అతనామెవంక చూడలేకపోయాడు. ఉండలేకపోయాడు చూడకుండా.

 

    "నువ్వు కూడా చూడమ్మా మా వాడ్ని. అంత సిగ్గుపడితే ఎలాగ? మావాడు నీకు నచ్చాడో లేదో చూసుకో" అంటోంది లలితమ్మగారు.

 

    అందరూ పోరగా పోరగా జ్యోతి అతికష్టంమీద తన విశాలనేత్రాలను కొంచెం పైకి ఎత్తింది. ఆమెకు అతని పాదాలు కనిపించాయి. సున్నితమయిన తెల్లని పాదాలు, ఆ పాదాలనుండి ఏదో ఆమెను లాగినట్లయింది. వాటిని స్పర్శించినట్లు అనిపించింది. ఆమె పులకాంకిత అయింది. సిగ్గుపడి చప్పున కళ్ళని క్రిందకు వాల్చివేసింది.

 

    ఇంటికి వచ్చాక లలితమ్మగారికి దిగులు పట్టుకుంది. అంత చక్కని కోడలు అసలు తండ్రిమాట తీసివేయలేక మొక్కుబడి తీర్చుకోవటం కోసం వచ్చాడు కొడుకు. వొద్దంటాడేమో!

 

    ఆమె భయపడుతూ సుందరాన్ని అడిగింది. "ఎలా వుందిరా పెళ్ళికూతురు?"

 

    సుందరం తాను అక్కడికి వెళ్ళకముందు అన్నమాటలు మరచిపోయాడు. మనసులోది చెప్పటానికి అతనికి సిగ్గువేసింది. ఎలాగో గొంతు స్వాధీనం చేసుకుని "నాకు ఇష్టమేనమ్మా" అని తలప్రక్కకి త్రిప్పేసుకున్నాడు.

 

    లలితమ్మగారు సంతోషంతో ఉక్కిరిబిక్కిరయి కొన్నిక్షణాలు మాట్లాడలేక పోయింది.


                                                                    *  *  *


    అనేశాడేగాని ఆ క్షణంనుంచీ బాధపడనారంభించాడు సుందరం. తాను ఏమిటి తొందరపడి ఇలాంటి నిర్ణయానికి వచ్చేశాడు? తాను మామూలు మనిషి కాదు. తనలో లోపం వుంది. అది అన్యులెరగని లోపం. తాను వ్యాధిపీడితుడు. పెళ్ళిచేసుకుని మరోజీవితాన్ని అశాంతిపాలు చేయబోతున్నాడు. అన్యాయం చెయ్యబోతున్నాడు. అసలిది అన్యాయం చెయ్యటమవుతుందా? ఏం నేరం చేశాడు తను!

 

    అతనికి పాలుపోవటల్లేదు. జ్యోతిని చూశాక ఆ అపురూపమూర్తిని నిర్లక్ష్యం చేస్తే దూరమయిపోతుందనే భీతితో తల్లి అడగగానే ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. సమాధానంలేని ప్రశ్నలు. ఆకృతిలేని ఆరాటం.

 

    అవతల పెళ్లిప్రయత్నాలు జోరుగా సాగిపోతున్నాయి. ఇంత తొందర ముహూర్తం నిశ్చయింపబడుతుందని కలలోకూడా అనుకోలేదు. తల్లిదండ్రుల్ని చూసినా, అక్కచెల్లెళ్ళలో ఎవరి ముఖం చూసినా సిగ్గుతో చచ్చిన చావుగా వుంది. వీదిలోనికి వెళ్ళాలంటే సిగ్గేస్తోంది.

 

    అన్నిటినీ మించి తను తన మనస్తత్వం, అనారోగ్యం.

 

    ఏమయితేనేం. అతను ఎన్ని అనుకొంటేనేం, సుందరం పెళ్ళి జరిగిపోయింది.

 

    అతనికంతా ఇబ్బందే. పెళ్లిలో ఏవో తతంగాలు చాలా చేయిస్తారు. అబ్బ ఎలాగ అవి భరించటమనుకొన్నాడు. బంతులాడిస్తారు. బిందెలో ఉంగరంవేసి ఇద్దర్నీ చేతులుపెట్టి తీయమంటారు. పేర్లు చెప్పిస్తారు. ఈ తలంబ్రాలు తతంగం... ఎలా బాబూ?

 

    కాని తీరా అవి జరుగుతున్నప్పుడు అనుకొన్నంత కష్టమనిపించలేదు అతనికి. కాకపోగా హృదయంలో ఏమూలో ఆనందపు స్పర్శ కలిగింది.

