే పడివుండి, భర్తరూపాన్ని కళ్ళారా తిలకించలేకపోయింది.
    
    మన్మథరావు పెరట్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కుని గదిలోకి రాగానే సామ్రాజ్యం చేతిలో బట్టలతో అతనికెదురుగా వెళ్ళి "మీరీవేళ యివి వేసుకోవాలి" అంది గారాబంగా.