అమ్మ వళ్ళో పాపాయికి ఏమి కావాలి

''చిన్నమ్మాయి పిల్లలు ఎక్కడ ?'' అడిగింది అమ్మమ్మ. ''ఉన్నారు లేమ్మా , బయట అరుగుల పై  ఆడుకుంటున్నారు ''చెప్పింది అమ్మ. అరుగుల మీద నుండి దూకుతూ , మళ్ళీ ఎక్కుతూ ఉన్న నేను తొంగి చూసి నవ్వాను . మూడేళ్ళ పాప  ఉంటుంది ! చల్లని వెన్నెల మనసుని ఉంటుంది .ఆ  మనసు అమ్మమ్మది అయితే తనకు గంధం పూసినంత హాయిగా ఉంటుంది .
 
''నా తల్లే ఆడుకోమ్మా ,  అక్క ఏది ?'' అప్పటికి అక్క ,నేను ఇద్దరమే అమ్మకి . పెదమ్మ ,మావయ్య ఆ ఊరిలోనే కాబట్టి మేము ఒక్కరమే  సెలవల్లో వచ్చే చుట్టాలం. అందుకే అమ్మమ్మకి మేమంటే అంత మురిపం. ''రాణి అక్క , శైల అక్కతో ఎక్కడికో పోయింది. నేను వనజ ఆడుకుంటున్నాము '' పెద్దగా అరిచి చెప్పాను . చిన్నగానే తల్లి  .... నవ్వుతూ వారించింది అమ్మ .

''అది ఎందుకు చిన్నగా అరుస్తుంది !వాళ్ళ నాన్నకు ఆడ పిల్ల రెండో సారి వద్దు అంటే ,ఎందుకు వద్దు అంటావు అని గట్టిగా పుట్టేసింది. ఎవరికైనా జవాబు చెప్పాలంటే అదే '' నవ్వుతూ లోపలి వెళ్ళింది అమ్మమ్మ . అమ్మ కూడా నవ్వుకుంటూ బుగ్గ లాగి ముద్దు పెట్టుకొని పనిలో మునిగి పోయింది. నాకు ఇద్దరు ఆడ పిల్లలు అయితే ఏమిటి ,దేవుడు చందమామ లాంటి పిల్లలను ఇచ్చాడు . ఇద్దరు చక్కగా పెరిగితే చాలు . ... అనుకుంటూ లోపలి వెళ్లి పోయింది . ఆడుకొనే పిల్లలను బద్రంగా చూసుకొనే పని ఎప్పుడూ ఇంటి ముందు ఉండే ఎర్ర అరుగులదే !!అవి దాటి పిల్లలు ఎప్పుడూ రోడ్
మీదకు వెళ్ళరు .
                            

*************

''శశి ,అన్నం తిందువు రామ్మా '' అమ్మ పిలుపుకు సమాధానం చెప్పడానికి నేను అక్కడ ఉంటె కదా !! రెండు సార్లు పిలిచేసరికి అమ్మకి అనుమానం వచ్చింది . ఇల్లంతా వెతికింది. అక్కను అడిగినా ,పక్క వాళ్ళను అడిగినా ఒకే సమాధానం ''తెలియదు ,చూడలేదు ''అని. అమ్మమ్మకు ,అమ్మకు మావయ్య కు కంగారుగా ఉంది. ముఖ్యంగా పాప కనపడలేదు అంటే ,పాప నాన్నకు ఏమి సమాధానం చెప్పాలి. అసలే ఆయనకు కోపం ఎక్కువ . పాప పుట్టినాక కొద్ది రోజులు చూడటానికి కూడా రాలేదు . ఇప్పుడు పాప అంటే చాల ఇష్టం. అమ్మ కైతే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి . ఇంత చిన్న పాప ఎంత దూరం వెళ్లి ఉంటుంది ? కొంప తీసి ఎవరైనా చెవిలో కమ్మల కోసం ఎత్తుకొని వెళ్లి ఉంటె .... ఊహకే అమ్మ మనసు వణికి పోతుంది .

''నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమం గా ఉండాలి . తొందరగా దొరకాలి '' మనసులోనే ప్రార్ధన లు చేస్తూ ఉంది . తల్లి బాధ తెలియని వారెవరు ? చుట్టూ పక్కల వాళ్ళు అందరు చుట్టూ చేరి ఓదారుస్తూ ఉన్నారు ,కాని ఎవరైనా ఎత్తుకొని వెళ్లి ఉంటారా ,అనే ఆలోచన అందరిలో ఉంది. ఇంత చిన్న పాప దూరంగా వెళ్ళదు . కాబట్టి ఏమి అయి ఉంటుంది అని తర్జన బర్జనలు జరుగుతూ ఉన్నాయి . ఊరంతా టముకు వేయిస్తే దొరకొచ్చు .... ఒకరి సలహా. పోలీస్ రిపోర్ట్ ఇద్దాము .... ఇంకొకరి సలహా .
అందరు తలా ఒక వైపు వెళ్లి వెతుకుదాము ..... ఓక్కొక్కరు ఒక్కో మాట. ఒకరి సలహా కంటే ఒకరిది గొప్ప అని వాదన. వింటున్న అమ్మకి మాత్రం ఒకటే ఆలోచన ,తప్పి పోయి ఉంటె ఎలాగైనా  దొరుకుతుంది .

మనుషుల్లో ఇంకా కొంచెం పాపభీతి ఉంది . ఒక వేళ ఎవరైనా తీసుకెళ్ళి పోయి ఉంటె ..... ఈయనకి ఏమి చెప్పాలి ? పాప ఎలా ఉందొ !! మనసు భయం తో పరి పరి విధాల పోతూ ఏ సలహా ని స్వీకరించేటట్లు లేదు అమ్మకి . ఒకామె ముందుకు వచ్చి అడిగింది ''పాప తెల్లగా ఉంటుందా ?'' అవును గబుక్కున చెప్పింది అమ్మ . ''అయితే ఆ పాప ఇందాక అరుగు మీద నుండి దిగి తూముల
వైపు వెళ్ళింది . కాంతమ్మ మనుమరాళ్ళు తెల్లగా ఉండరు కదా అనుకున్నాను. ఈ పాపని ఎప్పుడూ చూడలేదు ''చెప్పింది. అందరికీ కొంత ఆశ . ఆ వైపు వెళ్లి చూస్తె దొరకొచ్చు.

''లేదు ,టముకు వేసే వాళ్ళను మాట్లాడండి . దొరుకుతుంది ''చెప్పింది అమ్మమ్మ. అప్పటికి పాప కనపడక రెండు గంటలు దాటిపోయి ఉంటుంది. ఇంటి ముందు మూగిన జనాలను చూసి  ఇంట్లోకి వచ్చాడు చిల్లర అంగడి పుల్లయ్య. ''ఏమి జరిగినదమ్మా ?'' అడిగాడు అమ్మమ్మని. ''చిన్నమ్మాయి రెండో కూతురు శశి కనపడటం లేదు '' కళ్ళ నీళ్ళు నింపుకుంటూ చెప్పింది అమ్మమ్మ. ఒక్క నిమిషం .... ఏదో ఆలోచిస్తూ చెప్పాడు . ఏమి చెపుతాడా అని అందరు అతని వైపు చూసారు. ''విష్ణాలయం దగ్గర గాజులు అమ్మే దాసరి వాళ్ళు ఎవరో పాప ఏడుస్తుంటే చూసాము అని చెప్పారు '' అందరికీ ఉత్సాహం . కాని అది కిలో మీటర్ పైనే దూరం . మూడేళ్ళ పాప ఇల్లు వదిలి అంత దూరం పోయి ఉంటుందా !! జరిగే పని కాదు.

''అయినా సరే వెళ్లి చూసి రండి సుబ్రహ్మణ్యం '' అమ్మ వేడికోలు. కడుపు కోత  ఎలా ఉంటుంది, తొమ్మిది నెలలు మోసి నొప్పులు పడి కన్న వాళ్లకు తెలుస్తుంది . ఒక అమ్మకే ఆ బాధ తెలుస్తుంది . సరే వెళ్లి చూసి వస్తాము ,అమ్మ మాట కాదు అనలేక మావయ్య ,పుల్లయ్యతో బయలు దేరి వెళ్ళాడు ..... కాని మన పాప అయి ఉంటుంది అనే నమ్మకం లేదు .
                         

