ఉద్యోగంలో ఫిట్... తల్లిగా సూపర్ హిట్

 

 

 

కాలం మారింది. కాలంతో పాటుగా ఆడవారి ప్రయాణమూ మారింది. ప్రతి రంగంలోనూ మగవారికి తీసిపోకుండా దూసుకుపోతున్నారు. కానీ ఆ హడావుడిలో తల్లిగా తమ బాధ్యతని ఏమాత్రం విస్మరించడంలేదు. అందుకు సాక్ష్యంగా బ్యాంకింగ్, క్రీడలు, సమాజసేవ, రక్షణ రంగం.... ఇలా నాలుగు రంగాల్లో అద్భుతాలు సృష్టించిన  మాతృమూర్తులు వీరు.

చందాకొచ్చర్:

 

23 ఏళ్ల వయసులోనే ICICI బ్యాంక్ ఉద్యోగినిగా అడుగుపెట్టారు చందాకొచ్చర్. ఉద్యోగంలో అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు అదే బ్యాంక్‌కు CEOగా మారారు. కానీ తల్లిగా తన పిల్లలకి ఏలోటూ రానీయలేదు. అందుకనే ‘నువ్వు ఉద్యోగంలో అన్ని బరువుబాధ్యతలని మోస్తున్నావనీ కానీ, ఎంతో ఒత్తిడిని భరిస్తున్నావని కానీ మాకు తెలియనీయలేదు. ఇంట్లో నువ్వు ఒక అమ్మలా మాత్రమే మెలిగేదానివి,’ అంటుంది ఆమె కూతురు ఆరతి. చందాకొచ్చర్ మాత్రం ఇందులో అద్భుతమేమీ లేదంటారు. జీవితంలోని ఆటుపోట్లని తట్టుకొంటూనే కుటుంబానికి ప్రేమని పంచే స్థైర్యం తన తల్లి నుంచే వచ్చిందంటారు. కాదనగలమా!

మేరీ కాం:

ఆడవాళ్లు బాక్సింగ్‌లోకి అడుగుపెట్టడమే అసాధ్యం. ఒక వేళ అడుగుపెట్టినా పెళ్లయిన తర్వాత బరిలోంచి తప్పుకోవాల్సిందే అని ఓ అభిప్రాయం. ఆ మాటలని కొట్టిపారేస్తారు మేరీ కాం. దీనికి ఆమె విజయాలే ఉదాహరణ. మణిపూర్‌లోని ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన మేరీ కాం, అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయస్థాయికి చేరుకున్నారు. ఒక పక్క కెరీర్‌ను కొనసాగిస్తూనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక మళ్లీ బరిలోకి దిగి ఒలింపిక్స్‌లో పతకాన్ని కూడా గెలుచుకున్నారు. అర్థం చేసుకునే కుటుంబం తోడుంటే ఆకాశమే హద్దుగా సాగిపోవచ్చునంటారు మేరీ కాం. కాదనగలమా!

కిరణ్ బేడి:

 

కిరణ్ బేడి గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరమే లేదు! ఒక తరం మహిళలు ఆమెను ఆరాధిస్తూ, అనుసరిస్తూ పెరిగారు. ఢిల్లీ ట్రాఫిక్ని అదుపుచేయడం దగ్గర్నుంచీ, తీహార్ జైల్లో మార్పులు తేవడం వరకూ కిరణ్ సాధించిన విజయాల జాబితా చాలా పెద్దదే! క్రీడాకారిణిగా, పోలీస్ ఉన్నతాధికారిగా, రాజకీయవేత్తగా, సమాజసేవికగా, పుదుచ్చేరి గవర్నరుగా ఆమె చాలా పాత్రలే పోషించారు. కానీ తల్లిగా తన బాధ్యతను విస్మరించలేదు. బాధ్యత అంటే 24 గంటలూ ఇంట్లో ఉండటం కాకపోవచ్చు! కిరణ్ తన ఒక్కగానొక్క కూతురు సైనాకి జీవితం అంటే ఏంటో నేర్పారు. అందుకే సైనా ఇప్పుడు నలుగురూ మెచ్చుకునే సమాజసేవికలా మారింది. ‘ఈ దేశంలో అవినీతి లేకుండా చేయడమే నా లక్ష్యం. నా మనవరాలికి ఇంతకంటే గొప్ప బహుమానం ఏమివ్వగలను’ అని సైనాతో అంటారట కిరణ్. కాదనగలమా!

టెస్సీ థామస్:

 

 

ఏదో మాటవరసకి ఆడవారు ఆకాశంలో సగం అంటూ ఉంటారు. కానీ ఆ మాటని నిజం చేసేవరకూ నిద్రపోలేదు కొందరు. అందుకు రుజువు కావాలంటే ‘క్షిపణ మహిళ’ టెస్సీ థామస్‌ను తల్చుకుంటే సరి. అబ్దుల్ కలామ్ సహాయకురాలిగా అడుగుపెట్టిన టెస్సీ ఆయన ఆశయాన్ని కొనసాగించే వారసురాలిగా నిలిచారు. శత్రు దేశాలను వణికించేలా, అగ్ని క్షిపణి ప్రాజెక్టుని ముందుకి నడిపించారు. టెస్సీ భర్త నౌకాదళంలో పనిచేయడంతో, ఆయన ఎప్పుడూ ఇంటికి దూరంగా ఉండేవారు. దాంతో ఉద్యోగాన్ని, పిల్లవాడినీ చూసుకోవాల్సిన బాధ్యత టెస్సీ మీదే ఉండేది. కానీ ‘అటు ఉద్యోగం పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తిగా, ఇటు బాధ్యతాయుతమైన తల్లిగా... శాస్త్రవేత్తలుగా మారాలనుకునే మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు టెస్సీ’ అంటోంది భారతీయ మహిళా శాస్త్రవేత్తల సంఘం. కాదనగలమా!

- నిర్జర.