 

    జ్యోతి! ఎప్పుడూ ఆమెని చూడాలనీ, మాట్లాడాలనీ తహతహగా వుండేది. అంతులేని మధురభావాలు. పీటలమీద ప్రక్క ప్రక్కన కూర్చున్నప్పుడు ఆమె స్పర్శకు అతనిలో విద్యుత్ ప్రవహించినట్లు వుండేది. అదేదో తాడులాంటిది ఇచ్చి ఆమె నడుముకు కట్టమన్నారు. అతనలా చేస్తోంటే ఆమె కాస్త తలత్రిప్పి ఓరగా చూసింది. ఆ భంగిమ అతని మనసులో ముద్రితమైపోయింది. మంగళసూత్రం కడుతున్నప్పుడు, తలంబ్రాలు పోసుకుంటున్నప్పుడు, విడిదింట్లో బంతులాడిస్తున్నప్పుడు అతనికి ఏమీ ఎబ్బెట్టు లేకపోగా అతను పులకాంకితుడు కాసాగాడు.

 

    మూడునిద్రలకు పెళ్లి జరిగిపోగానే అంతా కాకినాడ వచ్చారు. విందులతో, వేడుకలతో ఒకరోజు గడచిపోయింది. భార్యని చూడాలనే తహతాహ అణచుకోలేక సుందరం పెద్ద పనివున్నట్లు ఆ గదినుంచి యీ గదికి, యీ గదినుంచి ఆ గదికీ తిరుగుతూండేవాడు. ఆమె ఎక్కడ కూర్చుందో, ఆ చుట్టూ తారట్లాడుతూ వుండేవాడు. పెళ్ళికూతురితోబాటు ఆమె చెల్లెలూ, మేనత్తా వచ్చారు. "బావగారూ! అక్కయ్య ఆ గదిలో లేదండీ. ఈ మూల వుంది" అంటూ మరదలు పరిహాసం చేసేది.

 

    "బావగారూ! మాకు వూరు చూపెట్టరూ?" అనడిగింది మరదలు.

 

    "ఏముందండీ కాకినాడలో చూడడానికి? చడీ చప్పుడూ లేనివూరు."

 

    "బీచికి పోదామండీ" అంది ఉత్సాహంగా మరదలు.

 

    "ఇక్కడ బీచి ఎక్కడ వున్నదండీ. సముద్రం వుంది అంతే."

 

    "పోనీ సముద్రమే చూపెట్టండీ!"

 

    ఆ సాయంత్రం లలితమ్మగారుకూడా "వాళ్ళను అలా సముద్రం వైపు తీసుకుపోరా! నీ మరదలు ఒకటే గోలచేస్తోంది" అని బలవంతం చేసింది.

 

    సుందరం మనసులో కోరుకుంటూన్నదే అయినా యీ అలుముకున్న నూతన వాతావరణం అతడిని లజ్జితుడ్ని చేస్తోంది. ఎలాగో కారులో ఎక్కుతూ ఆశనుకూడా రమ్మని బలవంతం చేశాడు.

 

    "నేను రాను బాబూ! బయటకు చెప్పలేదుగానీ వదిన మనసులో విసుక్కుంటుంది" అని ఆశ నవ్వుతూ తప్పించుకుంది.

 

    జ్యోతికి సిగ్గుతో తల వాలిపోయింది.

 

    ముగ్గురు ప్రక్క ప్రక్కన కూర్చున్నారు. అతనికి భార్యను పలకరించాలని మనసు వువ్విళ్ళూరుతోంది. కాని సిగ్గుతెరలు క్రమ్మివేస్తున్నాయి. మరదలు మాట్లాడుతూంటే ఆమెకు జవాబులు చెబుతూ కూర్చున్నాడు.

 

    కారు సముద్రతీరందాకా పోదు. మధ్యలో రోడ్డు విరిగిపోతే బాగు చేస్తున్నారు. అందుకని అక్కడ కారుదిగి నడుస్తూ తీరానికి చేరుకున్నారు.

 

    "బావగారూ! ఈ సముద్రం పేరు ఏమిటి?" అనడిగింది మరదలు కుతూహలంగా.

 

    "బంగాళాఖాతం."

 

    "బాప్ రే! బంగాళాఖాతం అంటే ఇదేనా? మా జాగ్రఫీలో చదివి ఇంకా ఎక్కడో వుందనుకున్నాను. బంగాళాఖాతం కాకినాడలో వుందన్నమాట" అంటూ ఆ పిల్ల మిగతా ఇద్దరి ఉనికినీ క్రమంగా మరిచిపోయి అటూ ఇటూ పరిగెత్తుతూ, గవ్వలు ఏరుకుంటూ, యెండ్రకాయల్ని తరుముతూ మైమరచి పోయింది.