*********

''అమ్మా ఇక్కడ పాప ఏడుస్తూ కనిపించింది అంట , ఆ పాప ఏది '' దాసరి వాళ్ళను అడిగారు . వాళ్ళు బయటకు వచ్చి వివరాలు అడిగారు ''అవును బాబు పిల్ల బొద్దుగానే ఉంది. ఎవరో సెట్టిగార్ల అమ్మాయి కొత్త బజారు నుండి తప్పి పోయి ఉంటుంది అని ,పక్కన ఉండే సెట్టిగార్ల ఇంటిలో వదిలి పెట్టాము '' చెప్పారు అనునయంగా .

ఒక్క ఊరుకున పరిగెత్తారు అక్కడకు. మా పాపే కావాలి అని కోటి దండాలు మనసులోనే పెట్టుకుంటూ తొంగి చూసారు ఇంటి లోకి. కంచం లో అన్నం తింటూ చిన్న పాప. ''మావయ్య రా .... రా , చామ గడ్డల పులుసు భలే ఉంది. అన్నం తిందువు '' ప్రేమగా చేతిలో ముద్ద ఉంచుకొని పిలిచింది. ''నా తల్లే నా బంగారే , అక్కడ మీ అమ్మ కంటి నిండా నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంది. దామ్మా '' మావయ్య చేయి కడిగి ఎత్తుకున్నాడు.

''కొంచెం సేపు ఏడ్చింది కాని ,అన్నం పెడితే తినేసింది . పాపం బాగా ఆకలిగా ఉన్నట్లు ఉంది . ఎవరి పాపవి అని అడిగితే ''అమ్మ పాపని '' అంటుంది . ఏమి చెప్పలేదు . పోలీస్ స్టేషన్ లో చెపుదాము అనుకుంటున్నాము '' నవ్వుతూ అన్నారు వాళ్ళు . మావయ్య సంతోషంగా ముద్దు పెట్టుకొని ''నువ్వు అమ్మ పాపవే లెమ్మా ,మంచి పని చేసావు ఈ రోజు ''అని ఇంటికి తీసుకొని వెళ్ళాడు . నన్ను చూడగానే అమ్మ మనసుకు సంతోషం ,ఎత్తుకొని ''భడవా ,ఎంత కంగారు పెట్టావు ?ఏమై ఉంటావో అని భయం వేసింది ''అంది . అమ్మ వళ్ళో  ఊగుతూ ''ఉన్నాను లేమ్మా , చామ గడ్డాల పులుసు ఎంత బాగుందో తెలుసా ,నీకు తేలేదు ,నేనే తిన్నాను ''ముద్దుగా చెప్పాను . ''నాకు నీ కంటే రుచికరం అయింది ఏమి లేదులే తల్లి '' నుదుటి మీద ముద్దు పెట్టింది అమ్మ .

''పోతే పోనీలేవే చిన్న అమ్మాయి . శశి పోతే ఏమైంది , రాణి ఉందిగా '' నవ్వుతూ ఆట పట్టించింది అమ్మమ్మ . '' ఎంత మంది ఆడ పిల్లలు ఉంటె మాత్రం తల్లికి అందరు కావాలి . ఆడ పిల్లలు అయితే ఏమిటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు కావాలి అని దేవుడు వ్రాసి ఉన్నాడో ! తల్లికి ఎందరు ఉన్నా ఒక్కరు బరువు కారు '' చెప్పింది అమ్మ వడిలో నన్ను ఉంచుకొని . అమ్మమ్మకు తెలియని అమ్మ మనసా ? ముగ్గురు పిల్లలు పుట్టినాక తాతయ్య చనిపోతే పిల్లలని కళ్ళలో పెట్టుకొని తల్లిగా ఎంత కష్టపడి సాకింది .

ఎప్పటి కధ ఇది ?అనడ్రు ఒకరి కష్టాలు ,సుఖాలు పంచుకొనే కాలం లోది. ఒకరి కోసం ఒకరు కన్నీళ్లు పెట్టె కాలం లోది . పిల్లలు పుట్టడం అంటే , వారు బ్రతికి బట్ట కట్టడం అంటే గొప్ప విషయం అనుకునే కాలం లోది. న్యాయంగా , ధర్మంగా బ్రతికితే ఆ ధర్మమే మన బిడ్డలను కాపాడుతుంది అనుకొనే కాలం లోది . మనకు ఉన్న దానిలోనే కొంత అన్నం ఆకలికొన్న వాళ్లకు పెట్టె కాలం లోది. ఏ కాలం అయినా మారనిది ఒకటే ..... అదే అమ్మ మనసు.

వాయుగుండ్ల శశికళ.